తయారీ రంగం సత్తా పెంచేందుకు కేంద్రం ప్రోత్సాహకాలు

ABN , First Publish Date - 2021-09-15T22:36:20+05:30 IST

భారత దేశంలో ఆటోమొబైల్, డ్రోన్ తయారీ రంగం సామర్థ్యం

తయారీ రంగం సత్తా పెంచేందుకు కేంద్రం ప్రోత్సాహకాలు

న్యూఢిల్లీ : భారత దేశంలో ఆటోమొబైల్, డ్రోన్ తయారీ రంగం సామర్థ్యం మరింత పెరిగేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రోత్సాహకాలు ప్రకటించింది. ఆటోమొబైల్, డ్రోన్ పరిశ్రమల కోసం ఉత్పత్తి అనుబంధ ప్రోత్సాహక (పీఎల్ఐ) పథకాన్ని ఆమోదించింది. పీఎల్ఐ ఆటో స్కీమ్ వల్ల మన దేశంలో అడ్వాన్స్‌డ్ ఆటోమోటివ్ టెక్నాలజీస్ గ్లోబల్ సప్లయ్ చైన్‌కు మార్గం సుగమం అవుతుంది. అంతేకాకుండా దాదాపు 7.6 లక్షల మందికి అదనంగా ఉపాధి లభిస్తుంది. ఈ పథకంలో భాగంగా రూ.26,058 కోట్ల విలువైన ప్రోత్సాహకాలను ఐదేళ్ళలో ఈ పరిశ్రమలకు అందజేస్తారు. ఐదేళ్ళలో రూ.42,500 కోట్లు కొత్త పెట్టుబడులు వస్తాయని అంచనా. రూ.2.3 లక్షల కోట్లకుపైగా విలువైన ఉత్పత్తులు పెరుగుతాయని భావిస్తున్నారు. 


డ్రోన్ల కోసం ప్రకటించిన పీఎల్ఐ స్కీమ్ వల్ల మూడేళ్ళలో కొత్తగా రూ.5,000 కోట్లకుపైగా పెట్టుబడులు వచ్చే అవకాశం ఉంది. రూ.1,500 కోట్ల విలువైన ఉత్పత్తులు పెరుగుతాయని అంచనా. 


ఎలక్ట్రిక్ వాహనాల తయారీకి గొప్ప ఊపునిచ్చే విధంగా ఆటోమోటివ్ రంగానికి పీఎల్ఐ స్కీమ్‌ను ప్రభుత్వం ప్రకటించింది. అడ్వాన్స్‌డ్ కెమిస్ట్రీ సెల్ (రూ.18,100 కోట్లు), ఫాస్టర్ అడాప్షన్ ఆఫ్ మాన్యుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఎలక్ట్రిక్ వెహికిల్స్ స్కీమ్ (రూ.10,000 కోట్లు) కలిపి ఈ పీఎల్ఐ స్కీమ్‌ను ప్రకటించింది. పర్యావరణపరంగా హితకరమైన, ఎలక్ట్రానిక్ వాహనాలు, హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ వాహనాలు పెద్ద ఎత్తున వస్తాయి. 


స్వయం సమృద్ధ భారత దేశం దిశగా అడుగులు వేస్తూ ఈ పథకానికి ఆమోదం తెలిపినట్లు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం బుధవారం ప్రకటించింది. ఆటో రంగానికి పీఎల్ఐ స్కీమ్ వల్ల అత్యధిక విలువగల అభివృద్ధి చెందిన ఆటోమోటివ్ టెక్నాలజీ వాహనాలు, ఉత్పత్తులు వస్తాయని తెలిపింది. హయ్యర్ టెక్నాలజీ, మరింత సమర్థత, హరిత ఆటోమోటివ్ మాన్యుఫ్యాక్చరింగ్‌లో నవ శకానికి నాంది పలుకుతుందని తెలిపింది. 


2021-22 కేంద్ర బడ్జెట్‌ ప్రసంగంలో 13 రంగాలకు పీఎల్ఐ స్కీములను ప్రకటించారు. వీటిలో భాగంగానే ప్రస్తుతం ఆటోమోబైల్ ఇండస్ట్రీ, డ్రోన్ ఇండస్ట్రీలకు స్కీములను ప్రకటించారు. ఈ 13 రంగాలకు పీఎల్ఐ స్కీముల వల్ల ఐదేళ్ళలో రూ.37.5 లక్షల కోట్ల విలువైన ఉత్పత్తులు అదనంగా పెరుగుతాయని అంచనా. ఐదేళ్ళలో దాదాపు ఓ కోటి మందికి అదనంగా ఉపాధి లభించగలదని అంచనా.


Updated Date - 2021-09-15T22:36:20+05:30 IST