NCP నేత ఫిర్యాదుపై స్పందించిన నితిన్ గడ్కరీ

ABN , First Publish Date - 2022-02-02T19:39:04+05:30 IST

మహారాష్ట్రలోని గంగాఖేద్ నుంచి పర్బని వరకు జాతీయ రహదారి

NCP నేత ఫిర్యాదుపై స్పందించిన నితిన్ గడ్కరీ

న్యూఢిల్లీ : మహారాష్ట్రలోని గంగాఖేద్ నుంచి పర్బని వరకు జాతీయ రహదారి నిర్మాణం నాసిరకంగా జరిగిందని ఎన్‌సీపీ నేత ఫౌజియా ఖాన్ చేసిన ఫిర్యాదును తాను పరిశీలిస్తానని కేంద్ర రోడ్డు రవాణా, హైవేల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ చెప్పారు. ఫౌజియా రాజ్యసభలో బుధవారం క్వశ్చన్ అవర్‌లో ఈ అంశాన్ని లేవనెత్తినపుడు గడ్కరీ స్పందించారు. 


ఫౌజియా మాట్లాడుతూ, జాతీయ రహదారులను నాణ్యతా ప్రమాణాలను దృష్టిలో ఉంచుకుని నిర్మిస్తారని చెప్పారు. చాలా చోట్ల కాంట్రాక్టర్లు, ప్రభుత్వోద్యోగులు చేతులు కలిపి అవినీతికి పాల్పడుతున్నట్లు కనిపిస్తోందన్నారు. రోడ్ స్పెసిఫికేషన్స్‌ను పట్టించుకోవడం లేదన్నారు. రోడ్ నంబర్ 752Kలో గంగాఖేద్ నుంచి పర్బని వరకు రహదారి బీటలువారినట్లు తాను కేంద్ర మంత్రికి ఫిర్యాదు చేశానని చెప్పారు. ప్రతి ప్రభుత్వ అధికారి ఉద్దేశపూర్వకంగా చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు కనిపిస్తోందని, తన ఫిర్యాదుపై ఎటువంటి స్పందన కనిపించడం లేదని తెలిపారు. ప్రభుత్వానికి, కేంద్ర మంత్రికి తాను ఫిర్యాదులు చేస్తున్నప్పటికీ పట్టించుకోవడం లేదన్నారు. ప్రభుత్వ ధనాన్ని ఈ విధంగా బాధ్యతారహితంగా ఖర్చుపెట్టడాన్ని ఎలా అనుమతించగలమని ప్రశ్నించారు. 


నితిన్ గడ్కరీ స్పందిస్తూ, ఈ ప్రాజెక్టు నాణ్యతపై ఫిర్యాదు తనకు అందినట్లు తెలిపారు. దీనిపై మళ్ళీ దర్యాప్తు జరుపుతానని, అన్ని విషయాలను పరిశీలిస్తానని చెప్పారు. 


Updated Date - 2022-02-02T19:39:04+05:30 IST