Aug 3 2021 @ 00:32AM

నేషనల్‌ ఆర్కైవ్స్‌లో అపురూప తెలుగు సినిమా జ్ఞాపకాలు

తెలుగు సినిమా ప్రారంభమైన తొలి రోజుల్లో సినిమా హాళ్లలో ప్రదర్శించిన అపురూపమైన 450 సినిమా గ్లాస్‌ స్లైడ్లను నేషనల్‌ ఫిల్మ్‌ ఆర్కైవ్‌ ఆఫ్‌ ఇండియా (ఎన్‌ఎ్‌ఫఏఐ) సేకరించింది. సినిమా ప్రారంభానికి ముందు లేదా ఇంటర్వెల్స్‌లో కొత్త సినిమా ఆకర్షణల గురించి తెలిపేందుకు రెండు పలుచటి చదరపు గ్లాసు అద్దాల మధ్య పాజిటివ్‌ ఫిల్మ్‌ను చేర్చేవారు. 1930 నుంచి 1950 వరకు తెలుగు సినిమాలకు సంబంధించిన చరిత్ర ఈ గ్లాస్‌ సైడ్ల ద్వారా లభిస్తుందని నేషనల్‌ ఫిల్మ్‌ ఆర్కైవ్స్‌ అధికారులు తెలిపారు. ఇందులో 1939లో రూపొందించిన వై.వి. రావు ‘మళ్లీ పెళ్లి’, బి.ఎన్‌. రెడ్డి ‘వందేమాతరం, అక్కినేని నాగేశ్వరరావు-అంజలీ దేవి నటించిన ‘కీలుగుర్రం’ (1949), నందమూరి తారక రామారావు ‘దాసి’ (1952), వేదాంతం రాఘవయ్య దర్శకత్వంలో అక్కినేని నటించిన ‘దేవదాసు’ (1953) మొదలైనవి కూడా ఉన్నాయి. ప్రస్తుతం తమ వద్ద హిందీ, గుజరాతీ, తెలుగు సినిమాలకు చెందిన రెండువేల గ్లాస్‌ స్లైడ్లు ఉన్నాయని ఎన్‌ఎ్‌ఫఏఐ డైరెక్టర్‌ ప్రకాశ్‌ మగ్దూం తెలిపారు. ఇవి భారతీయ సినిమా వారసత్వ సంపదకు చెందిన అపురూప రికార్డులని ఆయన చెప్పారు. పాత సినిమాలకు సంబంధించిన గ్లాస్‌ స్లైడ్లు, పోస్టర్లు, ఫుటేజీలు, లాబీ కార్డులు, చిత్రాలను తమ వద్ద డిపాజిట్‌ చేస్తే పరిరక్షిస్తామని ఆయన సినిమా ప్రేమికులను అభ్యర్థించారు.