బొమ్మ పడేనా..? ఈ నెలాఖరుతో ముగియనున్న అన్‌లాక్‌-3

ABN , First Publish Date - 2020-08-24T19:21:34+05:30 IST

కరోనా వైరస్‌ కారణంగా ఐదు నెలల నుంచి మూత పడిన సినిమా థియేటర్లను వచ్చే నెల ఒకటో తేదీ నుంచి తెరవడానికి కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అన్‌లాక్‌-3 పేరుతో ఆదివారం మార్గదర్శకాలను విడుదల చేసింది. సినిమా థియేటర్లను

బొమ్మ పడేనా..? ఈ నెలాఖరుతో ముగియనున్న అన్‌లాక్‌-3

ఒకటి నుంచి థియేటర్లు తెరిచేందుకు కేంద్రం అనుమతి 

నిబంధనలతో నిర్వహణ కష్టమంటున్న ఎగ్జిబిటర్లు

థియేటర్లు ఓపెన్‌ చేసేందుకు పలువురు యజమానులు విముఖత

రెండో వారం నుంచి సింగిల్‌ థియేటర్లు, మల్టీప్లెక్స్‌లు తెరిచే అవకాశం!

సందిగ్ధంలో కాంప్లెక్స్‌ థియేటర్ల పరిస్థితి 


(ఆంధ్ర జ్యోతి-విశాఖపట్నం): కరోనా వైరస్‌ కారణంగా ఐదు నెలల నుంచి మూత పడిన సినిమా థియేటర్లను  వచ్చే నెల ఒకటో తేదీ నుంచి తెరవడానికి కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అన్‌లాక్‌-3 పేరుతో ఆదివారం మార్గదర్శకాలను విడుదల చేసింది. సినిమా థియేటర్లను కొన్ని నిబంధనలకు లోబడి తెరిచేందుకు అనుమతి ఇచ్చింది. అయితే సినిమా థియేటర్ల నిర్వాహకులు దీనిపై సంతోషం వ్యక్తంచేయకపోగా, చాలామంది ఎగ్జిబిటర్లు ఇప్పట్లో థియేటర్లు ఇప్పట్లో తెరవబోమని స్పష్టం చేస్తున్నారు.


కరోనా నేపథ్యంలో మార్చి 23 నుంచి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్‌డౌన్‌ విధించడంతో సినిమా థియేటర్లు మూతపడిన విషయం తెలిసిందే. మే నెల నుంచి పలుమార్లు లాక్‌డౌన్‌ నిబంధనలు సడలించినప్పటికీ సినిమా థియేటర్లు తెరవడానికి మాత్రం అనుమతి ఇవ్వలేదు. అదే విధంగా మూడుసార్లు అన్‌లాక్‌ పేరుతో మరిన్ని నిబంధనలను సడలించింది. ఈ సమయంలోనూ సినిమా ప్రదర్శనకు ఛాన్స్‌ ఇవ్వలేదు. అన్‌లాక్‌-3 ఈ నెల 31తో ముగియనుండగా, వచ్చేనెల ఒకటి నుంచి అన్‌లాక్‌-4ను అమలుచేయాలని కేంద్రం నిర్ణయించింది. ఈసారి సినిమా థియేటర్లు తెరవడానికి అవకాశం కల్పించింది. అయితే నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని స్పష్టం చేసింది.


నిబంధనలు

కరోనా నియంత్రణ జాగ్రత్తలను శతశాతం పాటించాలి. టిక్కెట్లన్నీ ఆన్‌లైన్‌లో లేదా నగదు రహిత లావాదేవీల ద్వారా మాత్రమే జారీ చేయాలి. థియేటర్‌లో సగం సీట్లు ఖాళీగా వుంచాలి. అంటే సీటు విడిచి సీటులో మాత్రమే ప్రేక్షకులు వుండాలి. అందరూ ఒకేసారి లోపలకు వెళ్లడం, బయటకు రావడం చేయకూడదు. ఒక్కొక్కరి మధ్య ఆరు అడుగుల దూరం పాటించేలా రాకపోకలు వుండాలి. సినిమా ప్రదర్శన ముగిసిన తర్వాత థియేటర్‌ మొత్తాన్ని శానిటైజ్‌ చేయాలి. 


యాజమాన్యాల విముఖత

అన్‌లాక్‌-4లో సినిమా థియేటర్లు తెరిచేందుకు కేంద్రం అనుమతిచ్చినా... వాటిని తెరిచేందుకు యాజమాన్యాలు విముఖత చూపుతున్నాయి. ఇప్పటికిప్పుడు విడుదల అయ్యే సినిమాలు కూడా ఏవీ లేవు. పైగా ప్రభుత్వం విధించిన నిబంధనల ప్రకారం సినిమా ప్రదర్శనలు గిట్టుబాటు కాదని గాజువాక మోహినీ థియేటర్‌ ఎగ్జిబిటర్‌ వంశీ తెలిపారు. సీటుకి సీటుకి మధ్య ఖాళీ ఉంచడం, సినిమా ప్రదర్శనకి ముందు, తర్వాత థియేటర్‌ని శానిటైజ్‌ చేయడం, ప్రేక్షకులు ఆరు అడుగుల దూరం పాటించేలా క్యూ పద్ధతిలో లోపలికి పంపించడం, తర్వాత అదే విధంగా బయటకు వచ్చేలా ఏర్పాట్లు చేయడం సాధ్యం కాదని ఆయన అన్నారు. ఒకవేళ లాభనష్టాలతో పనిలేకుండా సింగిల్‌ థియేటర్లు, మల్టీప్లెక్స్‌లు ముందుకు వచ్చినా... సెప్టెంబరు 15 తర్వాతే ప్రదర్శనలు ప్రారంభించే అవకాశం ఉంటుందని అంటున్నారు.

Updated Date - 2020-08-24T19:21:34+05:30 IST