ఆరు దేశాలకు శాశ్వత సభ్యత్వమివ్వాలి

ABN , First Publish Date - 2021-01-27T07:00:55+05:30 IST

‘‘ఐక్య రాజ్య సమితి(ఐరాస) భద్రతామండలిలో ఆరు దేశాలకు శాశ్వత సభ్యత్వమివ్వాలి. సమస్యల్ని ఎదుర్కొనే దేశాలకు స్థానం కల్పించాలి. ఏ దేశం కూడా సభ్య దేశంగానే

ఆరు దేశాలకు శాశ్వత సభ్యత్వమివ్వాలి

ఐరాసలో భారత శాశ్వత ప్రతినిధి తిరుమూర్తి


ఐరాస, జనవరి 26: ‘‘ఐక్య రాజ్య సమితి(ఐరాస) భద్రతామండలిలో ఆరు దేశాలకు శాశ్వత సభ్యత్వమివ్వాలి. సమస్యల్ని ఎదుర్కొనే దేశాలకు స్థానం కల్పించాలి. ఏ దేశం కూడా సభ్య దేశంగానే మిగిలిపోవాలని కోరుకోదు. ప్రాంతీయంగా కాకుండా.. దేశాల వారీగా శాశ్వత సభ్యతం ఉండాలి. అప్పుడే భద్రతామండలి బలోపేతమవుతుంది. సమకాలీన సవాళ్లను ఎదుర్కొనే సామర్థ్యాన్ని సొంతం చేసుకుని, విశాలదృక్పథం, పారదర్శతతో ముందుకు సాగుతుంది. ఇవన్నీ జరగని పక్షంలో.. మేము (కొన్ని సభ్యదేశాలు) దేశాల మధ్య అంతర్‌ ప్రభుత్వ చర్చలు (ఐజీఎన్‌)కు ప్రత్యామ్నాయం వైపు చూడాల్సి ఉంటుంది’’ అంటూ ఐరాసలో సంస్కరణలు జరగకపోవడంపై భారత్‌ ఘాటుగా వ్యాఖ్యానించింది. సోమవారం ఐజీఎన్‌పై జరిగిన ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశంలో.. ఐరాసలో భారత శాశ్వత ప్రతినిధి టి.ఎ్‌స.తిరుమూర్తి మాట్లాడారు. భద్రతామండలి సభ్యత్వాల పెంపు, న్యాయమైన, నిష్పాక్షికమైన ప్రాతినిధ్యంపై ఈ సమావేశంలో చర్చించారు.


ఈ సందర్భంగా వివిధ దేశాల మధ్య చర్చల్లో ఆలస్యంపై తిరుమూర్తి అసహనం వ్యక్తం చేశారు. ‘‘కొన్ని దేశాలు ఐరాస సంస్కరణలను ఉద్దేశపూర్వకంగా అడ్డుకుంటున్నాయి.  సంస్కరణల ప్రక్రియను ముందుకు తీసుకెళ్లాలనే సంకల్పం కంటే.. అభ్యంతరాలే బలంగా మారాయి.  భద్రతామండలి సంస్కరణ ప్రక్రియ కన్నా.. ఐరాస ఎక్కువగా మెలికలు తిరిగిన బాటలో పయనించింది. భద్రతామండలిని సంస్కరించాలనే ప్రతిపాదన 43 ఏళ్ల నాటిది. 13 ఏళ్ల క్రితం ఐజీఎన్‌ కూడా ప్రారంభమైంది. ఈ ప్రక్రియను ప్రారంభించినప్పుడు ఉన్నట్లుగా ప్రపంచం ఇప్పుడు లేదు. 21వ శతాబ్దంలో సవాళ్లు అనేక రెట్లు పెరిగాయి’’ అని తీవ్రంగా విమర్శించారు. కొత్తగా ఆరు దేశాలకు శాశ్వత సభ్యత్వం కల్పించాలని తిరుమూర్తి ప్రతిపాదించారు. ‘‘ఆఫ్రికా దేశాల్లో రెండింటికి, ఆసియాలో మరో రెండింటికి, లాటిన్‌ అమెరికా, కరీబియన్‌కు ఒకటి, పశ్చిమ ఐరోపా, ఇతర గ్రూప్‌నకు ఒకటి చొప్పున శాశ్వత సభ్యత్వం కల్పించాలి’’ అని ఉద్ఘాటించారు. ప్రస్తుతం భద్రతా మండలిలో అమెరికా, ఇంగ్లండ్‌, రష్యా, చైనా, ఫ్రాన్స్‌ శాశ్వత సభ్య దేశాలుగా ఉన్నాయి. భారత్‌కు శాశ్వత సభ్యత్వం కల్పించాలని పలు దేశాలు ప్రతిపాదిస్తున్నా.. చైనా దాన్ని అడ్డుకుంటోంది.

Updated Date - 2021-01-27T07:00:55+05:30 IST