మహిళల వివాహ అర్హత వయసును పెంచుతూ కేంద్ర కేబినెట్ నిర్ణయం!

ABN , First Publish Date - 2021-12-16T20:41:33+05:30 IST

మహిళల వివాహ అర్హత వయసును 18 సంవత్సరాల నుంచి

మహిళల వివాహ అర్హత వయసును పెంచుతూ కేంద్ర కేబినెట్ నిర్ణయం!

న్యూఢిల్లీ : మహిళల వివాహ అర్హత వయసును 18 సంవత్సరాల నుంచి 21 ఏళ్ళకు పెంచాలని కేంద్ర కేబినెట్ బుధవారం నిర్ణయించింది. ఈ మేరకు బాల్య వివాహాల నిషేధ చట్టం, 2006ను ప్రభుత్వం సవరిస్తుంది. అదేవిధంగా ప్రత్యేక వివాహ చట్టం, హిందూ వివాహ చట్టం, 1955 వంటి వ్యక్తిగత చట్టాలకు కూడా సవరణలు చేస్తుంది. విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ జాతీయ మీడియా ఈ వివరాలను వెల్లడించింది. 


బిడ్డలను కనేందుకు సముచితమైన వయసు, ప్రసూతి మరణాల రేటును తగ్గించడం, పోషకాహార స్థాయుల మెరుగుదల, సంబంధిత ఇతర అంశాలపై అధ్యయనం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం జయ జైట్లీ నేతృత్వంలో ఓ టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేసింది. ఈ టాస్క్‌ఫోర్స్ 2020 డిసెంబరులో నీతీ ఆయోగ్‌కు సమర్పించిన సిఫారసుల ఆధారంగా మహిళల వివాహ వయసును 18 సంవత్సరాల నుంచి 21 ఏళ్ళకు పెంచేందుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. 


జయా జైట్లీ సమతా పార్టీ మాజీ అధ్యక్షురాలు. ఆమె మీడియాతో మాట్లాడుతూ, విస్తృత సంప్రదింపుల తర్వాత ఈ సిఫారసులను చేశామని చెప్పారు. నిపుణులు, యువత, మరీ ముఖ్యంగా యువతులను సంప్రదించి ఈ నివేదికను సమర్పించామన్నారు. జనాభా నియంత్రణ కోసం తాము ఈ సిఫారసులు చేయడం లేదనే విషయాన్ని స్పష్టంగా చెప్తున్నామన్నారు. సంతానోత్పత్తి రేటు తగ్గుతోందని, జనాభా నియంత్రణలోనే ఉందని ఇటీవలి జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే నివేదిక  వెల్లడించిందని గుర్తు చేశారు. మహిళలను సాధికారులను చేయడమే తమ సిఫారసుల ఉద్దేశమని తెలిపారు. 


2020 ఆగస్టులో స్వాతంత్ర్య దినోత్సవాల సందర్భంగా ఎర్ర కోట నుంచి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ, మహిళల వివాహ అర్హత వయసును పెంచుతామని చెప్పిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం పురుషుల వివాహ అర్హత వయసు 21 సంవత్సరాలు. 


Updated Date - 2021-12-16T20:41:33+05:30 IST