Prophet Row : గుడి ప్రాంగణంలో పూజారి కుటుంబం నిద్రిస్తుండగా బాంబు దాడి

ABN , First Publish Date - 2022-06-11T21:56:58+05:30 IST

భారతీయ జనతా పార్టీ మాజీ అధికార ప్రతినిధి ఇటీవల ప్రవక్త మహమ్మద్‌పై

Prophet Row : గుడి ప్రాంగణంలో పూజారి కుటుంబం నిద్రిస్తుండగా బాంబు దాడి

రాంచీ : భారతీయ జనతా పార్టీ మాజీ అధికార ప్రతినిధి ఇటీవల ప్రవక్త మహమ్మద్‌పై చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో జార్ఖండ్‌లోని రాంచీలో శుక్రవారం పెద్ద ఎత్తున హింసాకాండ చెలరేగింది. కొందరు దుండగులు అర్ధరాత్రి దాటిన తర్వాత ఓ గుడి ప్రాంగణంలోకి పెట్రోలు బాంబులు విసిరారు. ఆ సమయంలో ఆ గుడి పూజారి కుటుంబ సభ్యులు అక్కడే నిద్రిస్తున్నారు. 


జార్ఖండ్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, రాంచీలోని సూర్య దేవాలయం ప్రాంగణంలో పూజారి కుటుంబం నివసిస్తోంది. శుక్రవారం అర్ధరాత్రి కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ఈ గుడి ప్రాంగణంలోకి నాలుగు పెట్రోలు బాంబులు విసిరారు. ఆ సమయంలో నిద్రిస్తున్న పూజారి కుటుంబ సభ్యులు తీవ్ర భయాందోళనతో మేలుకొని, పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకునేలోగా దుండగులు అక్కడి నుంచి పారిపోయారు. పెట్రోలు బాంబులు పడటంతో పూజారి, ఆయన కుటుంబ సభ్యులు తీవ్ర భయాందోళనకు గురై, వణికిపోయారు. అప్పటి నుంచి మేలుకునే ఉన్నారు. 


బీజేపీ మాజీ అధికార ప్రతినిధి నూపుర్ శర్మ ఓ టీవీ చర్చా కార్యక్రమంలో మహమ్మద్ ప్రవక్తపై చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారం సృష్టించాయి. అంతర్జాతీయంగా కూడా ఆమెపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. భారత ప్రభుత్వానికి అనేక ముస్లిం దేశాలు తమ అభ్యంతరాన్ని తెలిపాయి. 


ఈ నేపథ్యంలో శుక్రవారం దేశవ్యాప్తంగా నిరసనలు పెల్లుబికాయి. మసీదుల్లో ప్రార్థనల అనంతరం ముస్లింలు వీథుల్లోకి పెద్ద ఎత్తున చేరి, నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. కొన్ని చోట్ల ఈ నిరసనలు హింసాత్మకంగా మారాయి. పోలీసులపై కూడా దాడులకు పాల్పడ్డారు. పోలీసు వాహనాలను ధ్వంసం చేశారు. నిరసనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు గాలిలోకి కాల్పులు జరిపారు. 


Updated Date - 2022-06-11T21:56:58+05:30 IST