కేంద్ర మంత్రి నక్వీ రాజీనామా

ABN , First Publish Date - 2022-07-07T08:24:32+05:30 IST

కేంద్ర మంత్రి ముక్తార్‌ అబ్బాస్‌ నక్వీ గురువారం తన మంత్రి పదవికి రాజీనామా చేశారు.

కేంద్ర మంత్రి నక్వీ రాజీనామా

మరో మంత్రి ఆర్‌సీపీ సింగ్‌ కూడా...

నేటితో ఇద్దరి రాజ్యసభ పదవీకాలం పూర్తి 

నక్వీకి ‘ఉపరాష్ట్రపతి’పై ఊహాగానాలు

నూపుర్‌ వివాదంతో ముస్లింవ్యతిరేక ముద్ర

నక్వీకి రాజ్యాంగ పదవితో చెరిపేసే యత్నం


న్యూఢిల్లీ, జూలై 6 (ఆంధ్రజ్యోతి): కేంద్ర మంత్రి ముక్తార్‌ అబ్బాస్‌ నక్వీ గురువారం తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. దీంతో ఆయనను ఉపరాష్ట్రపతిని చేస్తారనే ఊహాగానాలు ఊపందుకున్నాయి. నక్వీతోపాటు మరో కేంద్ర మంత్రి ఆర్‌సీపీ సింగ్‌ కూడా రాజీనామా చేశారు. వారిద్దరి రాజ్యసభ పదవీకాలం శుక్రవారంతో ముగుస్తుండటంతో తమ పదవులకు రాజీనామా చేశారు. జనతాదళ్‌ (యు)కు చెందిన ఆర్‌సీపీ సింగ్‌ను ఆ పార్టీ అధినేత, బీహార్‌ ముఖ్యమంత్రి నితీష్‌ కుమార్‌ మరోసారి రాజ్యసభకు నామినేట్‌ చేయకపోవడంతో ఆయన రాజీనామా చేయాల్సి వచ్చింది.


అయితే బీజేపీకి చెందిన మైనారిటీ వ్యవహారాల మంత్రి ముక్తార్‌ అబ్బాస్‌ నక్వీని ఆ పార్టీ మళ్లీ రాజ్యసభకు పంపలేదు. అంతేగాక... ఇంతకుముందు నక్వీ ప్రాతినిధ్యం వహించిన రాంపూర్‌ (ఉత్తరప్రదేశ్‌) లోక్‌సభ నియోజకవర్గానికి ఇటీవల ఉప ఎన్నిక లు జరిగినప్పటికీ ఆయనను అక్కడ పోటీ చేయించలేదు. అందువల్ల నక్వీ ఉపరాష్ట్రపతి అయ్యే అవకాశాలున్నాయని భావిస్తున్నారు. ఉపరాష్ట్రపతి పదవికి నామినేషన్లు దాఖలు చేసేందుకు జూలై 19 చివరి తేదీ కాగా, ఆగస్టు 6న ఎన్నికలు జరగనున్నాయి. ప్రస్తుత ఉపరాష్ట్రపతి వెంకయ్య పదవీకాలం ఆగస్టు 10తో ముగుస్తుంది. పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు జూలై 18 నుంచి ఆగస్టు 12 వరకు జరగనున్న విషయం తెలిసిందే.


కొత్త టీమ్‌ నిర్మాణంలో భాగంగానే...

కాగా... కొత్త టీమ్‌ను నిర్మించుకునే ప్రయత్నాల్లో భాగంగానే నక్వీని మోదీ ఉపరాష్ట్రపతి పదవికి పంపించవచ్చని పరిశీలకులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మాజీ ప్రధాని అటల్‌ బిహారీ వాజపేయి మంత్రివర్గంలో పనిచేసిన మంత్రులందర్నీ రాజ్యాంగ పదవుల్లో నియమిస్తున్నారని అంచనా వేస్తున్నారు. వాజపేయి మంత్రివర్గంలో పనిచేసినవారిలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ ఒక్కరే ప్రస్తుత మంత్రివర్గంలో ఉన్నారు. ఆయన భవిష్యత్తు గురించి కూడా ఊహాగానాలు వినపడుతున్నాయి. నక్వీ తన పదవికి రాజీనామా చేసే ముందు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను కలుసుకోవడం గమనార్హం. నక్వీ, ఆర్‌సీపీ సింగ్‌ సేవలను ప్రధాని నరేంద్ర మోదీ క్యాబినెట్‌ సమావేశంలో ప్రస్తుతించి వారికి వీడ్కోలు పలికారు. 


ఇక నక్వీ విషయానికొస్తే.... బీజేపీ రాజకీయాల్లో ఇమిడిపోయి కేంద్రంలో మోదీ ప్రభుత్వం తీసుకున్న అనేక నిర్ణయాలను ఆయన సమర్థించారు. ఈ నేపథ్యంలో నక్వీని ఉపరాష్ట్రపతిగా నియమించడం ద్వారా తనపై ఉన్న ముస్లిం వ్యతిరేక ముద్రను తొలగించుకునే ప్రయత్నం బీజేపీ చేయవచ్చని చర్చ జరుగుతోంది. నూపుర్‌ శర్మ వ్యాఖ్యల ద్వారా ఇస్లామిక్‌ దేశాల్లో, దేశంలోని ముస్లింలలో చెలరేగిన అలజడిని... నక్వీకి రాజ్యాంగ పదవి ఇవ్వడం ద్వారా శాంతింప చేసినట్లవుతుందని భావిస్తున్నారు. అయితే నక్వీ షియా ముస్లిం కావడం వల్ల బీజేపీ ఆశిస్తున్న ప్రయోజనాలు ఎంతమేరకు నెరవేరతాయన్నది చెప్పలేమని పరిశీలకులు అంటున్నారు. భారత ముస్లింలలో అధిక భాగం సున్నీలు కాగా... షియాలు మొత్తం ముస్లింలలో 10 నుంచి 15 శాతం వరకు ఉంటారని అంచనా. అంతేగాక ముక్తార్‌ అబ్బాస్‌ నక్వీ సతీమణి సీమా నక్వీ హిందూ మహిళ. కాలేజీ రోజుల్లోనే వారు ప్రేమించుకుని... తమ కుటుంబాలు వ్యతిరేకించినప్పటికీ రిజిస్టర్డ్‌ వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత కుటుంబాలు దిగిరావడంతో హిందూ, ఇస్లాం సంప్రదాయాల ప్రకారం కూడా వివాహం చేసుకున్నారు. ఈ రకంగా కూడా నక్వీ బీజేపీ నాయకత్వాన్ని మెప్పించగలిగారు. పౌరసత్వ సవరణ బిల్లు, ట్రిపుల్‌ తలాక్‌ అంశాల్లోనూ బీజేపీకి అండగా నిలిచారు. కరోనా సమయంలో నిజాముద్దీన్‌లో తబ్లిగీలు సమావేశమై మహమ్మారి వ్యాప్తికి కారణమైనందుకు ఆయన తీవ్ర విమర్శలు చేశారు. వీటన్నిటి ఫలితంగా బీజేపీ అధిష్టానానికి నక్వీ దగ్గరయ్యారు. అంతేకాక... షియాలు ప్రపంచవ్యాప్తంగా సుమారు 40 దేశాల్లో ఉన్నారు. ఈ దేశాలను మోదీ ప్రభుత్వానికి అనుకూలంగా మార్చుకునేందుకు నక్వీ నియామకం ఉపయోగపడొచ్చనే చర్చ జరుగుతోంది. అయితే అత్యంత మెతక స్వభావి అయిన నక్వీ రాజ్యసభ చైర్మన్‌గా సమర్థంగా పనిచేయలేకపోవచ్చునని, ఈ రీత్యా ఆయనను ఉపరాష్ట్రపతిగా నియమిస్తారా లేదా అన్నది చెప్పలేమని మరికొన్ని వర్గాలు అంటున్నాయి.

Updated Date - 2022-07-07T08:24:32+05:30 IST