Khammam: ప్రైవేటీకరిస్తే సింగరేణిలో సమ్మె

ABN , First Publish Date - 2021-11-08T18:09:54+05:30 IST

నాలుగు బొగ్గు బ్లాకులను ప్రైవేకరించాలని కేంద్రం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వ్యతి రేకంగా సింగరేణిలో సమ్మె నిర్వహిస్తామని టీబీజీకేఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ వెంకట్రావ్‌ అన్నారు.

Khammam: ప్రైవేటీకరిస్తే సింగరేణిలో సమ్మె

- వర్కింగ్‌ కమిటీ సమావేశంలో నిర్ణయం 

- టీబీజీకేఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ వెంకట్రావ్‌ 


 మణుగూరుటౌన్‌(భద్రాద్రి కొత్తగూడెం): నాలుగు బొగ్గు బ్లాకులను ప్రైవేకరించాలని కేంద్రం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వ్యతి రేకంగా సింగరేణిలో సమ్మె నిర్వహిస్తామని టీబీజీకేఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ వెంకట్రావ్‌ అన్నారు. ఆదివారం ఇల్లెందు అతిథిగృహంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం సింగరేణికి నష్టం కలిగించేలా బొగ్గు బ్లాక్‌ల ప్రైవేటీకరణకు టెండర్లను ఆహ్వానిస్తోందన్నారు. మొత్తం 88 బొగ్గు బ్లాకుల ప్రైవేటీకరణకు టెండర్లు ఆహ్వానిస్తుండగా వాటిలో నాలుగు బ్లాకులు భద్రాద్రి జిల్లాకు చెందిన కోయగూడెం ఓసీ, సత్తుపల్లి ఓసీ-3, మంచిర్యాలలోని శ్రావన్‌పల్లి ఓసీ, కేకే-6 భూగర్భ గనులున్నాయన్నారు. ఇప్పటికే సింగరేణి యాజమాన్యం ఈ గనుల్లోని బొగ్గు ఏ మేరకు ఉంది, ఏ గ్రేడ్‌కు చెందినది తెలుసుకునేందుకు రూ. కోట్లలో ఖర్చు చేసిందన్నారు. ప్రత్యేకంగా సత్తుపల్లి నుంచి కొత్తగూడెం వరకు రైల్వేట్రాక్‌ నిర్మాణానికి రూ. లక్షల్లో ఖర్చు చేస్తోందన్నారు. కేంద్రం నిర్ణయం వల్ల సంస్థకు ఎంతో నష్టం వాటిల్లుతోందని పేర్కొన్నారు. దీనిపై ఇప్పటికే గనుల్లో నల్లబ్యాడ్జీలు, ఏరియా జీఎం కార్యాలయాల ఎదుట ధర్నాలు నిర్వహించామన్నారు. సింగరేణి అన్ని ఏరియాల్లో తిరిగి కార్మికులను ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చేపట్టే సమ్మెకు సన్నద్ధం చేస్తామన్నారు. ఈలోపుగా వర్కింగ్‌ కమిటీ సమావేశం నిర్వహించి తీర్మానం చేసి యాజమాన్యానికి సమ్మె నోటీసు ఇస్తామన్నారు. జాతీయ సంఘాలు ఆర్‌ఎల్‌సీ వద్దకు వెళ్లి ప్రతీ సమావేశానికి, కార్యక్రమానికి అందరిని ఆహ్వానించాలని కోరడం హాస్యాస్పదంగా ఉందన్నారు. సింగరేణిలో ఎన్నికలకు టీబీజీకేఎస్‌ ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందన్నారు. కార్యక్రమంలో బ్రాంచ్‌ ఉపాధ్యక్షుడు ప్రభాకర్‌రావు, లెవెన్‌మెన్‌ కమిటీ సభ్యుడు శ్రీనివాసరెడ్డి, కేంద్ర కమిటీ సభ్యుడు అబుదల్‌ రవూఫ్‌, బ్రాంచ్‌ నాయకులు వీరభద్రయ్య, శ్రీనివాస్‌, శివాజీ, శ్రీనివాస్‌, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

Updated Date - 2021-11-08T18:09:54+05:30 IST