నిధులు లేని సమీక్ష

ABN , First Publish Date - 2022-05-09T05:30:00+05:30 IST

జిల్లాలో నీటిపారుదల వ్యవస్థలను సమస్యలు చుట్టు ముట్టాయి. జిల్లాలోని ముఖ్యమైన శ్రీశైలం భద్రతకు ప్లంజ్‌పూల్‌ సమస్యగా మారింది.

నిధులు లేని సమీక్ష

ఆగిపోయిన ఆర్డీఎస్‌, వేదవతి   

ఆర్‌డీఎంపీ ప్రాజెక్టులకు నిధుల కొరత

శ్రీశైలం జలాశయం ప్లంజ్‌పూల్‌ మరమ్మతులు ఎన్నడో?

ప్రాధాన్యత జాబితాలో ఉన్న గుండ్రేవుల ఉసేలేదు

నేడు సాగునీటి ప్రాజెక్టులపై సీఎం జగన్‌ సమీక్ష

విజయవాడకు బయలుదేరిన సీఈ మురళీనాథ్‌రెడ్డి 


(కర్నూలు-ఆంధ్రజ్యోతి): జిల్లాలో నీటిపారుదల వ్యవస్థలను సమస్యలు చుట్టు ముట్టాయి. జిల్లాలోని ముఖ్యమైన శ్రీశైలం భద్రతకు ప్లంజ్‌పూల్‌ సమస్యగా మారింది. కరువు నివారణ లక్ష్యంగా చేపట్టిన వేదవతి, గుండ్రేవుల ప్రాజెక్టులు నిధులు లేక పడకేశాయి. రాయలసీయ దుర్భిక్ష నివారణ మిషన్‌ కింద చేపట్టిన గాలేరు-నగరి, ఎస్‌ఆర్‌ఎంసీ కాలువ లైనింగ్‌ పనులకు నిధుల కొరత ఉంది. వైీపీ పీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలిరోజుల్లో ప్రాధాన్యత ప్రాజెక్టుల జాబితాలో చేరిన గుండ్రేవులు జలాశయం గురించి మళ్లీ ఊసే లేదు. ఈ మూడేళ్లుగా దాన్ని పట్టించుకోలేదు. ఇదీ ఉమ్మడి జిల్లాలో నిధుల కేటాయింపులు లేని సాగునీటి ప్రాజెక్టుల దుస్థితి. ఈ పరిస్థితిలో నేడు సీఎం జగన్‌ ప్రాజెక్టులపై సమీక్ష నిర్వహించనున్నారు. ఇందులో పాల్గొనడానికి ఇరిగేషన్‌ (ప్రాజెక్ట్స్‌) సీఈ మురళీనాథ్‌రెడ్డి విజయవాడకు బయలుదేరారు. 


ప్రాధాన్యత జాబితాలోనే గుండ్రేవులు 


కేసీ కాలువకు 31.85 టీఎంసీల నీటి వాటా ఉంది. కర్నూలు, నంద్యాల, కడప జిల్లాల్లో 2.65 లక్షల ఎకరాలకు సాగునీరు, 8.50 లక్షల జనాభాకు తాగునీరు అందించే కీలక ప్రాజెక్టు ఇది. అయితే ఆ నీటిని నిల్వ చేసుకునే జలాశయం లేదు. ఫలితంగా నికర జలాలు ఉన్నా రబీకి తాగునీరు ఇవ్వలేని దైన్య పరిస్థితి. దీంతో సుంకేసుల ఎగువన 20 టీఎంసీలు సామర్థ్యంతో గుండ్రేవుల జలాశయం నిర్మించాలని ప్రభుత్వానికి డీపీఆర్‌ పంపారు. జగన్‌ ప్రభుత్వం దీన్ని ప్రాధాన్యత ప్రాజెక్టుల జాబితాలో చేర్చింది. 20 టీఎంసీలు కాకుం డా  40 టీఎంసీలు నిల్వ చేసుకునే అవకాశాలపై సర్వే చేయమని సీఎం సూచించారు. మూడేళ్లు కావస్తున్నా ఈ ప్రాజెక్టు ఊసే లేదు. 


ఆగిపోయిన వేదవతి, ఆర్డీఎస్‌


ఆలూరు, ఆదోని నియోజకవర్గాల్లో 80 వేల ఎకరాలకు సాగునీరు ఇవ్వడానికి వేదవతి ప్రాజెక్టు చేపట్టారు. ప్రాజెక్టులో భాగంగా హాలహర్వి, మొలగవల్లి జలాశయాలు నిర్మిస్తున్నారు. వీటికి రూ.1,998 కోట్లు నిధులు మంజూరు చేశారు. అలాగే మంత్రాలయం, ఎమ్మిగనూరు, కోడుమూరు నియోజకవర్గాల్లో 40 వేల ఎకరాలకు సాగునీరు ఇవ్వాలనే లక్ష్యంగా ఆర్డీఎస్‌ కుడి కాలువ చేపట్టారు. ప్రాజెక్టలో భాగంగా 0.50 టీఎంసీల సామర్థ్యంతో కోసిగి, పెద్దకడుబూరు జలాశయాలు, 1.50 టీఎంసీలతో కొటేకల్లు, 0.25 టీఎంసీల సామర్థ్యంతో చిన్నమరివీడు జలాశయాలు నిర్మిస్తున్నారు. జలాశయాలు, 160 కి.మీలు ప్రధాన కాలువ నిర్మాణాలకు రూ.1,989 కోట్లు మంజూరు చేశారు. ఈ రెండు ప్రాజెక్టులకు పరిపాలన అనుమతులు కూడా ఇచ్చారు. టెండర్లు పూర్తి చేశారు. పనులు మొదలైనా నిధులు కొరత కారణంగా ఎక్కడి పనులు అక్కడే ఆగిపోయాయి. సీఎం జగన్‌ జోక్యం చేసుకొని నిధులు ఇవ్వాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు. 


ప్లంజ్‌పూల్‌ గుంత డ్యాం భద్రతకు ముప్పు!


శ్రీశైలం డ్యాం దిగువన ప్లంజ్‌పూల్‌లో  ఏర్పడిన గుంత డ్యాం భద్రత ముప్పుగా ఉందని పాండ్యా కమిటీ ఇచ్చిన నివేదికలో స్పష్టంగా పేర్కొంది. స్పిల్‌వే గేట్ల నుంచి వరద అతివేగంతో కింద పడి మళ్లీ ఎగిరి పడే ప్రాంతం (ప్లంజ్‌పూల్‌)లో భారీ గుంత ఏర్పడింది. దీనిపై పలు కమిటీలు అధ్యయనం చేశాయి. దీని ప్రభావం  ప్రాజెక్టు రెండు వైపుల ఉన్న గట్లు, ఆనకట్ట పునాది.. మొదలైన వాటి మీద  తీవ్రంగా ఉంటుంది. ప్లంజ్‌పూల్‌ కుడి, ఎడమ గట్లకు నష్టం జరగకుండా మరమ్మతు చేయాలని కమిటీ ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. ప్లంజ్‌పూల్‌ సహా డ్యాం మరమ్మతులకురూ.వెయ్యి కోట్లతో ప్రతిపాదనలు పంపారు. 


వీటిపై దృష్టి పెట్టాలి


కేసీ కాలువ జీవనాడి సుంకేసుల బ్యారేజీ. 1.20 టీఎంసీల సామర్థ్యంతో తంగభద్ర నదిపై నిర్మించారు. 1994లో ఎన్టీఆర్‌ ప్రభుత్వం ఆధునికీకరణ పనులు చేపట్టి 2005-06లో పూర్తి చేశారు. 2009లో తుంగభద్రకు వచ్చిన భారీ వరదకు బ్యారేజీ దెబ్బంది. కరకట్ట కొట్టుకుపోయింది. ఆధునికీకకరణకు రూ.120 కోట్లతో పంపిన ప్రతిపాదనలు పంపారు. తాజాగా సుంకేసుల బ్యారేజీ, కేసీ కాలువ ఆధునికీకరణకు ఎస్‌ఐఎంపీ కింద రూ.563 కోట్ల ప్రతిపాదనలు పంపారు. కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. 


కర్నూలు, అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో 6,02,500 ఎకరాలకు సాగునీరు ఇవ్వాలనే లక్ష్యంగా చేపట్టిన హంద్రీనీవా ఎత్తిపోతల పథకం ద్వారా శ్రీశైలం ఎగువ నుంచి 40 టీఎంసీలు కృష్ణా వరద జలాలు ఎత్తిపోయాలి. ఇందుకు మాల్యాల లిఫ్టు పంపింగ్‌ కేంద్రం వద్ద 12 పంపులు (ఒక్కో పంపు సామర్థ్యం 330 క్యూసెక్కులు) ఏర్పాటు చేశారు. 8 దశల్లో లిప్టులు నిర్మించారు. 3,880 క్యూసెక్కలు నీరు ఎత్తిపోయాల్సి ఉంటే 2,025 క్యూసెక్కులకు మించి లిఫ్టు చేయడం లేదు. గత టీడీపీ ప్రభుత్వం 2017 ఏప్రిల్‌ 20న రూ.1,030 కోట్లతో చేపట్టిన విస్తరణ పనులు అసంపూర్తిగా ఉన్నాయి. వైసీపీ ప్రభుత్వం వచ్చాక కాలువ విస్తరణ కోసం పంపిన ప్రతిపాదనలు పెండింగ్‌లో ఉన్నాయి. విద్యుత్‌ బిల్లులు రూ.2,640 కోట్లు బకాయి చెల్లించాలి. 


గాలేరు-నగరి ప్రాజెక్టులో కీలకమైన అవుకు టన్నెల్‌ నిర్మాణం చేపట్టారు. 5.750 కి.మీల పొడవుతో ఒక్కో టన్నెల్‌లో 10 వేల క్యూసెక్కులు చొప్పున 20 వేల క్యూసెక్కుల ప్రవాహానికి వీలుగా వాటిని చేపట్టారు. ఫాల్ట్‌జోన్‌ కారణంగా పనులు ఆగిపోతే.. టీడీపీ ప్రభుత్వంలో 10 వేల క్యూసెక్లుకు ప్రవాహానికి వీలుగా బైపాస్‌ టెన్నల్‌ నిర్మాణం పూర్తి చేశారు. రెండో టన్నెల్‌ను ప్రాధాన్యత ప్రాజెక్టులు జాబితాలో చేపట్టిన మూడేళ్లు గడిచినా పూర్తి కాలేదు. ఇప్పటికే 75 మీటర్లు టెన్నలు తవ్వాల్సి ఉంది. 


రాయలసీమ దుర్భిక్ష నివారణ మిషషన్‌ (ఆర్‌డీఎంపీ)లో భాగంగా గాలేరు-నగరి ఫ్లడ్‌ఫ్లో కెనాల్‌, ఎస్‌ఆర్‌ఎంసీ ప్రధాన కాలువ సీసీ లైనింగ్‌, అదనపు అవుకు టన్నెల్‌ నిర్మాణం వంటి పనులు చేపట్టారు. ఇప్పటికే రూ.1,600 కోట్లు ఖర్చు చేశారు. నిధులు రాకపోవడంతో ఎక్కడి పనులు అక్కడే ఆగిపోయాయి. 

Read more