పుదుచ్చేరిలో తొలగని కరెంటు కష్టాలు

ABN , First Publish Date - 2022-10-03T09:06:39+05:30 IST

పుదుచ్చేరిలో కరెంటు కష్టాలు కొనసాగుతున్నాయి.

పుదుచ్చేరిలో తొలగని కరెంటు కష్టాలు

కొనసాగుతున్న అంధకారం.. సమ్మెలోనే ఉద్యోగులు, కార్మికులు


సబ్‌-స్టేషన్లలో ఫ్యూజ్‌ క్యారియర్లను ఎత్తుకెళ్లిన ఉద్యోగులు

గ్రామీణ ప్రాంతాల్లో కరెంటు తీగలు కట్‌

సమ్మె వీడకుంటే ఎస్మా : గవర్నర్‌ తమిళిసై

పుదుచ్చేరి, అక్టోబరు 2: పుదుచ్చేరిలో కరెంటు కష్టాలు కొనసాగుతున్నాయి. విద్యుత్తు పంపిణీ వ్యవస్థ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని నిరసిస్తూ విద్యుత్తు ఉద్యోగులు, ఇంజనీర్లు చేస్తున్న నిరవధిక సమ్మె ఆదివారం ఐదో రోజుకు చేరుకుంది. శనివారం సాయంత్రం నుంచి కరెంటు సరఫరా నిలిచిపోవడంతో అంధకారం నెలకొంది. దీంతో ఎక్కడికక్కడ ప్రజలు రోడ్డెక్కారు. ఆదివారం మధ్యాహ్నం వరకు ప్రజల ఆందోళనలు కొనసాగడంతో కీలక జాతీయ రహదారులపై ట్రాఫిక్‌ స్తంభించిపోయింది. ప్రధాన సబ్‌-స్టేషన్లలో విద్యుత్తు ఫూజ్‌ క్యారియర్లను ఉద్యోగులు ఎత్తుకెళ్లడంతో అంతటా అంధకారం అలుముకుందని పుదుచ్చేరి విద్యుత్తు, హోంశాఖల మంత్రి నమశ్శివాయమ్‌ పేర్కొన్నారు. ‘‘అర్ధరాత్రి నుంచి కేంద్ర పవర్‌ గ్రిడ్‌ ఉద్యోగుల సాయంతో 16 కీలక సబ్‌-స్టేషన్లలో విద్యుత్తును పునరుద్ధరించాం. ఫ్యూజ్‌ క్యారియర్లను ఎత్తుకెళ్లినట్లుగా గుర్తించిన ఐదుగురు ఉద్యోగులపై క్రిమినల్‌ కేసులు నమోదు చేశాం. పట్టణ ప్రాంతాల్లో విద్యుత్తును పునరుద్ధరించగలిగాం. కానీ, గ్రామీణ ప్రాంతాల్లో విద్యుత్తు స్తంభాలపై వైర్లను కట్‌ చేశారు. కొన్ని చోట్ల పొలాల్లోనూ తెగిపడిన కరెంటు తీగలున్నాయి. ఆయా ఘటనలకు బాధ్యులపై కేసులు పెట్టాం’’ అని ఆయన వివరించారు. పుదుచ్చేరి లెఫ్టెనెంట్‌ గవర్నర్‌ తమిళిసై సౌందర్‌రాజన్‌ గాంధీ ఉద్యోగుల సమ్మెపై తీవ్రంగా స్పందించారు. వెంటనే సమ్మెను విరమించి, విధుల్లో చేరాలి. ప్రజలకు నష్టం కలిగితే ఊరుకునేది లేదు. సమ్మె చేస్తున్న వారిపై ఎస్మా చట్టాన్ని ప్రయోగిస్తాం’’ అని హెచ్చరించారు.


పోలీసుల వలయంలో సబ్‌-స్టేషన్లు

ప్రభుత్వం కీలకమైన 16 సబ్‌-స్టేషన్ల పరిధిలో కేంద్ర పవర్‌ గ్రిడ్‌ ఉద్యోగులు, కాంట్రాక్టు కార్మికుల సాయంతో విద్యుత్తును పునరుద్ధరించింది. ఆ సబ్‌-స్టేషన్ల చుట్టూ సీఆర్పీఎఫ్‌ బలగాలతో భద్రత ఏర్పాట్లు చేసింది. స్థానిక పోలీసులు సబ్‌-స్టేషన్లకు దారితీసే మార్గాల్లో పికెట్‌లను ఏర్పాటు చేశారు. సమ్మెలో ఉన్న ఉద్యోగులు, ఇంజనీర్లు, కార్మికులు అటువైపు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.


ఉధృత స్థాయిలో ప్రజాగ్రహం..!

విద్యుత్తు పునరుద్ధరణ డిమాండ్‌తో పుదుచ్చేరి వ్యాప్తంగా ప్రజలు ఎక్కడికక్కడ రాస్తారోకోలు చేశారు. పుదుచ్చేరి, కరైకల్‌, మాహేతోపాటు యానాంలోనూ విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది. ఆదివారం ఉదయం గింజిసలాయ్‌, తుత్తిపేట్‌, పథుకన్ను ప్రాంతాల్లో ప్రజలు ట్రాఫిక్‌ను స్తంభింపజేశారు. బస్‌స్టేషన్ల వద్ద బైఠాయించి.. ఆర్టీసీ బస్సులను తిరగనీయకుండా అడ్డుకున్నారు. పుదుచ్చేరి-విల్లుపురం, కరైకల్‌-తిరువారూర్‌ తదితర జాతీయ రహదారులపై శనివారం అర్ధరాత్రి నుంచే.. 7-8 కిలోమీటర్ల మేర ట్రాఫిక్‌ స్తంభించిపోయింది. పోలీసులు కూడా ప్రజలను అదుపుచేసే పరిస్థితులు లేక చేతులెత్తేశారు.

Updated Date - 2022-10-03T09:06:39+05:30 IST