Mukesh Ambani : ముకేశ్ అంబానీ భద్రత పెంపు... ఖర్చు గురించి తెలిస్తే...

ABN , First Publish Date - 2022-09-29T23:59:23+05:30 IST

పారిశ్రామిక దిగ్గజం ముకేశ్ అంబానీ భద్రతకు ముప్పు పొంచి

Mukesh Ambani : ముకేశ్ అంబానీ భద్రత పెంపు... ఖర్చు గురించి తెలిస్తే...

న్యూఢిల్లీ : పారిశ్రామిక దిగ్గజం ముకేశ్ అంబానీ భద్రతకు ముప్పు పొంచి ఉందని నిఘా వర్గాలు హెచ్చరించడంతో కేంద్ర హోం మంత్రిత్వ శాఖ స్పందించింది. ఆయనకు భద్రతను ‘జెడ్ ప్లస్’ కేటగిరీకి పెంచింది. గత ఏడాది ఆయన నివాసం వద్ద బాంబు ఉన్నట్లు కలకలం రేగిన నేపథ్యంలో పారిశ్రామికవేత్తలకు కట్టుదిట్టమైన భద్రత కల్పించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. 


విశ్వసనీయ వర్గాల కథనం ప్రకారం, రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ముకేశ్ అంబానీకి భద్రతను ‘జెడ్’ కేటగిరీ నుంచి ‘జెడ్ ప్లస్’ కేటగిరీకి పెంచుతూ కేంద్ర హోం మంత్రిత్వ శాఖ నిర్ణయం తీసుకుంది. ఇంటెలిజెన్స్ బ్యూరో (Intelligence Bureau)  హెచ్చరికల నేపథ్యంలో ఈ చర్య తీసుకుంది. గత ఏడాది ఆయన నివాసం ఆంటిలా వద్ద ఓ కారులో పేలుడు పదార్థాలు కనిపించిన సంగతి తెలిసిందే. ఆ కారులోని 20 జిలెటిన్ స్టిక్స్‌ను ముంబై పోలీసులు స్వాధీనం చేసుకుని, దర్యాప్తు చేశారు. ఆ తర్వాత ఈ కేసు దర్యాప్తును జాతీయ దర్యాప్తు సంస్థ (NIA)కు అప్పగించారు. అప్పటి అసిస్టెంట్ పోలీస్ ఇన్‌స్పెక్టర్ సచిన్ వాజేను ఎన్ఐఏ అరెస్టు చేసింది. ఈ కేసును దర్యాప్తు చేసి, అందరి గుర్తింపును పొందాలనే ఆలోచనతో వాజే ఈ ప్రణాళికను రచించి, అమలు చేశారని ఎన్ఐఏ ఆరోపించింది. 


ఖర్చు ఎంత?

ముకేశ్ అంబానీకి జెడ్ ప్లస్ కేటగిరీ భద్రత కోసం నెలకు రూ.20 లక్షలకు పైగానే ఖర్చవుతుంది. ఈ మొత్తం ఖర్చును ఆయనే భరిస్తారని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఆయనకు జెడ్ కేటగిరీ భద్రత కోసం అయిన ఖర్చును కూడా ఆయనే భరించిన సంగతి తెలిసిందే. 


అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీకి కూడా గత నెల నుంచి జెడ్ కేటగిరీ భద్రతను ప్రభుత్వం కల్పించింది. దీని కోసం అయ్యే ఖర్చును ఆయనే చెల్లించవలసి ఉంటుంది. గతంలో బాబా రామ్‌దేవ్‌కు కూడా ఇదే తరహాలో భద్రత కల్పించారు. జెడ్ కేటగిరీ భద్రత కోసం నెలకు రూ.15 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు ఖర్చవుతుంది. 


జెడ్ ప్లస్ కేటగిరీ భద్రత అనేది రెండో అత్యున్నత స్థాయి భద్రత. ఈ భద్రతగల వ్యక్తికి 55 మంది సిబ్బంది రక్షణ కల్పిస్తారు. వీరిలో సుమారు 10 మంది ఎన్ఎస్‌జీ కమాండోలు, పోలీసు అధికారులు ఉంటారు. ప్రతి కమాండో మార్షల్ ఆర్ట్స్‌లో, ఆయుధాలు లేకుండా పోరాడటంలో శిక్షణ పొందుతారు. 


ప్రజాదరణ, కార్యకలాపాల కారణంగా ఓ వ్యక్తి ప్రాణాలు ప్రమాదంలో పడినట్లు, భద్రతకు ముప్పు పొంచి ఉన్నట్లు నిఘా వర్గాలు నివేదిక ఇచ్చినపుడు కేంద్ర ప్రభుత్వం ఆ వ్యక్తికి భద్రత కల్పిస్తుంది. ప్రైవేటు వ్యక్తులకు కల్పించే భద్రతకు అయ్యే ఖర్చును వారే చెల్లించవలసి ఉంటుంది. భద్రత కల్పించే  విధానాలు ముఖ్యంగా X, Y, Z, Z+, SPG అనే ఐదు రకాలుగా ఉంటుంది. వీఐపీలు, వీవీఐపీలు, క్రీడాకారులు, నటీనటులు, రాజకీయ నేతలు వంటివారికి ఈ విధంగా భద్రత కల్పిస్తారు. 


Updated Date - 2022-09-29T23:59:23+05:30 IST