వ్యర్థమైన ఆందోళన తగదు!

ABN , First Publish Date - 2020-11-06T05:30:00+05:30 IST

మానవుల్లో ఆందోళనకు ప్రధాన కారణం భవిష్యత్తు ఎలా ఉంటుందోననే చింత. అది స్వార్థ చింతనకు దారి తీస్తుంది. ఆ స్వార్థం ఇతరులకు కష్టమో, నష్టమో కలిగించడానికి వెనుకాడని నైజాన్ని పెంచుతుంది...

వ్యర్థమైన ఆందోళన తగదు!

మానవుల్లో ఆందోళనకు ప్రధాన కారణం భవిష్యత్తు ఎలా ఉంటుందోననే చింత. అది స్వార్థ చింతనకు దారి తీస్తుంది. ఆ స్వార్థం ఇతరులకు కష్టమో, నష్టమో కలిగించడానికి వెనుకాడని నైజాన్ని పెంచుతుంది. రేపు ఏమవుతుందో అని భయపడేవాళ్ళు మన చుట్టూ ఎంతోమంది కనిపిస్తారు. దైవం మీద విశ్వాసం ఉన్న వారికి ఇలాంటి చింత ఉండదు. ఒక సందర్భంలో ఏసు ప్రభువు ఈ విషయాన్ని స్పష్టంగా చెప్పాడు.


‘‘మీ జీవితాల గురించి బెంగ పడకండి. ‘ఏం తినాలి, ఏం తాగాలి, ఎలాంటి దుస్తులు వేసుకోవాలి?’ అని చింతించకండి. ఆహారం కన్నా ప్రాణం విలువైనది కాదా? దుస్తుల కన్నా శరీరం విలువైనది కాదా? ఆకాశంలో ఎగురుతున్న పక్షులను గమనించండి. అవి విత్తనాలు నాటవు, పంటను కొయ్యవు, గిడ్డంగులలో వాటిని నిల్వ చేసుకోవు. పరలోకంలో ఉన్న మీ తండ్రి వాటిని పోషిస్తున్నాడు. వాటికన్నా మీరు విలువైన వారు కాదా? ఆందోళన చెందడం ద్వారా మీ జీవిత కాలంలో ఒక గంటయినా పెంచుకోగలరా?’’ అని ప్రశ్నించాడు. మనకు కావలసినవేమిటో దైవానికి తెలుసు. వాటిని మనకు అవసరమైన సమయంలో, అర్హతను బట్టి ఆయన ప్రసాదిస్తాడు. దేవుడి రాజ్యానికీ, నీతికీ మొదటి స్థానం ఇస్తే, మనకు కావలసినవన్నీ ఆయన ఇస్తాడని ఏసు ప్రభువు ప్రకటించాడు. ప్రతి రోజూ ఏవో ఒక సమస్యలుంటాయి. అందుకే ఈ రోజు ఆలోచించడానికి అవి చాలనీ, రేపటి సమస్యల గురించి చింతించవద్దనీ, ఆందోళన చెందవద్దనీ హితవు పలికాడు. చిత్తాన్నంతా దైవంపై నిమగ్నం చేసి, ఆయన చూపిన దారిలో పయనించేవారికి ఎలాంటి ఆందోళనలూ ఉండవు. మన బాధ్యతను ఆయనే తీసుకుంటాడు. 

Updated Date - 2020-11-06T05:30:00+05:30 IST