కరోనాతో కేంద్ర న్యాయశాఖ కార్యదర్శి నారాయణరాజు మృతి

ABN , First Publish Date - 2021-05-06T07:59:21+05:30 IST

ఢిల్లీలో ఉగ్రరూపం దాల్చిన కరోనా మహమ్మారికి మరో తెలుగు ఉన్నతాధికారి బలయ్యారు.

కరోనాతో కేంద్ర న్యాయశాఖ కార్యదర్శి నారాయణరాజు మృతి

పలువురు ప్రముఖుల సంతాపం

న్యూఢిల్లీ/హైదరాబాద్‌, మే 5 (ఆంధ్రజ్యోతి): ఢిల్లీలో ఉగ్రరూపం దాల్చిన కరోనా మహమ్మారికి మరో తెలుగు ఉన్నతాధికారి బలయ్యారు. కేంద్ర న్యాయశాఖ కార్యదర్శిగా పనిచేస్తున్న డాక్టర్‌ గవరాజు నారాయణ అలియాస్‌ జి. నారాయణరాజు(62) మంగళవారం రాత్రి మరణించారు. కొద్దిరోజుల క్రితం కరోనా బారిన పడిన ఆయన ఢిల్లీలోని డీఆర్‌డీవో ఫెసిలిటీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఏపీలోని నెల్లూరు జిల్లా పిగిలం గ్రామానికి చెందిన నారాయణరాజు బీకాం, ఎల్‌ఎల్‌బీ, ఎల్‌ఎల్‌ఎం, పీహెచ్‌డీ ఇన్‌ లా చదువుకున్నారు. 2001లో కేంద్ర లా వ్యవహారాలశాఖలో  చేరారు. 2014లో లా కమిషన్‌ మెంబర్‌ సెక్రటరీగా, అదనపు కార్యదర్శిగా పనిచేశారు. 2015 అక్టోబరు 16 నుంచి కేంద్ర న్యాయశాఖ కార్యదర్శిగా పనిచేస్తున్నారు. 2019 జూన్‌ 30న ఆయన పదవీ విరమణ చేశారు. అయినప్పటికీ ఆయన సేవలను గుర్తించి కేంద్రం.. ఆయనను 2019 జూలై 1 నుంచి న్యాయశాఖ కార్యదర్శిగా పునర్నియమించింది. ఆయన పదవీ కాలం 2022 మార్చి 31వరకు ఉంది. ఆయనకు భార్య సాయికుమారి, కుమార్తెలు రాజేశ్వరి, ఉషా, కుమారుడు అశోక్‌ కుమార్‌ ఉన్నారు. కేంద్రం ప్రవేశపెట్టిన అనేక కీలకమైన చట్టాల సవరణ, రూపకల్పనలో నారాయణరాజు కీలకపాత్ర పోషించినట్లు అధికారవర్గాలు తెలిపాయి. నారాయణరాజు మృతి బాధాకరమని, ఆయన మరణం రెండు తెలుగు రాష్ట్రాలకు తీరనిలోటని తెలంగాణ రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బి. వినోద్‌కుమార్‌ అన్నారు. రాష్ట్ర విభజన చట్టంలోని హామీల అమలు కోసం ఆయన పరితపించారని కొనియాడారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. 

Updated Date - 2021-05-06T07:59:21+05:30 IST