Sedition Law : కోర్టులను గౌరవిస్తాం, కానీ లక్ష్మణ రేఖ ఉంది : కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు

ABN , First Publish Date - 2022-05-11T22:01:28+05:30 IST

బ్రిటిష్ కాలంనాటి రాజద్రోహం చట్టాన్ని సుప్రీంకోర్టు

Sedition Law : కోర్టులను గౌరవిస్తాం, కానీ లక్ష్మణ రేఖ ఉంది : కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు

న్యూఢిల్లీ : బ్రిటిష్ కాలంనాటి రాజద్రోహం చట్టాన్ని సుప్రీంకోర్టు నిలిపేయడంపై కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరణ్ రిజిజు బుధవారం స్పందించారు. తాను న్యాయస్థానాలను, వాటి స్వాతంత్ర్యాన్ని గౌరవిస్తానని, అయితే అతిక్రమించకూడని లక్ష్మణ రేఖ ఒకటి ఉందని, దానిని కేంద్ర ప్రభుత్వంలోని మూడు విభాగాలు స్ఫూర్తిదాయకంగా గౌరవించాలని చెప్పారు. 


భారత శిక్షా స్మృతి (IPC)లోని సెక్షన్ 124ఏ అమలును సుప్రీంకోర్టు (Supreme Court) తాత్కాలికంగా నిలిపేస్తున్నట్లు బుధవారం ప్రకటించింది. ఈ నిబంధనను పునఃపరిశీలించాలని నిర్ణయించినట్లు కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది. ఈ కసరత్తు కోసం వేచి చూడాలని కోరింది. దేశ సార్వభౌమాధికారాన్ని పరిరక్షిస్తూనే, కాలం చెల్లిన వలస చట్టాలను తొలగించడానికి కట్టుబడి ఉన్నట్లు వివరించింది. 


భారత ప్రధాన న్యాయమూర్తి (CJI) జస్టిస్ ఎన్‌వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం స్పందిస్తూ, ఈ రాజద్రోహ చట్టాన్ని నిలుపుదల చేయడం సరైనదవుతుందని తెలిపింది. రాజద్రోహం నేరారోపణలపై ఇకపై రాష్ట్రాలు కొత్త కేసులను నమోదు చేయబోవని ఆశిస్తున్నట్లు తెలిపింది. ఈ నేరారోపణలపై ఇప్పటికే నమోదైన అన్ని కేసులు, అపీళ్ళపై విచారణను నిలిపేయాలని తెలిపింది. నిందితులకు మంజూరు చేసిన ఉపశమనం కొనసాగుతుందని వివరించింది. ఈ నేరారోపణలపై ప్రస్తుతం జైళ్ళలో ఉన్నవారు బెయిలు కోసం దరఖాస్తు చేసుకోవచ్చునని తెలిపింది. తదుపరి విచారణ జూలైలో జరుగుతుందని పేర్కొంది. 


ఈ నేపథ్యంలో కిరణ్ రిజిజు విలేకర్లతో మాట్లాడుతూ, దేశంలోని కార్యనిర్వాహక, శాసన, న్యాయ వ్యవస్థల మధ్య అధికారాల విభజన భారత రాజ్యాంగం ప్రకారం జరిగిందన్నారు. ఈ మూడు విభాగాల మధ్య సామరస్యంగా కార్యకలాపాలు జరగడం వల్ల ప్రజాస్వామ్యం బలపడుతుందన్నారు. మన కర్తవ్యాన్ని నిర్వహించేటపుడు లక్ష్మణ రేఖను మనం గుర్తు పెట్టుకోవాలని చెప్పారు. రాజద్రోహం చట్టంపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఉద్దేశాన్ని కూడా అత్యున్నత న్యాయస్థానానికి తెలిపామన్నారు. 


Read more