పూలు అమ్ముకునే అన్నాహ‌జారే అవినీతి వ్య‌తిరేక‌ ఉద్య‌మ నేత ఎలా అయ్యారంటే..

ABN , First Publish Date - 2021-06-15T16:24:41+05:30 IST

అవినీతిపై పెద్ద ఎత్తున ఉద్యమం చేప‌ట్టి...

పూలు అమ్ముకునే అన్నాహ‌జారే అవినీతి వ్య‌తిరేక‌ ఉద్య‌మ నేత ఎలా అయ్యారంటే..

న్యూఢిల్లీ: అవినీతిపై పెద్ద ఎత్తున ఉద్యమం చేప‌ట్టి, యువతకు స్ఫూర్తిగా నిలిచిన అన్నాహ‌జారే నిరాహార దీక్షచేట్టి అంద‌రికీ  మహాత్మా గాంధీని గుర్తుచేశారు. ఆయ‌న నేరుగా క్రియాశీల రాజకీయాల్లో పాల్గొన‌క‌పోయిన‌ప్ప‌టికీ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ విజ‌యానికి కీల‌కంగా వ్య‌వ‌హ‌రించార‌ని చెబుతుంటారు. నేటితో (జూన్ 15, 2021) 84 ఏళ్లు నిండిన అన్నా ఎప్పుడూ ఖాదీ దుస్తుల ధ‌రించి, తలపై గాంధీ టోపీతో క‌నిపిస్తుంటారు. 


అన్నా 1938 జూన్ 15న మహారాష్ట్రలోని భింగారి గ్రామంలో ఒక రైతు కుటుంబంలో జన్మించారు. ఆరుగురు తోబుట్టువులు క‌లిగిన‌ అన్నా కుటుంబం  పేదరికాన్ని చ‌విచూసింది. ఈ నేప‌ధ్యంలో అన్నా ముంబై వచ్చి, పూల వ్యాపారం ప్రారంభించారు. ఆయ‌న‌కు 20 ఏళ్లు ఉన్న‌ప్పుడు భార‌త్‌-చైనా యుద్ధం జ‌రిగింది. సైన్యంలో చేరాలని ప్రభుత్వం యువ‌త‌కు పిలుపునిచ్చింది. వెంట‌నే అన్నా ఆర్మీలో డ్రైవర్‌గా చేరారు. 1965 నవంబరులో ఖేమ్‌క‌రన్ సరిహద్దుల్లో ఆయ‌న  విధులు నిర్వ‌హించాల్సి వ‌చ్చింది. ఒక‌రోజు అవుట్‌పోస్ట్‌పై పాకిస్తాన్ వైమానిక దాడి జరిగింది. ఈ ఘ‌ట‌న‌లో అక్కడ విధులు నిర్వ‌హిస్తున్న‌వారంతా మరణించారు. అన్నా మాత్రం ప్రాణాలతో బ‌య‌ట‌పడ్డారు. ఈ ఉదంతం అన్నా జీవితాన్ని మార్చివేసింది. అనునిత్యం ప్ర‌జా సేవ చేయాల‌ని నిశ్చ‌యించుకున్నారు. సైన్యం నుంచి రిటైర్ అయిన తరువాత అన్నా తన సొంత గ్రామానికి త‌ర‌లివ‌చ్చారు. ఆ గ్రామ అభివృద్ధికి అన్నా ఎన‌లేని కృషి చేశారు. ఈ సేవ‌ల‌ను గుర్తించిన ప్ర‌భుత్వం అన్నాకు తొలుత పద్మశ్రీ, త‌రువాత పద్మభూషణ్ పురస్కారాల‌ను అందించింది. త‌రువాతికాలంలో అన్నా సమాచార హక్కు చట్టం కోసం పోరాడారు. అనంత‌రం అవినీతికి అడ్డుక‌ట్ట‌వేసేందుకు జ‌న్‌లోక్‌పాల్ బిల్లు కోసం పోరాటం సాగించారు. 

Updated Date - 2021-06-15T16:24:41+05:30 IST