కక్ష సాధింపు

ABN , First Publish Date - 2022-05-22T06:21:48+05:30 IST

కక్ష సాధింపు

కక్ష సాధింపు

టీడీపీ నేతలపై అక్రమ కేసుల బనాయింపు

వైసీపీ నయా రాజకీయం.. పోలీసుల సహకారం..

నిన్న బోడె ప్రసాద్‌, ఆయన అనుచరులపై.. 

తాజాగా దేవినేని ఉమా అనుచరుడిపై హత్యాయత్నం కేసు

న్యాయస్థానాలు అక్షింతలేస్తున్నా..


ప్రతిపక్షం పూర్తిగా కనుమరుగు కావాలి.. వ్యతిరేక స్వరం, నిరసన గళం వినిపించకూడదు.. ఇదే అధికార వైసీపీ నేతల లక్ష్యం. ఆ దిశగా పోలీసులను పావులుగా మార్చుకుని టీడీపీ నాయకులు, కార్యకర్తలను కేసులతో వేధిస్తున్నారు. తప్పు ఎవరిదైనా కేసు టీడీపీ వారిపై పెట్టాలన్నదే లక్ష్యంగా పోలీసులు వైసీపీ నేతల అడుగుజాడల్లో నడుస్తున్నారు. - (విజయవాడ-ఆంధ్రజ్యోతి)


బోడెపై కేసులో పోలీసులకు న్యాయస్థానం అక్షింతలు

ఈ నెల 17 అర్ధరాత్రి పెనమలూరు నియోజకవర్గంలోని ఓ రేషన్‌ షాపును తనిఖీ చేసేందుకు డిప్యూటీ తహసీల్దార్‌  వెళ్లారు. ఆ సమయంలో సదరు డీలరు లేకపోవడంతో ఆయన కుటుంబ సభ్యులను అసభ్య పదజాలంతో దూషించారు. ఈ ఘటనలో పోలీసులు వ్యవహరించిన తీరు వివాదాస్పదమైంది. ఆ ఘటన సమయంలో సదరు అధికారి మద్యం మత్తులో ఉన్నారని డీలరు కుటుంబ సభ్యులు చేసిన ఆరోపణలను పరిగణనలోకి తీసుకోకుండా కేవలం టీడీపీ నాయకులే లక్ష్యంగా కేసులు నమోదు చేశారు. మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్‌, ఆయన అనుచరులు డిప్యూటీ తహసీల్దార్‌పై హత్యాయత్నం చేశారంటూ 12 మందిపై వివిధ సెక్షన్లతో పాటు హత్యాయత్నానికి చెందిన సెక్షన్‌ 307 కూడా నమోదు చేశారు. ఈ కేసులో 9 మందిని న్యాయస్థానం ముందు హాజరుపరచగా, జడ్జి పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు ఏ పరిస్థితుల్లో హత్యాయత్నం కేసు నమోదు చేశారని ప్రశ్నించారు. ఈ కేసులో తొమ్మిది మందికి కోర్టు బెయిల్‌ మంజూరైంది. ఈ ఘటనలో బోడె ప్రసాద్‌పై సీఐడీ శనివారం లుక్‌ ఔట్‌ నోటీసులు జారీ చేసింది. అయితే, మినీ మహానాడులో పాల్గొనేందుకు బోడె ప్రసాద్‌ రెండు రోజుల క్రితమే ఆస్ట్రేలియా వెళ్లారు.

ఆలూరి హరికృష్ణపై ఆగమేఘాలపై..  

తాజాగా మాజీ మంత్రి దేవినేని ఉమా ప్రధాన అనుచరుడైన ఆలూరి హరికృష్ణపై 323, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. హత్యాయత్నం సెక్షన్‌ 307నూ కలిపారు. అసలు హరికృష్ణ హత్యాయత్నానికి వెళ్లలేదని పోలీసులకు తెలిసినప్పటికీ కేవలం ఉమా ప్రధాన అనుచరుడు కావడంతో ఆయన ఆర్థిక మూలాలపై దెబ్బకొట్టాలని వైసీపీ నాయకుల ఒత్తిడితో పోలీసులు ఈ కేసు నమోదు చేశారు. అయితే, హరికృష్ణ తరఫు న్యాయవాది 307 సెక్షన్‌పై గట్టిగా ప్రశ్నించడంతో పోలీసులు వెనక్కి తగ్గి దానిని తప్పించి 41ఏ నోటీసులు ఇచ్చి హరికృష్ణను స్టేషన్‌ బెయిల్‌ ఇచ్చి పంపేశారు. 

నేతలు, కార్యకర్తలే టార్గెట్‌

మొన్నటి వరకు టీడీపీ ముఖ్యనేతలపై కేసులు నమోదు చేసిన పోలీసులు ఇప్పుడు నాయకుల ముఖ్య అనుచరులపై పడ్డారు. టీడీపీ నాయకులను ఆర్థికంగా ఆదుకోవడం, కేడర్‌ను బలోపేతం చేయడంలో కీలకపాత్ర పోషించేవారిపై వైసీపీ నాయకులు దృష్టి పెట్టారు. దీంతో వారి ఆర్థిక మూలాలను దెబ్బతీసి, ఏదో విధంగా లొంగ తీసుకోవాలని, లేకపోతే వారిపై అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపించి, వారిలో భయాందోళనను సృష్టించేందుకే పోలీసులను ప్రయోగిస్తున్నారు. ఏడేళ్లలోపు శిక్షపడే ఎటువంటి కేసులకైనా స్టేషన్‌ బెయిల్‌ ఇచ్చి పంపాలని సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్నాయి. దీంతో పోలీసులు ఒక అడుగు ముందుకేసి బెయిలబుల్‌ సెక్షన్లతో పాటు నాన్‌ బెయిలబుల్‌ సెక్షన్లను నమోదు చేస్తున్నారు.

ఏం జరిగింది?

గొల్లపూడికి చెందిన టీడీపీ నాయకుడు హరికృష్ణ అలియాస్‌ చిన్నాను భవానీపురం పోలీసులు శుక్రవారం అర్ధరాత్రి అరెస్టు చేసి వన్‌టౌన్‌ స్టేషన్‌కు తరలించారు. ఈ విషయం తెలుసుకున్న దేవినేని ఉమామహేశ్వరరావు, టీడీపీ శ్రేణులు పెద్ద ఎత్తున వన్‌టౌన్‌ స్టేషన్‌కు తరలివచ్చారు. పోలీసులు శనివారం ఉదయం చిన్నాను వైద్య పరీక్షల నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. అనంతరం స్టేషన్‌కు తీసుకొచ్చి 41 నోటీసు ఇచ్చి పంపించేశారు. ఆలూరి చిన్నా టీడీపీలో క్రియాశీలకంగా ఉంటూ, దేవినేని ఉమా వెంట తిరుగుతున్నారు కాబట్టే ఆయనపై అక్రమంగా కేసు బనాయించారని ఆ పార్టీ నాయకులు ఆరోపిస్తున్నారు. సూరాయిపాలేనికి చెందిన వైసీపీ నేత కోమటి రామ్మోహనరావుతో ఉన్న ఆర్థిక లావాదేవీల కారణంగా ఆయనపైన, ఆయన తండ్రిపైన దాడి చేసి, చంపేందుకు ప్రయత్నించారన్నది ఫిర్యాదు. రామ్మోహనరావు ఫిర్యాదు ఇవ్వడంతో ఆగమేఘాలపై స్పందించిన పోలీసులు చిన్నాను అర్ధరాత్రి స్టేషన్‌కు తీసుకురావడం జరిగిపోయాయి.  

Updated Date - 2022-05-22T06:21:48+05:30 IST