Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement
Published: Tue, 25 Jan 2022 23:45:51 IST

పది లక్షలు ఇస్తమని పది పైసలు ఇవ్వలే!

twitter-iconwatsapp-iconfb-icon
పది లక్షలు ఇస్తమని పది పైసలు ఇవ్వలే!

మూడేళ్లు గడిచినా ‘ఏకగ్రీవ’ పంచాయతీలకు అందని ప్రభుత్వ ప్రోత్సాహం

రూ.10 లక్షలు ఇస్తామని ప్రభుత్వ ప్రకటన

సిద్దిపేట జిల్లాలో 48 పంచాయతీలు ఏకగ్రీవం

నిధులే లేక ఆగిన అభివృద్ధి 

ఏడాదిలో మళ్లీ ఎన్నికల సీజన్‌

ప్రజాగ్రహం తప్పదంటున్న నేతలు


ఆంధ్రజ్యోతి ప్రతినిధి, సిద్దిపేట, జనవరి 25: పంచాయతీ పాలకవర్గాలను ఏకగ్రీవంగా ఎన్నుకుంటే రూ. 10 లక్షలు ఇస్తానని ప్రకటించిన సర్కారు మూడేళ్లయినా పది పైసలు కూడా ఇవ్వలేదు. అభివృద్ధి పనులకు నిధులొస్తాయనే ఉద్దేశంతో అప్పట్లో గ్రామస్థులంతా ఏకాభిప్రాయంతో సర్పంచ్‌, వార్డు మెంబర్లను ఎన్నుకున్నారు. వీటిలో అత్యధికం అధికార పార్టీకి అనుకూలంగానే జరిగాయి. ప్రోత్సాహకంగా వచ్చే నిధులతో పలు పనులు చేస్తామని నాయకులు హామీలు కూడా ఇచ్చారు. కానీ ప్రభుత్వం మొండిచేయి చూపడంతో ఆశలు అడియాసలయ్యాయి. వచ్చే పంచాయతీ ఎన్నికలపై ఈ ప్రభావం ఉంటుందని, ఇకపై ఏకగ్రీవాలకు వెనుకంజ  వేస్తారని నాయకులు వాపోతున్నారు. సిద్దిపేట జిల్లావ్యాప్తంగా 499 గ్రామపంచాయతీలు ఉన్నాయి. 2019 జనవరిలో మూడుదశల్లో నిర్వహించిన పంచాయతీ ఎన్నికల్లో 48 గ్రామాల్లో పాలకవర్గాలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గ్రామస్థులంతా ఏకాభిప్రాయంతో సర్పంచ్‌, వార్డు సభ్యులను ఎన్నుకున్నారు. గ్రామంలో ఐకమత్యాన్ని చాటడంతోపాటు ప్రభుత్వం నుంచి వచ్చే ప్రొత్సాహకాన్ని భారీగా పెంచడమే ఇందుకు కారణం. 


మూడేళ్లుగా ఎదురుచూపులు

 గ్రామాల్లో రాజకీయ ఉద్రిక్తలను తగ్గించడానికి, గ్రామమంతా ఏకతాటిపై నిలిచి అభివృద్ధి చేసుకునేందుకు ప్రోత్సాహకాన్ని ఇస్తుంటుంది. 2014లో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో ఏకగ్రీవ పంచాయతీలకు నజరానా రూ. 5 లక్షలు ఇచ్చారు. 2019లో ఎన్నికల్లో ఈ మొత్తాన్ని రూ 10 లక్షలకు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. పంచాయతీ ఎన్నికలు ముగిసిన ఆరునెలల్లోగా ఈ మొత్తాన్ని విడుదల చేయాల్సి ఉంటుంది. పంచాయతీలకు రెగ్యులర్‌గా వచ్చే నిధులకు అదనంగా వీటిని మంజూరు చేస్తారు. ఈ నిధులను పాలకవర్గ తీర్మానం ప్రకారం ఖర్చు చేసుకునే వెసులుబాటు ఉంటుంది. 


చిన్న పంచాయతీలకు ఆసరా

మేజర్‌ గ్రామపంచాయతీలు, పట్టణాలకు దగ్గర ఉన్న పంచాయతీలకు వివిధ రకాలుగా ఆదాయం సమకూరుతుంది. రియల్‌ఎస్టేట్‌, పరిశ్రమలు, పన్నులతో నిధులు సమకూరుతాయి. కానీ చిన్న పంచాయతీలు ప్రభుత్వం నుంచి వచ్చే నిధులపైనే ఆధారపడాల్సి ఉంటుంది. ఇలాంటి పంచాయతీలకు రూ.10 లక్షల ప్రోత్సాహకం ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. అందుకే కొత్తగా ఏర్పడిన గ్రామపంచాయతీల్లో చాలావరకు ఏకగ్రీవం చేసుకున్నారు. ప్రభుత్వం నుంచి వచ్చే నిధులతో ప్రజోపయోగమైన కార్యక్రమాలు చేపట్టాలని ఆశించారు. కానీ మూడేళ్లయినా వారి ఆశలు తీరడం లేదు. ఏడాది గడిస్తే మళ్లీ ఎన్నికల సీజన్‌ తెరమీదకు వస్తున్న తరుణంలో ఇప్పటికీ నిధులివ్వకపోడంపై ఏకగ్రీవ పంచాయతీల పాలకవర్గాలు అసంత్తి వ్యక్తం చేస్తున్నాయి. ప్రోత్సాహక నిధులు పలు పనులు చేస్తామని హామీ ఇచ్చామని, నిధులు రాకపోవడంతో వాటిని నెరవేర్చలేకపోతున్నామని ఏకగ్రీవ పంచాయతీల సర్పంచ్‌లు, వార్డు మెంబర్లు ఉసూరుమంటున్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వచ్చే ఎన్నికల్లో ప్రభావం చూపుతుందని వారు వాపోతున్నారు.


ఏకగ్రీవ గ్రామపంచాయతీలు ఇవే..

జిల్లాలో అక్కన్నపేట మండలం ధర్మారం, గొల్లపల్లి, గుబ్బడి, కుందనవానిపల్లి, మంచినీళ్లబండ, మసిరెడ్డితండా, మోత్కులపల్లి, పెద్దతండా, పోతారం(జే), బెజ్జంకి మండలంలో నర్సింహులపల్లి, తిమ్మయ్యపల్లి, చేర్యాల మండలంలో శభాష్‌ గూడెం, దౌల్తాబాద్‌ మండలంలో కోనాపూర్‌, ముత్యంపేట, దుబ్బాక మండలంలో వెంకటగిరితండా, గజ్వేల్‌ మండలంలో కొల్గురు, రాగట్లపల్లి, శేరిపల్లి, హుస్నాబాద్‌ మండలంలో భల్లునాయక్‌తండా, రాములపల్లి, జగదేవ్‌పూర్‌ మండలం అనంతసాగర్‌, జంగంరెడ్డిపల్లి, కొండాపూర్‌, నిర్మల్‌ నగర్‌, పీటీ వెంకటాపూర్‌, తీగుల్‌నర్సాపూర్‌, కోహెడ మండలంలో విజయనగర్‌కాలనీ, కొమురవెల్లి మండలంలో గౌరాయిపల్లి, రసూలాబాద్‌, మద్దూరు మండలంలో హనుమతండా, మర్కూక్‌ మండలంలో ఇప్పలగూడ, మిరుదొడ్డి మండలం బేగంపేట, వీరారెడ్డిపల్లి, నంగునూరు మండలంలో జేపీతండా, నాగరాజుపల్లి, రాయపోల్‌ మండలంలో గొల్లపల్లి, ముంగీ్‌సపల్లి, నారాయణరావుపేట మండలంలో ఇబ్రహీంపూర్‌, కొండంరాజుపల్లి, లక్ష్మీదేవిపల్లి, సిద్దిపేట రూరల్‌ మండలంలో సీతారాంపల్లి, తొగుట మండలంలో బ్రాహ్మణ బంజేరుపల్లి, కానుగల్‌, గోవర్ధనగిరి, వర్గల్‌ మండలంలో అనంతగిరిపల్లి, చాంద్‌ఖాన్‌మక్తా, మాదారం, సీతారాంపల్లి పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి.


అభివృద్ధికి ఆటంకాలు : దినేశ్‌రెడ్డి, సర్పంచ్‌, కుందనవానిపల్లి

గ్రామ ప్రజలందరు ఒక్కమాటపై నిలిచి పాలకవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ప్రభుత్వం ఇస్తానన్న రూ.10 లక్షల ప్రొత్సాహకం వస్తే అభివృద్ధి పనులు చేపట్టాలని తీర్మానించినా మూడేళ్లు గడుస్తున్నా నిధులు రాలేదు. అభివృద్ధి నిధులు లేక, ప్రొత్సాహకం రాక సమస్యలు పేరుకుపోయాయి.


ప్రజలు నిలదీస్తున్నరు : ఎల్లం, సర్పంచ్‌, గోవర్ధనగిరి 

సర్పంచ్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకుంటే ప్రభుత్వం రూ.10 లక్షలు, దుబ్బాక ఎమ్మెల్యే నిధుల నుంచి రూ. 15 లక్షలు ఇస్తామని ప్రకటించారు. మూడేళ్లయినా ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. నిధులేమయ్యాయని ప్రజలు నిలదీస్తున్నారు.


ఇప్పటికైనా నిధులివ్వాలి : లావణ్య, సర్పంచ్‌, అనంతసాగర్‌ 

ఏకగ్రీవంగా పంచాయతీ పాలకవర్గాన్ని ఎన్నుకున్నా మూడేళ్లుగా ప్రభుత్వం ఇస్తామన్న ప్రొత్సాహకం ఇవ్వలేదు. నిధులు వస్తే గ్రామంలో అభివృద్ధి పనులు చేపడదామని ఎదురుచూస్తున్నాం.

Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
OpinionPoll
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.