ఆక్సిజన్ కొరత వల్ల సంభవించిన మరణాల సమాచారం ఇవ్వండి : రాష్ట్రాలకు కేంద్రం లేఖ

ABN , First Publish Date - 2021-07-28T00:32:39+05:30 IST

కోవిడ్-19 మహమ్మారి రెండో ప్రభంజనంలో ఆక్సిజన్ కొరత వల్ల

ఆక్సిజన్ కొరత వల్ల సంభవించిన మరణాల సమాచారం ఇవ్వండి : రాష్ట్రాలకు కేంద్రం లేఖ

న్యూఢిల్లీ : కోవిడ్-19 మహమ్మారి రెండో ప్రభంజనంలో ఆక్సిజన్ కొరత వల్ల సంభవించిన మరణాలకు సంబంధించిన సమాచారాన్ని తెలియజేయాలని రాష్ట్ర, కేంద్ర పాలిత ప్రాంతాల ప్రభుత్వాలను కేంద్ర ప్రభుత్వం కోరింది. ఆగస్టు 13లోగా ఈ సమాచారాన్ని సమర్పించాలని కోరింది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికారి ఒకరు జాతీయ మీడియాకు ఈ వివరాలను తెలిపారు. 


కోవిడ్-19 మహమ్మారి రెండో ప్రభంజనంలో ఆక్సిజన్ కొరత వల్ల సంభవించిన మరణాల వివరాలను తెలియజేయాలని కోరుతూ రాష్ట్ర, కేంద్ర పాలిత ప్రాంతాల ప్రభుత్వాలకు ఓ లేఖ రాసినట్లు ఆ అధికారి తెలిపారు. ఈ మరణాలపై అనేక ప్రశ్నలు వస్తుండటంతో ఈ లేఖ రాసినట్లు తెలిపారు. పార్లమెంటు సమావేశాలు ముగిసేలోగా ఈ సమాచారాన్ని అందజేయాలని కోరినట్లు చెప్పారు. 


రాజ్యసభ సభ్యుడు, కాంగ్రెస్ నేత కేసీ వేణుగోపాల్ అడిగిన ప్రశ్నకు ప్రభుత్వం గత వారం స్పందిస్తూ, కోవిడ్-19 మహమ్మారి రెండో ప్రభంజనంలో ఆక్సిజన్ కొరత వల్ల మరణాలు సంభవించినట్లు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ప్రభుత్వాలు తెలియజేయలేదని పేర్కొంది. ఆరోగ్య శాఖ సహాయ మంత్రి భారతి ప్రవీణ్ పవార్ రాజ్యసభకు ఇచ్చిన రాతపూర్వక సమాధానంలో ఆరోగ్య రంగం రాష్ట్రాల పరిధిలోని అంశమని తెలిపారు. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ప్రభుత్వాలు కోవిడ్ కేసుల సంఖ్య, మరణాలకు సంబంధించిన వివరాలను కేంద్ర ప్రభుత్వానికి తెలియజేస్తూ ఉంటాయన్నారు. ఆక్సిజన్ కొరత కారణంగా సంభవించిన మరణాలను నిర్దిష్టంగా కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ప్రభుత్వాలు తెలియజేయలేదని చెప్పారు. 


ఢిల్లీ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సత్యేంద్ర జైన్ దీనిపై స్పందిస్తూ, ఢిల్లీలోనూ, అనేక ఇతర ప్రాంతాల్లోనూ ఆక్సిజన్ కొరత కారణంగా చాలా మంది మరణించారన్నారు. ఆక్సిజన్ కొరత లేకపోతే ఆసుపత్రుల యాజమాన్యాలు కోర్టులను ఎందుకు ఆశ్రయించాయని ప్రశ్నించారు. 


Updated Date - 2021-07-28T00:32:39+05:30 IST