సిలికాన్ ఆంధ్ర యూనివర్సిటీలో ప్రవాస భారతీయులతో రాజ్‌నాథ్ సింగ్ భేటీ

ABN , First Publish Date - 2022-04-16T14:50:55+05:30 IST

అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్కో బే ఏరియాలోని సిలికాన్ ఆంధ్ర యూనివర్సిటీలో గురువారం భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సందర్శించారు.

సిలికాన్ ఆంధ్ర యూనివర్సిటీలో ప్రవాస భారతీయులతో రాజ్‌నాథ్ సింగ్ భేటీ

శాన్‌ఫ్రాన్సిస్కో: అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్కో బే ఏరియాలోని సిలికాన్ ఆంధ్ర యూనివర్సిటీలో గురువారం భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సందర్శించారు. ఈ సందర్భంగా అక్కడి ప్రవాస భారతీయులను ఉద్దేశించి మాట్లాడారు. సుదీర్ఘ కాలంగా ఆ ప్రాంతంలో నివసిస్తున్న తెలుగువారు, ఇతర భారతీయులు, భారతీయ మూలాలున్న పారిశ్రామికవేత్తలు, వ్యాపారులు, ఇండియన్ కమ్యూనిటీకి చెందిన ఇతర ప్రముఖులతో రాజ్‌నాథ్ సింగ్ సంభాషించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న భార‌త్‌లో ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ చేప‌డుతున్న ప‌లు కార్య‌క్ర‌మాల‌ను వారికి వివ‌రించారు. అలాగే ఎన్నారైల విష‌యంలో భార‌త ప్ర‌భుత్వం తీసుకుంటున్న నిర్ణ‌యాలు, అమెరికా వీసా విష‌యంలో ఇటీవ‌ల త‌లెత్తిన ప‌రిణామాలు తదితర విషయాలను ఆయ‌న చ‌ర్చించారు. 


దీంతో పాటు అమెరికాలో ఉన్న భార‌తీయుల క్షేమం కోసం క‌రోనా స‌మ‌యంలో ఉచితంగా టీకాలు పంపిణీ చేసిన విష‌యాన్ని మంత్రి ఈ సందర్భంగా ప్ర‌స్తావించారు. రాజ్‌నాథ్ పాల్గొన్న ఈ కార్య‌క్ర‌మం భార‌త దౌత్య‌కార్యాల‌యం కాన్సుల్ జ‌న‌ర‌ల్ డాక్ట‌ర్ టీవీ నాగేంద్ర ప్ర‌సాద్ నేతృత్వంలో యూనివ‌ర్సిటీ ఆఫ్ సిలికాన్ ఆంధ్రలో నిర్వ‌హించ‌గా, భార‌త దౌత్య‌కార్యాల‌యం నుంచి డాక్ట‌ర్ అకున్ స‌భ‌ర్వాల్, రాజేష్ నాయక్ సమన్వయపరిచారు. సిలికాన్ ఆంధ్ర చైర్మ‌న్ ఆనంద్ కూచిభొట్ల‌, దిలీప్ కొండప‌ర్తి, రాజు చేమ‌ర్తి, దీనబాబు కొండుభట్ల, అరిజోనా నుంచి ఇండియన్ కమ్యూనిటీ ప్ర‌ముఖులు వెంక‌ట్ కొమ్మినేనితో స‌హా ప‌లువురు స్థానిక నేత‌లు పాల్గొన్నారు. 


రాజ్ నాథ్ సింగ్‌తో పాటు రక్షణ మంత్రిత్వ శాఖకు సంబంధించిన సీనియర్ అధికారులు ఎయిర్ మార్షల్ శివకృష్ణ, డిఫెన్స్ ప్రొడక్షన్ అడిషనల్ సెక్రటరీ సంజయ్ జాజు, పంకజ్ అగర్వాల్, అనూప్ సింఘాల్, హర్షవర్ధన్, రక్షణ మంత్రి ప్రైవేట్ సెక్రటరీ అలోక్ తివారీ తదితరులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో ప్రవాసాంధ్రులు పాల్గొన్నారు.







Updated Date - 2022-04-16T14:50:55+05:30 IST