ఐపిఎల్‌తో విశ్వమానవ తత్వం

ABN , First Publish Date - 2020-11-01T06:26:05+05:30 IST

రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు జట్టులో ఎక్కువ ప్రభావం చూపే ఆటగాడు ఎవరు? అని స్పోర్ట్స్ ఛానల్ ఆన్‌లైన్ పోల్ నిర్వహిస్తే ఎక్కువ మంది...

ఐపిఎల్‌తో విశ్వమానవ తత్వం

ఐపీఎల్‌ను ఆస్వాదిస్తున్న అభిమానులకు మత పట్టింపులు కూడా లేవు. విదేశీ క్రికెటర్లలో క్రిస్టియన్లు. ముస్లింలు కూడా చాలా మందే ఉన్నారు. మతాన్ని పట్టించుకోని ఆస్ట్రేలియా, న్యూజీలాండ్ లాంటి దేశాల క్రికెటర్లు కూడా ఉన్నారు. అభిమానులు తమ ఆటగాడి ప్రతిభనే చూస్తున్నారు తప్ప మతం ఆధారంగా ఆదరించడం లేదు. పైపైన చూస్తే ఇదంతా చాలా సాదాసీదాగా కనిపిస్తున్నప్పటికీ, నిజంగా ఇది చాలా గొప్ప పరిణామం. ఎందరో తత్వవేత్తలు శతాబ్దాలుగా బోధిస్తున్న విశ్వమానవ తత్వమే ఇది. దేశాలుగా పిలవబడుతున్న భూభాగాలు, వాటికున్న సరిహద్దులు కేవలం సౌలభ్యం కోసం పెట్టుకున్నవే. ఇప్పుడున్న హద్దులు గతంలో ఉన్నవీ కాదు, భవిష్యత్తులో ఇలాగే ఉంటాయనీ లేదు. దేశాల మధ్య సరిహద్దులు మనుషులను విడదీసే విభజన రేఖలు కావద్దని విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగోర్ ఏనాడో చెప్పాడు. జాతీయవాదం సంకుచితం కారాదని, స్వజాత్యభిమానం పరజాతి ద్వేషంగా మారరాదని ఠాగోర్ ఉద్బోధించారు.


రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు జట్టులో ఎక్కువ ప్రభావం చూపే ఆటగాడు ఎవరు? అని స్పోర్ట్స్ ఛానల్ ఆన్‌లైన్ పోల్ నిర్వహిస్తే ఎక్కువ మంది ఎబి డివిలియర్స్ అని అభిప్రాయపడ్డారు. వర్తమాన భారతీయ క్రికెట్ హీరో విరాట్ కోహ్లీ కన్నా అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైరైన సౌతాఫ్రికా ఆటగాడు డివిలియర్స్‌కు భారతదేశంలో ఎక్కువ మంది అభిమానులున్నట్లు లెక్క తేలింది. ఒక్క బెంగళూరు విషయంలోనే కాదు. సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టులో డేవిడ్ వార్నర్, కేన్ విలియమ్స్, రషీద్, రాజస్థాన్ రాయల్స్ జట్టులో స్టీవ్ స్మిత్, బెన్ స్టోక్స్, ఆర్చర్, కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టులో మోర్గాన్, నరేన్, రస్సెల్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌లో క్రిస్ గేల్, పూరన్ తదితర విదేశీ క్రికెటర్లే ప్రధాన ఆటగాళ్లు. వీళ్లకు భారతదేశంలో కోట్ల సంఖ్యలో అభిమానులున్నారు. భారతదేశానికి చెందిన బౌలర్ వేసే బంతులను డివిలియర్స్, వార్నర్, గేల్, ఫించ్, విలియమ్సన్, బెయిర్ స్టో, డికాక్, రసెల్ తదితర విదేశీ బ్యాట్స్‌మెన్ సిక్సర్లుగా మలిచినా సరే, భారతీయ క్రీడాభిమానులు ఎంజాయ్ చేస్తున్నారు. నరేన్, ఆర్చర్, బౌల్ట్, నోకియా తదితర విదేశీ బౌలర్ల బంతులకు భారతీయ క్రికెటర్లు ఔటైనా సరే అభిమానులు నొచ్చుకోవడం లేదు. ఐపిఎల్ మ్యాచులను దేశాల మధ్య జరిగే యుద్ధాల్లా చూడడం లేదు. ఇక తమ రాష్ట్ర జట్టు (నిజానికి కాదు కూడా, కేవలం పేర్లే) ఆడకున్నా సరే, అన్ని రాష్ట్రాల మధ్య జరిగే ఐపిఎల్ మ్యాచులను క్రికెట్ అభిమానులు ఆస్వాదిస్తున్నారు. ఏ జట్టులో అయినా సరే, మంచి ఆటగాళ్లుంటే చాలు వారి ప్రతిభా పాటవాలను అభిమానిస్తున్నారు. ఆడితే మా దేశ ఆటగాడే ఆడాలి. గెలిస్తే మా దేశమే గెలవాలి అనే మానసిక స్థితి నుంచి క్రికెట్ అభిమానులు బయట పడుతున్నారు. ఎవరు బాగా ఆడితే వారిని అభిమానించడం, ఎవరి వద్ద ప్రతిభ ఉంటే వారిని అభినందించే గుణాన్ని అలవరుచుకున్నారు. ఆడడం ఎలాగో ఆటగాళ్లు నేర్చుకున్నట్లే, చూడడం ఎలాగో అభిమానులు తెలుసుకున్నారు. తమ దేశానికి చెందిన క్రికెటర్లు ఇండియన్ ప్రీమియం లీగ్‌లో ఆడడం ఏంటని విదేశాలకు చెందిన క్రికెట్ అభిమానులు ప్రశ్నించడం లేదు. తమ రాష్ట్రానికి చెందిన క్రికెటర్లు వేరే రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహించడం ఏంటని స్థానిక అభిమానులు విమర్శించడం లేదు. ఆటను ఆటగా మాత్రమే చూస్తున్నారు. ఇదంతా ఆటలో భాగమనే అర్థం చేసుకుంటున్నారు. 


క్రికెటర్లు కూడా గొప్ప క్రీడాస్ఫూర్తిని ప్రదర్శిస్తున్నారు. ఆటగాళ్లు అహాన్ని పక్కన పెట్టారు. ఆటకే (డబ్బులకు కూడా కావచ్చు) ప్రాధాన్యం ఇస్తున్నారు. తాము ఏ రాష్ట్రానికి, ఏ దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్నాము? ఎవరి నాయకత్వంలో పనిచేస్తున్నాము? అనే విషయాలను పెద్దగా పట్టించుకోకపోవడం మనం గమనించవచ్చు. ఇంగ్లండుకు ప్రపంచకప్ అందించిన కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ మొన్నటి వరకు దినేష్ కార్తిక్ నాయకత్వంలో సాధారణ ఆటగాడిగా కోల్‌కతా జట్టులో కొనసాగాడు. న్యూజీలాండ్‌ను గొప్ప టీమ్‌గా తీర్చిదిద్ది ప్రపంచకప్ ఫైనల్‌కు చేర్చిన క్రికెట్ సెయింట్ కేన్ విలియమ్సన్ తనకన్నా తక్కువ ర్యాంకు ఆటగాడైన డేవిడ్ వార్నర్ నాయకత్వంలో హైదరాబాద్‌కు ఆడుతున్నాడు. ప్రపంచంలోనే నెంబర్ వన్ జట్టు అయిన ఆస్ట్రేలియాకు కెప్టెన్ అయిన ఆరొన్ ఫించ్ (టి20లో 3ర్యాంకు) తనకన్నా తక్కువ ర్యాంకు కలిగిన విరాట్ కోహ్లీ (టి20లో 9వ ర్యాంకు) నాయకత్వంలో బెంగుళూరుకు ఆడుతున్నాడు. దక్షిణాఫ్రికా కెప్టెన్ క్వింటన్ డికాక్ ఇండియా జట్టు ఓపెనర్ రోహిత్ శర్మ నాయకత్వంలోని ముంబై ఇండియన్స్‌కు ఆడుతున్నాడు. ఇట్లాంటివి అనేక ఉదాహరణలున్నాయి. విదేశీ క్రికెటర్లు ఇండియన్ ప్రీమియమ్ లీగ్, భారతీయ కంపెనీలకు చెందిన లోగోలున్న జెర్సీలు ధరించి క్రికెట్ ఆడుతున్నా, సొంత దేశాల పేరు కూడా ఎక్కడా వారి జెర్సీలపై కనిపించకున్నా, ఆయా దేశాల క్రికెట్ అభిమానులు దాన్నో జాతిద్రోహంగా చూడడం లేదు. ఏ దేశంలో ఏ జట్టు తరఫున ఆడుతున్నారు అని కాకుండా, ఎలా ఆడుతున్నారనేది మాత్రమే చూస్తున్నారు.


ఢిల్లీకి చెందిన విరాట్ కోహ్లీ బెంగళూరుకు, బెంగళూరుకు చెందిన కెఎల్ రాహుల్ పంజాబ్‌కు, ముంబైకి చెందిన శ్రేయాస్ అయ్యర్ ఢిల్లీకి, చైన్నైకి చెందిన దినేశ్ కార్తిక్ కోల్‌కతా జట్లకు నాయకత్వం వహిస్తున్నారు. చాలా రాష్ట్రాల క్రీడాకారులు తమ రాష్ట్రానికి కాకుండా వేరే రాష్ట్రాల జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టులో ఒక్కరంటే ఒక్కరు కూడా హైదరాబాద్ క్రికెటర్ ఆడడం లేదు. హైదరాబాద్ క్రికెటర్లలో రాయుడు చెన్నైకి, సిరాజ్ బెంగళూరుకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇవన్నీ పెద్ద విషయాలుగా క్రికెట్ అభిమానులు చూడడం లేదు. ఆటను ఆటగా చూడడమనే గొప్ప లక్షణం క్రికెట్ అభిమానులకు అబ్బింది. 


కష్టకాలం ఎదురైనప్పుడు తనకు హైదరాబాద్, భారత్ అభిమానులు అండగా నిలవడం ఎంతో ప్రేరణ ఇచ్చిందని డేవిడ్ వార్నర్ ఒక సందర్భంలో అన్నారు. ఒక దశలో ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డే వెలివేసిన వార్నర్‌ను హైదరాబాద్ అక్కున చేర్చుకున్నది. లాక్‌డౌన్ సమయంలో తెలుగు పాటలకు వార్నర్ కుటుంబం వేసిన స్టెప్పులు హైదరాబాద్‌తో ఆయనకు పెరిగిన అనుబంధానికి ఓ నిదర్శనం. ఇలాంటి ఉదాహరణలు క్రికెట్లో మనకు అనేకం లభిస్తాయి. 


క్రికెట్‌ను ఆస్వాదిస్తున్న అభిమానులకు మత పట్టింపులు కూడా లేవు. విదేశీ క్రికెటర్లలో ఎక్కువ మంది క్రిస్టియన్లు. ముస్లింలు కూడా చాలా మందే ఉన్నారు. మతాన్ని పట్టించుకోని ఆస్ట్రేలియా, న్యూజీలాండ్ లాంటి దేశాల క్రికెటర్లు కూడా ఉన్నారు. అభిమానులు తమ ఆటగాడి ప్రతిభనే చూస్తున్నారు తప్ప మతం ఆధారంగా ఆదరించడం లేదు. 


పైపైన చూస్తే ఇదంతా చాలా సాదాసీదాగా కనిపిస్తున్నప్పటికీ, నిజంగా ఇది చాలా గొప్ప పరిణామం. ఎందరో తత్వవేత్తలు శతాబ్దాలుగా బోధిస్తున్న విశ్వమానవ తత్వమే ఇది. దేశాలుగా పిలవబడుతున్న భూభాగాలు, వాటికున్న సరిహద్దులు కేవలం సౌలభ్యం కోసం పెట్టుకున్నవే. ఇప్పుడున్న హద్దులు గతంలో ఉన్నవీ కాదు, భవిష్యత్తులో ఇలాగే ఉంటాయనీ లేదు. దేశాల మధ్య సరిహద్దులు మనుషులను విడదీసే విభజన రేఖలు కావద్దని విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగోర్ ఏనాడో చెప్పాడు. జాతీయవాదం సంకుచితం కారాదని, స్వజాత్యభిమానం పరజాతి ద్వేషంగా మారరాదని ఠాగోర్ ఉద్బోధించారు. ఒలంపిక్స్ క్రీడోత్సవాల లక్ష్యం కూడా అదే. వేర్వేరు రాజ్యాల పరిధిలోని ప్రజల్లో ఐకమత్యం పెంచడమే లక్ష్యంగా గ్రీకు రాజధాని ఏథెన్స్‌లో క్రీ.పూ.776లో ఒలంపిక్స్ ప్రారంభమయ్యాయి. కొన్ని శతాబ్దాల పాటు ప్రపంచంపై ప్రభావం చూపిన గ్రీకుల ఐక్యతకు వారి భాష, ఒడిస్సీ, ఇలియడ్ లాంటి పురాణ గాథలు ఎంత దోహదం చేశాయో నాలుగేళ్లకోసారి జరిగే ఒలింపిక్స్ కూడా అంత ఉపయోగపడ్డాయనేది చరిత్ర పాఠం. ఎవరికి వారు గిరిగీసుకుని కూర్చునే సరిహద్దులను చెరిపే గొప్ప లక్షణం క్రీడలకు ఉంటుంది. దేశాల మధ్య క్రీడలు జరిగితేనే అంతటి సౌభ్రాతృత్వం సాధ్యమైతే, దేశాలు, రాష్ట్రాలు అనే తేడా లేకుండా అంతా కలిసి ఆడితే ఎంతటి మార్పు వస్తుందో ఊహించడం కష్టమేమీ కాదు. 


నిజానికి విశ్వమానవులంతా ఒక్కటే. ఒకే తల్లిబిడ్డలుగా ప్రారంభమయిన మానవజాతి దేశాలుగా, మతాలుగా చీలికలు పేలికలై ఉంది. మళ్లీ ఎన్నటికైనా ఈ మానవాళి ప్రపంచ మానవాళిగా, అన్ని దేశాల పౌరులు ప్రపంచ పౌరులుగా ప్రవర్తించక తప్పదనేదే ఆశావహుల అంచనా. దీనికి తగ్గట్టుగానే రెండవ ప్రపంచయుద్ధం తర్వాత అనేక ప్రయత్నాలు ప్రారంభమయి, నేటికీ కొనసాగుతున్నాయి. 1940 దశకంలో అనేక దేశాలకు స్వాతంత్ర్యం రావడం వెనుక బ్రిటన్ పౌర సమాజంలో, రాజకీయ వ్యవస్థలో వచ్చిన విశ్వమానవతత్వం కూడా ప్రధాన కారణమే. పాకిస్థాన్ క్రికెటర్లను పక్కన బెట్టడం లాంటి కొన్ని సంకుచిత, రాజకీయ, భావేద్వోగ ప్రేరేపిత అంశాలున్నప్పటికీ ఐపిఎల్ క్రికెట్ లాంటి వినూత్న యత్నాలు విశ్వమానవతత్వం అనే భావనను విస్తృత పర్చడంలో తన వంతు పాత్రను పోషిస్తున్నాయి. ఇది మానవజాతి భవితకు మంచి శకునం. మనుషులు మట్టిని కాకుండా, తోటి మనుషులను ప్రేమించే మంచి రోజులు వస్తాయని ఆశిద్దాం.

గటిక విజయ్ కుమార్

Updated Date - 2020-11-01T06:26:05+05:30 IST