న్యూఢిల్లీ : కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ మన దేశంలోనే తొలి గ్రీన్ హైడ్రోజన్ పవర్డ్ కారులో తన నివాసం నుంచి పార్లమెంటుకు ప్రయాణించారు. ఇది భావి భారత కారు అని చెప్పారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కూడా ఈ కారును ప్రశంసించారని చెప్పారు. స్వయం సమృద్ధ భారత దేశంగా మారే దిశగా ఇది పెద్ద ముందడుగు అని తెలిపారు. పెట్రోలు, డీజిల్ వల్ల కాలుష్యం వస్తోందని, హైడ్రోజన్ సెల్ కార్ల వల్ల కాలుష్యం రాదన్నారు.
హైడ్రోజన్లో మూడు రకాలు ఉన్నాయని, ఈ కారు కోసం వాడుతున్నది గ్రీన్ హైడ్రోజన్ అని చెప్పారు. ఈ కారులో ప్రయాణానికి కిలోమీటరుకు రూ.1.50 ఖర్చవుతుందని తెలిపారు. దీని జపనీస్ పేరు Mirai అని తెలిపారు.
గడ్కరీ ఈ నెల 16న ఇచ్చిన ట్వీట్లో, భారత దేశాన్ని ఇంధన స్వయంసమృద్ధం చేసేందుకు సమగ్ర, పర్యావరణహితకర, సుస్థిర ఇంధన మార్గం గ్రీన్ హైడ్రోజన్ అని తెలిపారు. భారత దేశ తొలి హైడ్రోజన్ ఆధారిత ఆధునిక ఫ్యూయల్ సెల్ ఎలక్ట్రిక్ వాహనం Toyota Miraiను గడ్కరీ ఆవిష్కరించారు. జనవరిలో ఆయన మాట్లాడుతూ, హైడ్రోజన్ పవర్డ్ కారును తాను స్వయంగా ఉపయోగిస్తానని చెప్పిన సంగతి తెలిసిందే.
ఇవి కూడా చదవండి