ఇటు వర్సిటీ.. అటు యాజమాన్యాలు లేఖాస్త్రాలు!

ABN , First Publish Date - 2020-06-07T09:34:10+05:30 IST

ఎన్టీఆర్‌ హెల్త్‌ యూనివర్సిటీ, ప్రైవేటు మెడికల్‌ కాలేజీలు పరస్పరం లేఖాస్త్రాలు సంధించుకుంటున్నాయి. తొలుత వర్సిటీ రిజిస్ట్రార్‌ అన్ని కాలేజీల్లో అడ్మిషన్లు చేసుకోవాలని శుక్రవారం సర్క్యులర్‌ జారీ చేశారు.

ఇటు వర్సిటీ.. అటు యాజమాన్యాలు లేఖాస్త్రాలు!

  • వెంటనే ఆడ్మిషన్లు చేపట్టండి
  • సోమవారం నాటికి చేర్చుకోవాలి
  • లేదంటే కఠిన చర్యలు తీసుకుంటాం
  • కాలేజీలకు హెల్త్‌ వర్సిటీ సర్క్యులర్‌
  • కామన్‌ ఫీజులు అమలు చేయండి
  • లేదంటే కౌన్సెలింగ్‌ రద్దు చేయండి
  • వీసీకి మెడికల్‌ కాలేజీల అసోసియేషన్‌  లేఖ
  • హైకోర్టులోనూ కాలేజీల పిటిషన్‌


అమరావతి, జూన్‌ 6(ఆంధ్రజ్యోతి): ఎన్టీఆర్‌ హెల్త్‌ యూనివర్సిటీ, ప్రైవేటు మెడికల్‌ కాలేజీలు పరస్పరం లేఖాస్త్రాలు సంధించుకుంటున్నాయి. తొలుత వర్సిటీ రిజిస్ట్రార్‌ అన్ని కాలేజీల్లో అడ్మిషన్లు చేసుకోవాలని శుక్రవారం సర్క్యులర్‌ జారీ చేశారు. ఇందుకు ప్రతిగా ఆ సాయంత్రమే.. తమ కాలేజీల్లో భర్తీ ప్రక్రియను నిలిపివేయాలని, ఇప్పటి వరకూ భర్తీ చేసిన సీట్లను రద్దు చేయాలని వర్సిటీ వీసీకి కాలేజీల అసోసియేషన్‌ లేఖ రాసింది. ఇటు వర్సిటీ, అటు కాలేజీలు వెనక్కు తగ్గకపోవడంతో సమస్య మరింత జఠిలం అయినట్లు కనిపిస్తోంది. ఎప్పటిలాగే కాలేజీలు ఈ ఏడాది తాము అడ్మిషన్లు చేపట్టడం లేదని బయట బోర్డులు పెట్టడంతో పాటు విద్యార్థులకు పబ్లిక్‌ నోటిసును అందిస్తున్నాయి. ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకున్న వర్సిటీ రిజిస్ట్రార్‌ శుక్రవారం రాష్ట్రంలోని అన్ని ప్రైవేటు మెడికల్‌, డెంటల్‌ కాలేజీలకు సర్క్యులర్‌ జారీ చేశారు. వర్సిటీ ముందుగా ఇచ్చిన ఆదేశాల మేరకు రాష్ట్రంలోని అన్ని ప్రైవేటు కాలేజీలు అడ్మిషన్లు చేసుకోవాలని పేర్కొన్నారు. అంతేకాదు... జూన్‌ 8వ తేదీ మధ్యాహ్నం ఒంటి గంట కల్లా ఆడ్మిషన్లు పూర్తి చేయాలని ఆదేశించారు. 


లేకపోతే వర్సిటీ యాక్ట్‌ ప్రకారం కాలేజీలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ సర్క్యులర్‌కు దీటుగా ప్రైవేటు మెడికల్‌ కాలేజీల అసోసియేషన్‌ కూడా వీసీకి లేఖ రాసింది. సుప్రీంకోర్టు ఆదేశాలకు వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వం ఫీజులను నిర్థారించిందని లేఖలో పేర్కొంది. ఈ ఫీజుల ఆధారంగా ఈ ఏడాది కాలేజీలు నడపలేమని, తమ కాలేజీల్లో కన్వీనర్‌ కోటా సీట్ల భర్తీ ప్రక్రియ నిలిపివేయాలని ఇప్పటికే ప్రభుత్వానికి తాము సమాచారం అందించామని తెలిపింది. మరోవైపు దీనిపై పబ్లిక్‌ నోటీసు ద్వారా విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు కూడా సమాచారం అందించామని వివరించింది. తాము ఎందుకు ఆడ్మిషన్లు నిలిపివేస్తున్నామనే విషయాన్ని కూడా వారికి వివరించామని లేఖలో పేర్కొంది. కాబట్టి ఈ ఏడాది తమ కాలేజీల్లో కన్వీనర్‌ కోటా కింద భర్తీ చేసిన సీట్లను వెంటనే రద్దు చేయాలని కోరింది. ఈ లేఖను వర్సిటీ వీసీతో పాటు ఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శికి కూడా పంపింది. ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో తమ కాలేజీల్లో కామన్‌ ఫీజు విధానం అమలు చేయాలంటూ ప్రైవేటు మెడికల్‌ కాలేజీల అసోసియేషన్‌ హైకోర్టును కూడా ఆశ్రయించింది. 

Updated Date - 2020-06-07T09:34:10+05:30 IST