డీబీఎస్ బ్యాంకు, లక్ష్మీ విలాస్ బ్యాంకు విలీనానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం

ABN , First Publish Date - 2020-11-25T22:21:46+05:30 IST

సింగపూర్‌కు చెందిన డీబీఎస్ బ్యాంక్‌‌కు భారత దేశంలోని హోల్లీ ఓన్డ్ సబ్సిడరీ బ్యాంకులో

డీబీఎస్ బ్యాంకు, లక్ష్మీ విలాస్ బ్యాంకు విలీనానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం

న్యూఢిల్లీ : సింగపూర్‌కు చెందిన డీబీఎస్ బ్యాంక్‌‌కు భారత దేశంలోని హోల్లీ ఓన్డ్ సబ్సిడరీ బ్యాంకులో లక్ష్మీ విలాస్ బ్యాంక్ (ఎల్‌వీబీ) విలీనానికి కేంద్ర మంత్రివర్గం  ఆమోదం తెలిపింది. దీంతో డిపాజిటర్లు నగదు తీసుకోవడంపై తదుపరి ఆంక్షలు ఉండవు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ మీడియాకు వివరించారు. 


లక్ష్మీ విలాస్ బ్యాంకు, డీబీఎస్ బ్యాంక్ ఇండియా లిమిటెడ్ (డీబీఐఎల్) విలీనానికి నవంబరు 17న భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ) ముసాయిదా పథకాన్ని ప్రకటించింది. ఒక నెల మారటోరియం విధించడంతోపాటు, డిపాజిటర్లు రూ.25,000 వరకు మాత్రమే నగదును ఉపసంహరించుకోవచ్చునని ఆంక్షలు విధించిన తర్వాత ఈ నిర్ణయం వెలువడింది. ఈ ప్రైవేట్ రంగ బ్యాంకు ఆర్థిక పరిస్థితి క్షీణించడంతో ఆర్బీఐ సలహా మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు. బ్యాంకులను కుప్పకూలే దశకు తీసుకెళ్ళిన మేనేజ్‌మెంట్ సభ్యులపై చర్యలు తీసుకోవాలని ఆర్బీఐని ప్రభుత్వం కోరిందని జవదేకర్ చెప్పారు.


డీబీఎస్ 1994 నుంచి భారత దేశంలో కార్యకలాపాలు సాగిస్తోంది. 2019 మార్చిలో దీనిని విస్తరించి డీబీఐఎల్‌ను హోల్లీ ఓన్డ్ సబ్సిడరీగా మార్చింది. ప్రస్తుతం 13 రాష్ట్రాల్లోని 24 నగరాల్లో బ్యాంకింగ్ కార్యకలాపాలను నిర్వహిస్తోంది.  లక్ష్మీ విలాస్ బ్యాంకుకు భారత దేశంలో 94 సంవత్సరాల చరిత్ర ఉంది. 


Updated Date - 2020-11-25T22:21:46+05:30 IST