Abn logo
Sep 21 2021 @ 10:34AM

పోరుబాటలో ప్రతిపక్షాలు.. revanth reddy ప్లాన్ అదేనా..!

ఆ పార్టీలన్నీ ఎట్టకేలకు ఏకతాటిపైకి వచ్చాయా..? ఇన్నాళ్లు విడివిడగా పోరాడిన పార్టీలు ఇప్పుడు కలివిడిగా కలబడేందుకు ఎందుకు సిద్ధమవుతున్నారు? కలిసి ఉంటేనే కలదు విజయం అని భావిస్తున్నాయా? ఇంత కాలం తర్వాత విపక్షాలన్నింటినీ ఒకేతాటి పైకి తెచ్చింది ఎవరు?.. ఆ వివరాలు, ఇవాల్టి ‘ఏబీఎన్ ఆంధ్రజ్యోతి’ ఇన్‌సైడర్‌లో..

టీఆర్ఎస్‌పై నిర్ణయాలకు వ్యతిరేకంగా..

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు దగ్గర నుంచి ఇప్పటి వరకు టీఆర్ఎస్ పార్టీ దూసుకుపోతోంది. సాధారణ ఎన్నికలతో పాటు బై ఎలక్షన్స్ లో అక్కడక్కడ విపక్ష పార్టీలు పైచెయ్యి సాధించినా.. టీఆర్ఎస్ ప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరేకంగా పోరాటంలో మాత్రం వెనుకబడుతున్నాయి. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల్లో లోపాలనుగానీ, రాష్ట్రంలో నెలకొన్న సమస్యలనుగానీ ప్రజల్లోకి తీసుకెళ్లడంలో వెనుకబడ్డాయి. దీంతో ఇప్పటి వరకు విడివిడిగా పోరాటం చేసిన ప్రతిపక్ష పార్టీలు.. ఇక నుంచి ప్రజా సమస్యలపై కలిసి పోరాడాలని నిర్ణయించాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరుకు నిరసనగా ఐక్యకార్యచరణతో ముందుకెళ్లనున్నాయి.

  అందిరినీ ఒప్పించడంలో సక్సెస్..

రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్‌గా బాధ్యలు చేపట్టిన తర్వాత.. రాష్ట్ర ప్రభుత్వ తీరుపై ఆందోళనలు, నిరసలు నిర్వహిస్తూ కాంగ్రెస్ క్యాడర్‌లో జోష్ పెంచారు. పార్టీ పరంగా అన్ని జిల్లాల్లోనూ నిరసన కార్యక్రమాలు, దళిత దండోరా సభలను నిర్వహించారు. ఇప్పుడు రాష్ట్రంలోని టీఆర్ఎస్, బీజేపీయేతర పార్టీలన్నింటినీ ఏకం చేయాలని రేవంత్‌రెడ్డి నిర్ణయించారు. కలిసి పోరాడితేనే, ప్రజల్లోకి వెళ్లగలమని.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఆందోళనను ఉధృతం చేయగలమని ఇతర విపక్షాలకు సైతం చెప్పి, ఒప్పించడంలో సక్సెస్ అయ్యారు. ఫలితంగానే ఏడేళ్ల తర్వాత తెలంగాణలో విపక్షాలన్నీ కలిసి ఉమ్మడిపోరుకు సిద్ధమయ్యాయి.

   ఆ లోపాలపైనే పోరాటం..

ఒక్కో సమస్యపై ఒక్కో పార్టీ నిరసనలు చేపట్టడం కన్నా.. అన్ని సమస్యలను గుర్తించి, ఐక్యంగా పోరాటం చేయడం ద్వారా ప్రజల్లో వెళ్లాలని విపక్షాలు ప్లాన్ చేస్తున్నాయి. కలిసి పోరాడితే, అన్ని పార్టీలకు పొలిటికల్‌గా కూడా మైలేజ్ పెరుగుతందని భావిస్తున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాలకు నిరసనగా ఉమ్మడి పోరాటం చేయాలని ప్రతిపక్షాలు నిర్ణయించాయి. గాంధీభవన్లో జరిగిన ప్రతిపక్షాల సమావేశంలో ఫోర్ పాయింట్ ఫార్ములాను ప్రకటించారు. పోడుభూములతో పాటు కేంద్ర ప్రభుత్వ విధానాలకు నిరసనగా ఉమ్మడిగా కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించారు. తెలంగాణలో భూసమస్యలు, ధరణి వెబ్‌సైట్ లోపాలపై సీరియస్‌గా పోరాటం చేస్తామని ప్రతిపక్ష నేతలు చెప్పారు. గాంధీభవన్లో కాంగ్రెస్ ఆధ్వర్యంలో జరిగిన ప్రతిపక్షాల సమావేశంలో సీపీఐ, సీపీఎం, తెలంగాణ జన సమితితో పాటు 12 ప్రతిపక్ష పార్టీలు పాల్గొన్నాయి.

  రాస్తారోకో చేపట్టేందుకు నిర్ణయం..

ఏడేళ్ల తర్వాత తెలంగాణలో ప్రతిపక్షాలను ఏకం చేశారు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. ముఖ్యంగా నాలుగు కార్యక్రమాలతో ప్రజల్లోకి వెళ్లాలని.. గాంధీభవన్లో జరిగిన ప్రతిపక్షాల సమావేశంలో నిర్ణయించారు. రాష్ట్రంలోని ప్రజా సమస్యలపై ఈ నెల 22న.. టీఆర్ఎస్, బీజేపీ యేతర పార్టీలన్నీ కలిసి హైదరాబాద్ ఇందిరాపార్కు దగ్గర మహాధర్నా నిర్వహించనున్నాయి. పెంచిన ధరలకు నిరసనగా ఈనెల 25న జరగనున్న భారత్ బంద్‌ను విజయవంతం చేసేందుకు ప్రతిపక్ష పార్టీలన్నీ మద్దతు ప్రకటించాయి.


టీఆర్ఎస్, బీజేపీ ప్రభుత్వాల ప్రజావ్యతిరేక నిర్ణయాలకు నిరసనగా.. ఈనెల 30న తెలంగాణలోని అన్ని జిల్లాల్లో కలెక్టర్లకు వినతిపత్రాలు ఇవ్వనున్నారు. వచ్చే నెల 5న పోడుభూముల సంబంధించి రాస్తారోకో నిర్వహించనున్నారు. పోడుభూముల సమస్యపై అశ్వారావుపేట నుంచి ఆదిలాబాద్ వరకు రాస్తారోకో చేస్తామని ప్రకటించాయి.

చాలా ఏళ్ల తర్వాత..

భవిష్యత్తులోనూ ఇదే విధంగా కార్యచరణను రూపొందించుకుని ముందుకెళ్లాలని ప్రతిపక్షాలు భావిస్తున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుస‌రిస్తోన్న తీరుకి నిరసనగా.. పోరాటాల‌కు ఎప్పటికప్పడు ప్రణాళిక‌లు ఖ‌రారు చేయనున్నారు. జాతీయ, రాష్ట్ర స్థాయిలోని అన్ని పార్టీలను కలుపుకొని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా పోరాటం చేయాలని ఏఐసీసీ ఆదేశించడంతో రేవంత్ రెడ్డి.. టీఆర్ఎస్, బీజేపీయేతర పార్టీలను ఏకం చేశారనే ప్రచారం జరుగుతోంది. చాలా సంవత్సరాల తర్వాత ప్రతిపక్షాలను ఏకం చేసిన క్రెడిట్ మాత్రం రేవంత్‌కే దక్కిద్దని రాజకీయ వర్గాలు అంటున్నాయి. విపక్షాల ఐక్యపోరాటం ఎలాంటి ఫలితాలను ఇస్తాయో వేచి చూడాలి.

క్రైమ్ మరిన్ని...