పెద్ద చేపలను పట్టండి... డీఆర్‌ఐకి నిర్మల సీతారామన్ ఆదేశం...

ABN , First Publish Date - 2021-12-04T22:15:35+05:30 IST

మన దేశంలోకి వస్తున్న కొకెయిన్, హెరాయిన్ వంటి

పెద్ద చేపలను పట్టండి... డీఆర్‌ఐకి నిర్మల సీతారామన్ ఆదేశం...

న్యూఢిల్లీ : మన దేశంలోకి వస్తున్న కొకెయిన్, హెరాయిన్ వంటి విషపూరిత వ్యర్థాలు అత్యంత ప్రమాదకరమని, వీటిని అక్రమంగా తీసుకొస్తున్న పెద్ద చేపలను పట్టుకోవాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ పేర్కొన్నారు. డిపార్ట్‌మెంట్ ఆఫ్ రెవిన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) 64వ వ్యవస్థాపక దినోత్సవాలలో ఆమె శనివారం మాట్లాడారు. 


మన దేశంలోకి పెద్ద ఎత్తున విషపూరిత వ్యర్థాలు వచ్చిపడుతున్నాయని, వీటి వల్ల పెను ప్రమాదం పొంచి ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ వ్యర్థాలను తీసుకొచ్చేందుకు తరచూ పెద్ద ఎత్తున ప్రయత్నాలు జరుగుతున్నాయని, ఈ పెద్ద చేపలను పట్టుకోవడానికి మరింత కృషి చేయాలని డీఆర్ఐని ఆదేశించారు. స్మగ్లింగ్‌ను నిరోధించేందుకు క్షేత్రస్థాయిలో కృషి చేస్తున్న డీఆర్ఐ అధికారుల సేవలను ప్రశంసించారు. 


ప్రతి చిన్న ప్రయత్నం చాలా ముఖ్యమైనదని చెప్పారు. 3,000 కేజీల కొకెయిన్, హెరాయిన్‌; 4,500 కేజీల కనబీస్‌ను పట్టుకోవడం తేలికైన విషయం కాదన్నారు. ఒకేసారి 900 కేజీల బంగారాన్ని జప్తు చేయడం చాలా గొప్ప విషయమని చెప్పారు. డీఆర్ఐ వంటి సంస్థ భారత దేశానికి అవసరమన్నారు. 


ఈ ఆటలో క్రింది స్థాయిలో ఉన్నవారు సులువుగానే దొరుకుతారని, ఈ మొత్తం అక్రమాల వెనుక ఉన్న పెద్ద తలలను పట్టుకోవలసిన అవసరం ఉందని చెప్పారు. పెద్ద తలలు చట్టానికి పట్టుబడటం లేదన్నారు. తార్కిక ముగింపు అవసరమని చెప్పారు. ఇటువంటి కార్యకలాపాలను ప్రోత్సహిస్తున్నవారికి సెగ తగలాలంటే వేగంగా ముగింపు ఇవ్వాలన్నారు. ఎంత వేగంగా చర్యలు తీసుకుంటే, అంత గొప్పగా దీనిని నిరోధించవచ్చునని తెలిపారు. 


స్మగ్లింగ్‌ను నిరోధించేందుకు మన దేశంలో పని చేస్తున్న ప్రధాన నిఘా వ్యవస్థ డీఆర్ఐ. ఇది స్మగ్లింగ్, పన్నుల ఎగవేత, వ్యాపారపరమైన మోసాలు, నకిలీ భారతీయ కరెన్సీ, వ్యాపారపరమైన మనీలాండరింగ్ వంటివాటిని అరికట్టడంలో విశేషంగా కృషి చేస్తోంది. 


Updated Date - 2021-12-04T22:15:35+05:30 IST