యుద్ధంలో అతలాకుతలమైన ఉక్రెయిన్‌.. ఒకప్పుడు ప్రపంచానికి ఏమిచ్చిందంటే..

ABN , First Publish Date - 2022-03-19T17:51:55+05:30 IST

రష్యా- ఉక్రెయిన్ మధ్య సుదీర్ఘ యుద్ధం...

యుద్ధంలో అతలాకుతలమైన ఉక్రెయిన్‌.. ఒకప్పుడు ప్రపంచానికి ఏమిచ్చిందంటే..

రష్యా- ఉక్రెయిన్ మధ్య సుదీర్ఘ యుద్ధం జరుగుతోంది. రష్యా సైన్యం ఉక్రెయిన్‌లోని అనేక నగరాలను ధ్వంసం చేసింది. ప్రస్తుతం ప్రపంచదేశాలన్నీ ఉక్రెయిన్‌ను బాధిత దేశంగా చూస్తున్నాయి. ఉక్రెయిన్‌లో నిరంతరం దాడులు జరుగుతున్నాయి. అయితే ఉక్రెయిన్ ఇంతకు ముందు ఈ ప్రపంచానికి ఎన్నో ఇచ్చింది. ప్రపంచ వేదికపై ఉక్రెయిన్ పాత్ర గురించి ఇప్పుడు తెలుసుకుందాం. 


వాట్సాప్ ఆవిష్కరణలో..

నేడు ప్రపంచంలోని చాలామంది వాట్సాప్‌ని వినియోగిస్తున్నారు. ఇంతలా ఫేమస్ అయిన ఈ చాటింగ్ అప్లికేషన్‌ను తయారు చేయడంలో ఉక్రెయిన్ పాత్ర కూడా ఉందని మీకు తెలుసా? వాట్సాప్‌ని ఆవిష్కరించిన వారిలో ఉక్రేనియన్ పౌరుడు కూడా ఉన్నాడు. వాట్సాప్ సహ వ్యవస్థాపకుడు, సీఈఓ జాన్ కోమ్ ఉక్రెయిన్‌కు చెందినవాడు. అతను తన జీవితంలో ఎక్కువ కాలం ఉక్రెయిన్‌లో గడిపారు. ప్రస్తుతం అమెరికాలో ఉంటున్నారు.


చిత్ర నిర్మాణంలో..

నేడు ఉక్రెయిన్ ధ్వంసం అయి ఉండవచ్చు కానీ ఉక్రెయిన్ ఒకప్పుడు అందాలకు ప్రసిద్ధి చెందింది. అందుకే, ప్రపంచవ్యాప్తంగా ఉన్న చిత్రనిర్మాతలు ఇక్కడ సినిమాలను షూట్ చేయడానికి ఇష్టపడేవారు. మన దేశానికి చెందిన చాలా సినిమాలు ఉక్రెయిన్‌లో చిత్రీకరించారు. ఇందులో దక్షిణ భారత సినిమాల సంఖ్య ఎక్కువగా ఉంది. వీసా ప్రక్రియ ఇక్కడ చాలా సులభం. ఫిల్మ్ మేకర్స్ తమ షూటింగ్‌ల కోసం ఉక్రెయిన్‌లోని లొకేషన్లను వెదికేవారు.


వ్యవసాయంలో..

1991లో స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఉక్రెయిన్ వ్యవసాయంపై ప్రత్యేక దృష్టి సారించింది. దీనితో పాటు వ్యవసాయానికి ఇక్కడి వాతావరణం ఎంతగానో తోడ్పడింది. ఫలితంగా ఉక్రెయిన్ వ్యవసాయంలో ముందుంది. ఉక్రెయిన్ అతిపెద్ద మొక్కజొన్న ఎగుమతిదారుగా గుర్తింపు పొందింది. వ్యవసాయ పరంగా ఉక్రెయిన్ ప్రపంచంలోనే మూడవ స్థానంలో నిలిచింది.


విద్యారంగంలో..

ఉక్రెయిన్‌లో వైద్య విద్య తక్కువ ఖర్చుతో పూర్తిచేయవచ్చు. మనదేశం నుండి చాలా మంది విద్యార్థులు మెడిసిన్ చేసేందుకు ఉక్రెయిన్‌కు వెళతారు. అలాగే ఉక్రెయిన్‌లోని 99.8 శాతం మంది ప్రజలకు చదవడం, రాయడం వచ్చు. ఉక్రెయిన్‌లో అత్యధిక సంఖ్యలో క్రైస్తవులు ఉన్నారు. తరువాత ముస్లిం జనాభా వస్తుంది. ఉక్రెయిన్ విమానాల తయారీలో ఎంతో ప్రసిద్ధి చెందింది.



Updated Date - 2022-03-19T17:51:55+05:30 IST