న్యూఢిల్లీ : ఉత్తర ప్రదేశ్‌లోని లఖింపూర్ ఖేరీలో జరిగిన హింసాకాండ కేసుపై దర్యాప్తును పర్యవేక్షిస్తున్న సుప్రీంకోర్టు నియమిత కమిటీ సిఫారసు కేంద్ర మంత్రి అజయ్ మిశ్రాకు శరాఘాతంగా మారింది. ఆయన కుమారుడు, ఈ కేసులో నిందితుడు ఆశిష్ మిశ్రాకు మంజూరైన బెయిలును రద్దు చేయాలని ఈ కమిటీ సిఫారసు చేసినట్లు సుప్రీంకోర్టు బుధవారం ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి తెలిపింది.
ఈ కేసులో ప్రధాన నిందితుడైన ఆశిష్ మిశ్రా బెయిలును రద్దు చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు బుధవారం విచారణ జరిపింది. ఆశిష్ బెయిలును రద్దు చేయాలని తాను నియమించిన కమిటీ సిఫారసు చేసిందని, దీనిపై వైఖరిని సోమవారం నాటికి తెలియజేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఆశిష్‌కు మంజూరైన బెయిలును రద్దు చేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో అపీలు చేయాలని పర్యవేక్షక న్యాయమూర్తి రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాశారని, రాష్ట్ర హోం శాఖ అదనపు ప్రధాన కార్యదర్శికి ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) రెండు లేఖలు రాసిందని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ చెప్పారు.
లఖింపూర్ ఖేరీలో 2021 అక్టోబరులో జరిగిన హింసాకాండలో ఎనిమిది మరణించారు, వీరిలో నలుగురు రైతులు ఉన్నారు. బాధితుల కుటుంబ సభ్యులు ఆశిష్‌కు బెయిలు ఇవ్వడాన్ని వ్యతిరేకించారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున వాదనలు వినిపించిన సీనియర్ అడ్వకేట్ మహేశ్ జెఠ్మలానీ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వ హోం శాఖ అదనపు ప్రధాన కార్యదర్శికి ఈ లేఖలు చేరలేదని చెప్పారు. ఈ లేఖలు తనకు చేరలేదని అదనపు ప్రధాన కార్యదర్శి చెప్పారని తెలిపారు. దీంతో సుప్రీంకోర్టు స్పందిస్తూ, సిట్ నివేదికలను పరిశీలించాలని, ఏప్రిల్ 4నాటికి రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలని చెప్పారు.
ఇదిలావుండగా, ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం మంగళవారం స్పందిస్తూ, బెయిలును సమర్థవంతంగా వ్యతిరేకించలేదనే ఆరోపణలను తోసిపుచ్చింది. ఆశిష్ మిశ్రాకు బెయిలు మంజూరు చేయరాదని నిర్ద్వంద్వంగా చెప్పినట్లు తెలిపింది. ఆశిష్ మిశ్రాకు అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన బెయిలును సవాల్ చేసే విషయాన్ని సంబంధిత అధికారులు పరిశీలిస్తున్నారని తెలిపింది.
ఇవి కూడా చదవండి