తెలంగాణా విద్యావంతుడికి యూజీసీ చైర్మన్ పదవి

ABN , First Publish Date - 2022-02-04T21:21:20+05:30 IST

యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (UGC) చైర్మన్‌గా తెలంగాణా

తెలంగాణా విద్యావంతుడికి యూజీసీ చైర్మన్ పదవి

న్యూఢిల్లీ : యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (UGC) చైర్మన్‌గా తెలంగాణా విద్యావంతుడు ఎం జగదీశ్ కుమార్ శుక్రవారం నియమితులయ్యారు. ఈ పదవిలో ఆయన ఐదేళ్ళ వరకు లేదా ఆయన వయసు 65 ఏళ్ళు నిండే వరకు లేదా తదుపరి ఉత్తర్వులు జారీ అయ్యే వరకు, వీటిలో ఏది ముందైతే అంత వరకు కొనసాగవచ్చు. ఈ వివరాలను కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ జారీ చేసిన నోటిఫికేషన్‌లో తెలిపారు. ఆయన ప్రస్తుతం జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం (JNU) ఉప కులపతిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. 


యూజీసీ చైర్మన్ పదవి కోసం పుణే విశ్వవిద్యాలయం ఉప కులపతి నితిన్ ఆర్ కర్మల్కర్, యూజీసీకి చెందిన ఇంటర్ యూనివర్సిటీ యాక్సిలరేటర్ సెంటర్ డైరెక్టర్ అవినాశ్ చంద్ర పాండేలను కూడా పరిశీలించారు. 


జాతీయ విద్యా విధానం, 2020 అమలుతో ఉన్నత విద్యా రంగంలో మార్పులు జరుగుతున్న సమయంలో యూజీసీ చైర్మన్‌గా జగదీశ్ కుమార్ నియమితులయ్యారు.  ఆయన ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) మద్రాస్‌లో చదివారు. ఐఐటీ ఢిల్లీలో ప్రొఫెసర్‌గా చేశారు. 2016లో జేఎన్‌యూ ఉప కులపతిగా నియమితులయ్యారు. ఐదేళ్ళ పదవీ కాలం పూర్తయిన తర్వాత 2021 జనవరిలో ఆయన పదవీ కాలాన్ని ప్రభుత్వం పొడిగించింది. 


నల్గొండ జిల్లాలో జననం...

జగదీశ్ కుమార్ తెలంగాణాలోని నల్గొండ జిల్లా మామిడాలలో జన్మించారు. ఐఐటీ-మద్రాస్‌లో ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్‌లో మాస్టర్స్, పీహెచ్‌డీ చేశారు. అనంతరం కెనడాలోని వాటర్లూ విశ్వవిద్యాలయంలో పోస్ట్ డాక్టొరల్ రీసెర్చ్ చేశారు. ఆయన నానోసైన్స్, నానో టెక్నాలజీలలో కృషి చేశారు. 


Updated Date - 2022-02-04T21:21:20+05:30 IST