అనర్హులకు చేరిన రూ.3 వేల కోట్ల పీఎం-కిసాన్ నిధులు : కేంద్రం

ABN , First Publish Date - 2021-07-20T22:21:06+05:30 IST

అనర్హులకు చేరిన పీఎం-కిసాన్ నిధులను తిరిగి రాబట్టవలసి

అనర్హులకు చేరిన రూ.3 వేల కోట్ల పీఎం-కిసాన్ నిధులు : కేంద్రం

న్యూఢిల్లీ : అనర్హులకు చేరిన పీఎం-కిసాన్ నిధులను తిరిగి రాబట్టవలసి ఉందని కేంద్ర ప్రభుత్వం మంగళవారం పార్లమెంటుకు తెలిపింది. ఈ పథకం క్రింద ఒక్కొక్క రైతుకు సంవత్సరానికి రూ.6,000 చొప్పున కేంద్ర ప్రభుత్వం అందజేస్తున్న సంగతి తెలిసిందే. ఈ పథకం క్రింద దాదాపు 42 లక్షల మంది అనర్హులు రూ.3,000 కోట్ల మేరకు పొందినట్లు ప్రభుత్వం గుర్తించింది. ఆదాయపు పన్ను చెల్లించేవారు ఈ పథకం క్రింద లబ్ధి పొందడానికి అనర్హులు. 


వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ పార్లమెంటులో మంగళవారం ఓ ప్రశ్నకు సమాధానం చెప్తూ, పీఎం-కిసాన్ స్కీమ్ క్రింద సొమ్ము తీసుకున్న అనర్హులైన 42.16 లక్షల మంది నుంచి రూ.2,992 కోట్లు రాబట్టవలసి ఉందని చెప్పారు. అస్సాంలో 8.35 లక్షల మంది అనర్హులు రూ.554 కోట్లు పొందారని తెలిపారు. తమిళనాడులో 7.22 లక్షల మంది రూ.340 కోట్లు, పంజాబ్‌లో 5.62 లక్షల మంది రూ.437 కోట్లు, మహారాష్ట్రలో 4.45 లక్షల మంది రూ.358 కోట్లు, ఉత్తర ప్రదేశ్‌లో 2.65 లక్షల మంది రూ.258 కోట్లు, గుజరాత్‌లో 2.36 లక్షల మంది రూ.220 కోట్లు అక్రమంగా పొందారని తెలిపారు. 


పీఎం-కిసాన్ పథకం అమలులో తప్పులను నివారించేందుకు ఆధార్, పీఎఫ్ఎంఎస్, ఆదాయపు పన్ను శాఖ డేటాబేస్ వంటివాటిని ఉపయోగిస్తున్నట్లు తెలిపారు. కొందరు అనర్హులకు ఈ పథకం లబ్ధి చేరినట్లు తనిఖీల్లో తేలిందన్నారు. ఆదాయపు పన్ను చెల్లించేవారు కూడా ఈ నిధులను పొందినట్లు వెల్లడైందని చెప్పారు. ఈ పథకం క్రింద నిధులను దుర్వినియోగపరచడానికి వీల్లేకుండా కొన్ని ప్రత్యేక చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. అసలు సిసలు రైతులు మాత్రమే లబ్ధి పొందే విధంగా ఈ పథకాన్ని అమలు చేయడానికి చర్యలు తీసుకున్నామన్నారు. కొన్ని రాష్ట్రాలు ఇప్పటికే అక్రమ లబ్ధిదారులకు నోటీసులు ఇచ్చినట్లు తెలిపారు. 


Updated Date - 2021-07-20T22:21:06+05:30 IST