ఆకలి చావుల నుంచి Afghanని కాపాడండి....

ABN , First Publish Date - 2021-10-30T19:18:42+05:30 IST

ఆఫ్ఘనిస్థాన్‌లో ఆహార కొరత వేధిస్తోందని, ఆ దేశానికి

ఆకలి చావుల నుంచి Afghanని కాపాడండి....

న్యూఢిల్లీ : ఆఫ్ఘనిస్థాన్‌లో ఆహార కొరత వేధిస్తోందని, ఆ దేశానికి చేయూతనివ్వకపోతే, వ్యాధులు, మరణాలు తీవ్ర స్థాయిలో విజృంభిస్తాయని ఐక్య రాజ్య సమితి హ్యుమనిటేరియన్ చీఫ్ మార్టిన్ గ్రిఫిత్స్ అన్నారు. ఆ దేశానికి పెద్ద ఎత్తున ఆహారాన్ని అందజేసి, ఆకలి చావులను నిరోధించాలని ప్రపంచ దేశాలను అత్యంత ఆర్థ్రతతో కోరారు. 


ప్రపంచంలో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థలుగల 20 దేశాల నేతలు సమావేశమవుతున్న తరుణంలో గ్రిఫిత్స్ శుక్రవారం ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆఫ్ఘనిస్థాన్ ఎదుర్కొంటున్న దయనీయ పరిస్థితులను వివరించారు. ఆఫ్ఘనిస్థాన్‌లో చలి కాలం ప్రారంభమవుతోందని, ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతోందని, జనాభాలో సగం మంది సరిపడినంత ఆహారం లేకపోవడంతో వ్యాధులు, మరణాల బారిన పడే ప్రమాదం ఉందని చెప్పారు. ఆ దేశంలో అవసరాలు ఆకాశాన్ని తాకుతున్నాయని చెప్పారు. ఆ దేశంలోని ఐదేళ్ళ లోపు వయసుగల బాలల్లో సగం మంది తీవ్రమైన పోషకాహార లోపానికి గురయ్యే ప్రమాదంలో ఉన్నారని తెలిపారు. ప్రతి ప్రావిన్స్‌లోనూ మీజిల్స్ వ్యాధి ప్రబలుతోందని, ఇది ప్రమాద సూచిక అని చెప్పారు. 


ఆహార భద్రత లేకపోవడం వల్ల పోషకాహార లోపం ఏర్పడుతుందని, ఫలితంగా వ్యాధులు ప్రబలుతాయని, ఆ తర్వాత మరణాలు సంభవిస్తాయని, దిద్దుబాటు చర్యలు చేపట్టకపోతే, ప్రపంచం ఆఫ్ఘనిస్థాన్‌లో మరణాలను చూడవలసి వస్తుందని చెప్పారు. ప్రస్తుతం వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ ఆఫ్ఘనిస్థాన్‌లోని నాలుగు మిలియన్ల మందికి ఆహారం అందజేస్తోందని, దీనిని మూడు రెట్లు పెంచాలని కోరారు. 12 మిలియన్ల మందికి ఆహారాన్ని సరఫరా చేయవలసిన పరిస్థితి ఉందని ఐక్య రాజ్య సమితి అంచనా వేస్తోందన్నారు. ఆఫ్ఘనిస్థాన్‌లో గత కొన్నేళ్ళలో రెండు కరువులు రావడం, తాలిబన్లు, ఆఫ్ఘన్ ప్రభుత్వం మధ్య పోరాటం, ఆర్థిక వ్యవస్థ కుప్పకూలడం వల్ల ఈ పరిస్థితులు ఏర్పడ్డాయన్నారు. 


జీ20 సదస్సు అక్టోబరు 30, 31 తేదీల్లో ఇటలీ రాజధాని నగరం రోమ్‌లో జరుగుతుంది. ఈ సదస్సులో పాల్గొనేందుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇప్పటికే ఇటలీ చేరుకున్నారు. 



Updated Date - 2021-10-30T19:18:42+05:30 IST