దేశవ్యాప్త ఎన్ఆర్‌సీపై కేంద్ర మంత్రి వివరణ

ABN , First Publish Date - 2021-03-17T23:24:31+05:30 IST

జాతీయ పౌరుల రిజిస్టర్ (ఎన్ఆర్‌సీ)ని దేశవ్యాప్తంగా అమలు చేయడంపై

దేశవ్యాప్త ఎన్ఆర్‌సీపై కేంద్ర మంత్రి వివరణ

న్యూఢిల్లీ : జాతీయ పౌరుల రిజిస్టర్ (ఎన్ఆర్‌సీ)ని దేశవ్యాప్తంగా అమలు చేయడంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని కేంద్ర ప్రభుత్వం బుధవారం రాజ్యసభకు తెలిపింది. ఈ మేరకు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ ఓ ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. 


దేశవ్యాప్తంగా ఎన్‌ఆర్‌సీని అమలు చేయడానికి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందా? అనే ప్రశ్నకు కేంద్ర మంత్రి రాయ్ బుధవారం రాజ్యసభకు లిఖితపూర్వక సమాధానం చెప్పారు. జాతీయ స్థాయిలో ఎన్‌ఆర్‌సీని తయారు చేయడంపై ప్రభుత్వం ఇప్పటి వరకు ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని చెప్పారు. 


అస్సాంలో ఎన్‌ఆర్‌సీని సుప్రీంకోర్టు పర్యవేక్షణలో ఆధునికీకరించారు. తుది ఎన్‌ఆర్‌సీని 2019 ఆగస్టు 31న ప్రచురించారు. మొత్తం దరఖాస్తులు 3,30,27,661 కాగా, వీటిలో 19.06 లక్షల దరఖాస్తులను తిరస్కరించారు. దీంతో దేశవ్యాప్తంగా ఆందోళన తలెత్తింది. అస్సాంలో నివసిస్తున్న అర్హులైన భారతీయ పౌరుల సమాచారాన్ని ఎన్ఆర్‌సీ అందిస్తుంది. 


నిత్యానంద రాయ్ మరొక ప్రశ్నకు సమాధానం చెప్తూ, పౌరసత్వ చట్టం, 1955; ఎన్ఆర్‌సీ ప్రకారం డిటెన్షన్ సెంటర్ల ఏర్పాటుకు వీలు కల్పించే నిబంధనలు లేవని తెలిపారు. శిక్ష పూర్తయిన విదేశీయులను జైలు నుంచి తక్షణమే విడుదల చేయాలని 2012 ఫిబ్రవరి 28న సుప్రీంకోర్టు ఆదేశించిందని తెలిపారు. వీరిని తగిన చోట ఉంచాలని, వారిని మన దేశం నుంచి పంపించే వరకు వారు మన దేశంలో సంచరించే అవకాశాలను పరిమితం చేయాలని తెలిపిందని పేర్కొన్నారు. ఈ ఆదేశాలను అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆదేశాలు ఇచ్చిందని తెలిపారు. 


Updated Date - 2021-03-17T23:24:31+05:30 IST