ధరణిలో నమోదుకాని భూములు

ABN , First Publish Date - 2022-01-18T05:49:55+05:30 IST

పట్టాదారు పుస్తకాలు ఉండీ.. భూములను కాస్తు చేసుకుంటున్నా.. ఆ భూముల వివరాలు రెవెన్యూ అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యం వల్ల ధరణి వెబ్‌సైట్‌లో నమోదు కాలేదు.

ధరణిలో నమోదుకాని భూములు

- పట్టాదారు పాసుపుస్తకాలు ఉన్నా లభించని హక్కులు

- కొత్త పాసు పుస్తకాల కోసం కలెక్టరేట్‌ చుట్టూ ప్రదక్షిణలు

- అందని రైతుబంధు.. ఆందోళనలో లబ్ధిదారులు

(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి)

పట్టాదారు పుస్తకాలు ఉండీ.. భూములను కాస్తు చేసుకుంటున్నా.. ఆ భూముల వివరాలు రెవెన్యూ అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యం వల్ల ధరణి వెబ్‌సైట్‌లో నమోదు కాలేదు. దీంతో నష్టపోతున్న పలువురు రైతులు కొత్త పాసు పుస్తకాలను జారీ చేయాలని కలెక్టరేట్‌ చుట్టూ తిరుగుతున్నారు. అయినా కూడా సమస్య పరిష్కారం కాక ఇబ్బందులు పడుతున్నారు. భూ రికార్డుల నవీకరించేందుకు గాను రాష్ట్ర ప్రభుత్వం 2016లో భూప్రక్షాళనకు శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా అప్పటివరకు రెవెన్యూ రికార్డుల్లో భూయాజమాన్య హక్కులతో కూడిన పట్టాదారు పాసు పుస్తకాలు కలిగిన వారి భూముల వివరాలను నవీకరించారు. ఆ భూములకు సంబంధించి పట్టాదారుల నుంచి రెవెన్యూ సిబ్బంది వివరాలను సైతం సేకరించారు. ఆ వివరాలను ధరణి వెబ్‌సైట్‌లో నమోదు చేశారు. పట్టాదారు పాసు పుస్తకాలను ట్యాంపరింగ్‌ చేయకుండా ఉండేందుకు వీలుగా కొత్తగా రూపొందించిన హైసెక్యూరిటీ గల పాసు పుస్తకాలను ప్రభుత్వం పట్టాదారులకు జారీచేసింది. ఇందులో చోటుచేసుకున్న తప్పొప్పులను సవరించింది. ఈక్రమంలో కొందరు రైతులకు సంబంధించి పట్టాదారు పాసు పుస్తకాలు జారీ కాకపోగా, అసైన్డ్‌ భూములు కలిగిన వారికి కూడా పాత పట్టాదారు పుస్తకాలను అనుసరించి కూడా కొత్త పట్టాదారు పాసుపుస్తకాలను జారీ చేయలేదు. 2020లో కొత్త రెవెన్యూ చట్టాన్ని అమల్లోకి తీసుకవచ్చిన ప్రభుత్వం ధరణి వెబ్‌సైట్‌ను లాక్‌ చేసి, వ్యవసాయ భూముల క్రయ,విక్రయాలను నవంబర్‌ నుంచి మండల తహసీల్దార్‌ కార్యాలయాల ద్వారానే చేపట్టింది. స్లాట్‌ బుకింగ్‌ చేసుకున్న తర్వాత ఒక్క రోజులోనే భూముల రిజిస్ట్రేషన్‌ పూర్తిచేసి అదేరోజు పట్టాదారు పాసుపుస్తకాలను జారీ చేయడం ప్రారంభించింది. అప్పటికి ఎలాంటి భూములు లేక కొత్తగా భూములను కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్‌ చేసుకున్న వారికి మాత్రం వారంరోజుల్లో పాసుపుస్తకాలను జారీ చేస్తున్నారు. దీనికంటే ముందు రికార్డులకు ఎక్కని రైతుల భూములకు పట్టాదారు పాసు పుస్తకాలను జారీ చేసేందుకు ధరణి పోర్టల్‌ ద్వారా ఆప్షన్లు ఇవ్వకపోవడంతో జిల్లాలో అనేక మంది జిల్లా కలెక్టర్‌ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు. 

అధికారుల చుట్టూ ప్రదక్షిణలు

జిల్లాలో రామగిరి మండలం ఎల్కలపహాడ్‌ గ్రామానికి చెందిన దాసారపు శ్రీదేవి, దాసారపు సమ్మక్క, పోలు కనుకమ్మ, బొజ్జ సమ్మక్క, తదితరులకు సర్వే నంబర్లు 8, 14లో అసైన్‌మెంట్‌ ద్వారా పంపిణీ చేసిన భూములకు వారసత్వంగా పట్టాదారు పాసుపుస్తకాలు పొందారు. ఈ భూములపై బ్యాంకుల్లో పంట రుణాలను సైతం తీసుకున్నారు. నిబంధనల ప్రకారం ధరణి వెబ్‌సైట్‌లో భూముల వివరాలు నమోదై పట్టాదారు పాసు పుస్తకాలు జారీ కావాల్సి ఉన్నప్పటికీ, తమ వివరాలు ధరణిలో లేవని వాపోతున్నారు. ఈ విషయమై ఇప్పటికే నాలుగైదుసార్లు కలెక్టర్‌కు విన్నవించామని చెబుతున్నారు. మరోసారి తమ భూముల సమస్య పరిష్కరించాలంటూ సోమవారం కలెక్టరేట్‌కు వచ్చారు. ఇలా వీరే కాకుండా అనేక మంది రైతులు రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. ధరణిలో భూముల వివరాలు నమోదు కాక పట్టాదారు పాసుపుస్తకాలు జారీకాకపోవడంతో సదరు రైతులకు ప్రభుత్వం అమలుచేస్తున్న రైతుబంధు పథకం ద్వారా వచ్చే డబ్బులు రాకపోవడంతో పాటు రైతుబీమా పథకానికి నోచుకోవడం లేదు. ప్రభుత్వం వెంటనే స్పందించి తమ సమస్యను పరిష్కరించి పట్టాదారు పాసు పుస్తకాలు జారీచేయాలని కోరుతున్నారు. ఈ విషయమై అదనపు కలెక్టర్‌ వి లక్ష్మీనారాయణను ‘ఆంధ్రజ్యోతి’ వివరణ కోరగా ధరణిలో ఆప్షన్‌ రాలేదని, సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకవెళ్లామని చెప్పారు. 

Updated Date - 2022-01-18T05:49:55+05:30 IST