నమ్మకం పోయింది..!

ABN , First Publish Date - 2021-11-14T14:26:34+05:30 IST

పీఆర్‌సీ అమలు చేయటానికి ప్రభుత్వానికి ఈ నెలాఖరు వరకు సమయం ఇస్తున్నామని ఏపీ జేఏసీ, ఏపీ జేఏసీ అమరావతి ఐక్య సంఘటన రాష్ట్ర ప్రభుత్వానికి డెడ్‌ లైన్‌ విధించింది. రాష్ట్ర ప్రభుత్వం పీఆర్‌సీ అమలు చేయకపోతే తమ ఉద్యమాన్ని ఆపతరం కాదని..

నమ్మకం పోయింది..!

పీఆర్‌సీపై సర్కారుకు డెడ్‌లైన్‌

నెలాఖరులోగా అమలు చేయాలి

ఉద్యోగుల సమస్యలు పట్టించుకోని ప్రభుత్వం  

సర్కారుపై ఉద్యోగులకు నమ్మకం పోయింది 

ఏపీ జేఏసీ, ఏపీ జేఏసీ అమరావతి నేతల ధ్వజం

తదుపరి కార్యాచరణపై 27లోపు ఇరు జేఏసీల భేటీ

రాష్ట్రంలో మరో ఉద్యోగుల సంఘం ఆవిర్భావం


విజయవాడ(ఆంధ్రజ్యోతి): పీఆర్‌సీ అమలు చేయటానికి ప్రభుత్వానికి ఈ నెలాఖరు వరకు సమయం ఇస్తున్నామని ఏపీ జేఏసీ, ఏపీ జేఏసీ అమరావతి ఐక్య సంఘటన రాష్ట్ర ప్రభుత్వానికి డెడ్‌ లైన్‌ విధించింది. రాష్ట్ర ప్రభుత్వం పీఆర్‌సీ అమలు చేయకపోతే తమ ఉద్యమాన్ని ఆపతరం కాదని హెచ్చరించింది. ఏపీ జేఏసీ చైర్మన్‌ బండి శ్రీనివాసరావు, ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్‌ బొప్పరాజు వెంకటేశ్వర్లు శనివారం విజయవాడలో మీడియాతో మాట్లాడారు. అక్టోబరు నెలాఖరులోగా పీఆర్‌సీ అమలు చేస్తామని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారని, అయినా ఇప్పటి వరకు అతీగతి లేకుండా పోయిందని బొప్పరాజు వెంకటేశ్వర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు.


పీఆర్‌సీ నివేదిక ఏడాదిలో ఇవ్వాల్సి ఉందని, నివేదిక రావటమే ఆలస్యమైతే.. వచ్చిన తర్వాత కూడా ఆరు నెలలు పెండింగ్‌లో పెట్టారని వాపోయారు. పీఆర్‌సీ నివేదికకు సంబంధించి అధికారుల కమిటీ ఏమైందని, ఏమి అధ్యయనం చేశారని ప్రశ్నించారు. ప్రభుత్వ తీరు కారణంగా ఉద్యోగులకు నమ్మకం కలగటం లేదన్నారు. ఈ ప్రభుత్వంలో గత మూడేళ్లుగా ఉద్యోగుల సమస్యలేమీ పరిష్కారం కావటం లేదని, ఇచ్చిన హామీలు కూడా అమలు కావటం లేదని, సీపీఎస్‌ రద్దుపై కమిటీలతో కాలయాపన జరుగుతోందని విమర్శించారు. కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ హామీ కూడా నెరవేరలేదన్నారు. కొవిడ్‌ వల్ల చనిపోయిన వారి కుటుంబాలకు ఉద్యోగాలు కల్పించే విషయంలో అధికారులు తప్పుగా మెమో ఇవ్వటం వల్ల ఇబ్బందులు తలెత్తుతున్నాయన్నారు. ఉద్యోగులకు ఇచ్చిన హెల్త్‌ కార్డు ద్వారా ఎలాంటి వైద్యమూ అందని పరిస్థితి ఏర్పడిందన్నారు.


బండి శ్రీనివాసరావు మాట్లాడుతూ పీఆర్‌సీ నివేదిక విషయంలో ప్రభుత్వం ఉద్యోగులను మోసం చేసిందన్నారు. జాయింట్‌ స్టాఫ్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఉద్యోగుల ఆర్థిక సమస్యలు వేటికీ పరిష్కారం రాలేదన్నారు. రెండు జేఏసీలలో 200 సంఘాలు ఉన్నాయని, ఉద్యోగుల సమస్యలపై ఈ నెల 27వ తేదీ లోపు రెండు జేఏసీలు సంయుక్తంగా సమావేశమై కీలక నిర్ణయాలు తీసుకుంటామన్నారు. సమావేశం తర్వాతే తమ నిర్ణయాలను సీఎ్‌సకు వినతిపత్రం రూపంలో అందిస్తామన్నారు. ఏపీ జేఏసీ కార్యదర్శి హృదయరాజు మాట్లాడుతూ కారుణ్య నియామకాలపై ప్రభుత్వం సీరియ స్‌గా దృష్టి సారించాలని, సమస్యలను వెంటనే పరిష్కరించాలన్నారు. ఏపీ జేఏసీ అమరావతి సెక్రటరీ జనరల్‌ వైవీ రావు మాట్లాడుతూ ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేసి రెండేళ్లైందని, వారికి ఉన్నవి పోయి.. కొత్తవి రాక దుర్భరంగా పరిస్థితి తయారైందన్నారు. 


రాష్ట్రంలో మరో ఉద్యోగుల సంఘం ఆవిర్భావం 

విజయవాడ(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో మరో ఉద్యోగ సంఘం ఆవిర్భవించింది. విజయవాడ వేదికగా ఏపీ గవర్నమెంట్‌ ఎంప్లాయీస్‌ సర్వీస్‌ అసోసియేషన్‌ (ఏపీ జీఈఎస్‌) ఏర్పాటైంది. సంఘ ఆవిర్భావ సమావేశానికి 13 జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో ఉద్యోగులు హాజరయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర కార్యవర్గం ఎంపికైంది. అధ్యక్షుడిగా వినుకొండ రాజారావు, ప్రధాన కార్యదర్శిగా కొండపల్లి శ్రీనివాసరావు ఏకగ్రీవంగా ఎంపికయ్యారు. అనంతరం అధ్యక్షుడు వినుకొండ రాజారావు మాట్లాడుతూ గత రెండున్నరేళ్లుగా ఉద్యోగుల సమస్యలను పరిష్కరించడంలో ప్రస్తుతం ఉన్న నాలుగు సంఘాలు చొరవ చూపలేదన్నారు. ఉద్యోగుల హక్కులను ఈ సంఘాల నాయకులు కాలరాస్తున్నారని మండిపడ్డారు. ఉద్యోగుల సమస్యలను పరిష్కరించకుండా, ఓడీల కోసం, తమ సొంత అజెండాల కోసం పాకులాడుతున్నారని విమర్శించారు. వారు ఉద్యోగుల ప్రతినిధులుగా కాకుండా రాజకీయ పార్టీల ప్రతినిధులుగా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రధాన కార్యదర్శి కొండపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ రాష్ట్రంలోని నాలుగు సంఘాలను ప్రశ్నించటానికే తాము కొత్తగా ఉద్యోగ సంఘాన్ని ఏర్పాటు చేశామని తెలిపారు. ఉద్యోగుల హక్కుల పరిరక్షణ కోసం తమ సంఘం కృషి చేస్తుందన్నారు. సీపీఎస్‌ రద్దు జగన్మోహనరెడ్డి మానసపుత్రిక అని, దీనిని వెంటనే అమలు చేయాలన్నారు. పీఆర్‌సీని తక్షణం ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. 

Updated Date - 2021-11-14T14:26:34+05:30 IST