ఆలిండియా జ్యుడిషియల్ సర్వీస్‌ కోసం మరోసారి యత్నం!

ABN , First Publish Date - 2021-11-01T01:38:18+05:30 IST

ఆలిండియా జ్యుడిషియల్ సర్వీస్ ఏర్పాటుకు

ఆలిండియా జ్యుడిషియల్ సర్వీస్‌ కోసం మరోసారి యత్నం!

న్యూఢిల్లీ : ఆలిండియా జ్యుడిషియల్ సర్వీస్ ఏర్పాటుకు రాష్ట్రాల సమ్మతి సాధించేందుకు కేంద్ర ప్రభుత్వం మరోసారి ప్రయత్నించే అవకాశం ఉంది. ఈ అంశాన్ని నవంబరులో జరిగే కేంద్ర, రాష్ట్రాల న్యాయ శాఖ మంత్రుల సమావేశం ఎజెండాలో చేర్చబోతున్నట్లు విశ్వసనీయ సమాచారం. న్యాయస్థానాల్లో మౌలిక సదుపాయాల గురించి ఈ సమావేశంలో చర్చించబోతున్నట్లు తెలిసింది. 


ప్రభుత్వ వర్గాలను ఉటంకిస్తూ జాతీయ మీడియా ఆదివారం వెల్లడించిన వివరాల ప్రకారం, కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరణ్ రిజిజు, రాష్ట్రాల న్యాయ శాఖ మంత్రుల సమావేశం నవంబరులో జరుగుతుంది. ఈ సమావేశం ఎజెండాలో ఆలిండియా జ్యుడిషియల్ సర్వీస్ ఏర్పాటు అంశాన్ని చేర్చారు. దేశవ్యాప్తంగా న్యాయం సకాలంలో, సరైన రీతిలో అందుబాటులోకి తేవడానికి ఇది ఉపయోగపడుతుంది. అఖిల భారత స్థాయిలో ప్రతిభావంతులను న్యాయ వ్యవస్థకు ఎంపిక చేయడానికి వీలవుతుంది. అణగారిన వర్గాలు, హక్కులను పొందలేకపోతున్న వర్గాలకు తగిన ప్రాతినిధ్యం కల్పించవచ్చు. 


ప్రవేశ పరీక్ష ద్వారా సబార్డినేట్ కోర్టులకు అధికారులను నియమించడం కోసం ఆలిండియా జ్యుడిషియల్ సర్వీస్‌ను ఏర్పాటు చేయడానికి పార్లమెంటులో బిల్లును ప్రవేశపెట్టవలసి ఉంటుందని నిపుణులు చెప్తున్నారు. 


ప్రస్తుతం అమల్లో ఉన్న విధానం ప్రకారం, జ్యుడిషియల్ ఆఫీసర్స్ నియామకానికి వివిధ హైకోర్టులు, రాష్ట్ర సర్వీస్ కమిషన్లు పరీక్షలను నిర్వహిస్తున్నాయి. 


Updated Date - 2021-11-01T01:38:18+05:30 IST