న్యూయార్క్, జనవరి 23: దశాబ్దాల క్రితం నదులపై నిర్మించిన పాత ఆనకట్టలతో ప్రపంచదేశాలకు పెనుగండం పొంచి ఉందని ఐక్యరాజ్యసమితి (యునైటెడ్ నేషన్స్) హెచ్చరించింది. 1930 నుంచి 1970 మధ్యకాలంలో ప్రపంచవ్యాప్తంగా నిర్మించిన 58,700 పెద్ద డ్యామ్‌లన్నీ 50-100 ఏళ్ల జీవితకాలం ఉండేలా డిజైన్ చేసినవేనని గుర్తుచేసింది. వాటిలో సగానికి పైగా (32,716) ఆనకట్టలు చైనా, భారత్, జపాన్, దక్షిణ కొరియాల్లోనే ఉన్నట్లు ఐరాస తెలిపింది. ప్రత్యేకించి భారత్‌లోని 1,115 భారీ ఆనకట్టలను నిర్మించి 2025 నాటికి 50 ఏళ్లు పూర్తవుతాయని పేర్కొంది. 2050 నాటికి దేశంలోని 4,250 పెద్ద డ్యామ్‌లు 50 ఏళ్లను, మరో 64 భారీ డ్యామ్‌లు 150 ఏళ్ల నిర్మాణ కాలాన్ని పూర్తి చేసుకుంటాయని వెల్లడించింది. భవిష్యత్తులో ఈ డ్యామ్‌ల ఉనికికి భంగం వాటిల్లితే దిగువ, లోతట్టు ప్రాంతాల ప్రజల మనుగడ ప్రశ్నార్ధకంగా మారుతుందని ఆందోళన వ్యక్తంచేసింది. ఈమేరకు వివరాలతో కూడిన అధ్యయన నివేదికను ‘ఏజింగ్ వాటర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ : యాన్ ఎమర్జింగ్ గ్లోబల్ రిస్క్’ శీర్షికన ఐరాస విడుదల చేసింది. 133 ఏళ్ల క్రితం (1887 సంవత్సరంలో) కేరళలో నిర్మించిన ముల్లపెరియార్ డ్యామ్ ఒకవేళ ఆకస్మికంగా విఫలమైతే.. దాని దిగువ ప్రాంతాల్లో నివసించే 35 లక్షల మంది ప్రజల ప్రాణాలు సంకటంలో పడతాయని ప్రస్తావించింది.