నెరవేరని సీఎం హామీలు

ABN , First Publish Date - 2022-07-04T06:07:39+05:30 IST

ముఖ్యమంత్రి కేసీఆర్‌ సిరిసిల్ల ప్రజలకు ఇచ్చిన హామీలు ఏడాదిగా నెరవేరడం లేదు.

నెరవేరని సీఎం హామీలు

-  సిరిసిల్ల పర్యటనలో వరాలు  

- ఏడాదిగా ఎదురు చూపులు  

(ఆంధ్రజ్యోతి సిరిసిల్ల)

ముఖ్యమంత్రి కేసీఆర్‌ సిరిసిల్ల ప్రజలకు ఇచ్చిన హామీలు ఏడాదిగా నెరవేరడం లేదు. గత సంవత్సరం జూలై 4న రాజన్న సిరిసిల్ల జిల్లా సమీకృత కలెక్టరేట్‌ సముదాయ భవనంతోపాటు నర్సింగ్‌ కళాశాల, డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల సముదాయం, అంతర్జాతీయ డ్రైవింగ్‌ శిక్షణ మరియు పరిశోధన కేంద్రాన్ని ఎంతో అట్టహాసంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా  ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలు నెరవేరకపోగా కనీసం ప్రారంభించిన డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల సముదాయం కూడా లబ్ధిదారులకు చేరువ కాలేదు. తమకు డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు ఎప్పుడు ఇస్తారోనని ఏడాది కాలంగా ఎదురుచూస్తూనే ఉన్నారు. రెండు నెలల్లోనే మల్కపేట రిజర్వాయర్‌లోకి మిడ్‌ మానేరు నుంచి నీటిని ఎత్తి పోస్తామని ప్రకటించారు. మరోవైపు అంతగిరి ప్రాజెక్ట్‌ నుంచి మిడ్‌ మానేరు వరకు పర్యాటకంగా అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. ఇదే సందర్భంలో అంతగిరి పోచమ్మ తల్లిని దర్శించుకుంటానని చెప్పారు. ఇప్పటికీ పర్యాటక శోభ ఊసే లేదు. తల్లి దర్శనం లేకుండానే గడిచిపోయింది.  సమీకృత కలెక్టరేట్‌ వరద ముంపునకు గురైంది.  కలెక్టర్‌ తన క్యాంపు ఆఫీస్‌ నుంచి ట్రాక్టర్‌పై బయటికి రావడం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది.  వేములవాడ  రాజరాజేశ్వరస్వామి దేవస్థానం అభివృద్ధి చేస్తామన్న హామీ హామీగానే ఉండిపోయింది. నేతన్నకు ఇస్తానన్న బీమా ఇవ్వలేదు. ఇలా పెద్దసారు పర్యటనకు ఏడాది గడిచింది.  

‘డబుల్‌’ లబ్ధిదారుల ఎదురు చూపులు

రాజన్న సిరిసిల్ల జిల్లాలో డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల లొల్లి  కొనసాగుతూనే ఉంది. అర్హులు తమకు ఇవ్వాలని   ధర్నాలు, ఆందోళనలు చేస్తున్నారు. సిరిసిల్ల మున్సిపల్‌ పరిధిలోని లబ్ధిదారులకోసం తంగళ్లపల్లి మండలం మండెపల్లిలో రూ.87.37 కోట్ల వ్యయంతో 27 ఎకరాల్లో నిర్మించిన 1320 గృహాల సముదాయం లబ్ధిదారులకు ఎదురు చూపులే మిగిల్చింది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ గతేడాది జూలై 4 సముదాయాన్ని ప్రారంభించారు. రెండు కుటుంబాలతో లాంఛనంగా గృహా ప్రవేశం చేయించారు. ఆ రెండు కుటుంబాలతోపాటు అనంతగిరి నిర్వాసిత కుటుంబాలు మాత్రమే డబుల్‌ బెడ్‌రూం ఇళ్లను వినియోగించుకుంటున్నారు.  ఇప్పటి వరకు అర్హులైన లబ్ధిదారులకు కేటాయించకపోవడంతో ఇళ్లు నిరుపయోగంగా మారాయి. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రారంభించిన డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల సముదాయం లబ్ధిదారులకు చేరకపోవడంతో నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. 

నేతన్నకు అందని బీమా

రైతు బంధు తరహాలోనే రాష్ట్రంలోని మరమగ్గాలు, చేనేత కార్మికులకు రూ.5 లక్షల బీమా సదుపాయం కల్పిస్తామని ప్రకటించారు. ముఖ్యమంత్రి హామీ మేరకు బీమా కల్పించేందుకు రూ.29.88 కోట్ల  ప్రీమియం చెల్లించడానికి ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. సిరిసిల్ల సమీకృత జిల్లా కార్యాలయాల ప్రారంభోత్సవ సభలో ప్రకటించినా బీమా పథకం మాత్రం ఇంకా అమల్లోకి రాలేదు. మార్గదర్శకాలు జారీ కాకపోవడంతో సిరిసిల్ల నేత కార్మికులు నిరీక్షిస్తున్నారు. బీమా సదుపాయం అందుబాటులోకి వస్తే సిరిసిల్లలోనే 25 వేల మంది పవర్‌లూం కార్మికులు అనుబంధ రంగాల కార్మికులకు ప్రయోజనం కలుగుతుంది. 

కలెక్టరేట్‌కు వరద ముప్పు 

ఆధునిక హంగులతో ప్రజలందరికీ ఒకే చోట కార్యాలయాలు అందుబాటులో ఉండే విధంగా సిరిసిల్ల బైపాస్‌ రోడ్డులో నిర్మించిన సమీకృత కలెక్టరేట్‌ కార్యాలయాల సముదాయ భవనాన్ని వరద ముప్పు వెంటాడుతోంది. గతేడాది ఆగస్టు, సెప్టెంబరులో కురిసిన వర్షానికి సిరిసిల్ల ప్రాంతంతోపాటు కలెక్టరేట్‌ జలదిగ్భందంలో చిక్కింది.  వరదనీటిలో వాహనాలు వెళ్లే పరిస్థితి లేకపోవడంతో  కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి ట్రాక్టర్‌పై బయటకు వచ్చారు. సిరిసిల్లలోని లోతట్టు ప్రాంతాలు కూడా నీట మునిగాయి. భవిష్యత్‌లో వరద ముప్పు లేకుండా మానేరు వాగులోకి నీళ్లు చేరే విధంగా కాలువలను తవ్వారు. కాలువలను తవ్వినప్పటికీ వర్షాకాలంలో వరద భయం మాత్రం వెంటాడుతూనే ఉంది. 


మల్కపేటకు చేరని నీళ్లు 

మిడ్‌ మానేరు నుంచి మల్కపేటకు రెండు నెలల్లోనే నీళ్లు అందిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రకటించినా పనులు మాత్రం ముందుకు సాగడం లేదు. కాళేశ్వరం జలాలు సిరిసిల్ల మిడ్‌ మానేరు నుంచి మల్లన్న సాగర్‌ వరకు తరళివెళ్లినా 9వ ప్యాకేజీలో జరుగుతున్న మల్కపేట రిజర్వాయర్‌ పనులు మాత్రం నత్తనడకనే సాగుతున్నాయి. మిడ్‌ మానేరు నుంచి మల్కపేట వరకు 12 కిలోమీటర్ల టన్నెల్‌ పనులు జరుగుతున్నాయి. టన్నెల్‌ పనులు చివరి దశలో మిగిలి ఉన్నాయి. మల్కపేట నుంచి ఎగువ మానేరు వరకు నీటిని మళ్లించి సిరిసిల్ల నియోజకవర్గానికి పూర్తిస్థాయిలో అందించే ప్రాజెక్ట్‌ పనులు ఎలా ఉన్నా వ్యయం మాత్రం పెరుగుతూ వస్తోంది. 2013లో శంకుస్థాపన సమయంలో రూ.663.50 కోట్లతో పనులు ప్రారంభించారు. 2015లో రూ.110కోట్లు పెంచారు. 2018లో మరోసారి రూ.138.32 కోట్లు, 2020లో రూ.84.69 కోట్లకు పెంచారు. ప్రస్తుతం ప్రాజెక్ట్‌ రూ.996.01 కోట్లతో పనులు జరుగుతున్నా ఎప్పుడు పూర్తవుతుందో తెలియని పరిస్థితి. ముఖ్య మంత్రి కేసీఆర్‌ ప్రాజెక్ట్‌ పూర్తవుతుందని ప్రకటించినా నిర్లక్ష్యమే కనిపిస్తోంది. 

    పర్యాటక శోభకు కలగని మోక్షం 

కాళేశ్వరం ఎత్తిపోతల పథకాలతో సిరిసిల్ల మానేరు వాగుపై నిర్మించిన శ్రీరాజరాజేశ్వర మిడ్‌ మానేరు ప్రాజెక్ట్‌, ఇల్లంతకుంట మండలంలో అసియాలోనే అతిపెద్ద సర్జిపూల్‌ బావి, అనంతగిరి వద్ద 3.5 టీఎంసీలతో అన్నపూర్ణ ప్రాజెక్ట్‌లను నిర్మించారు. మిడ్‌ మానేరు బ్యాక్‌ వాటర్‌తో సిరిసిల్ల ప్రాంతానికి జలకళ వచ్చింది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ సిరిసిల్ల పర్యటనలో మిడ్‌ మానేరు, అనంతగిరి ప్రాజెక్ట్‌లను అనుసంధానంగా పర్యటక ప్రాంతంగా తీర్చిదిద్దుతామని ప్రకటించారు. అనంతగిరిలో 40 ఎకరాల ఐలాండ్‌ అభివృద్ధి చేస్తామని ఇదే సమయంలో అనంతగిరి పోచమ్మ తల్లిని దర్శించుకుంటానని చెప్పారు. పర్యాటకంగా అభివృద్ధి చెందుతుందని ఈ ప్రాంత వాసులు ఎదురు చూసినా నిరాశ తప్పడం లేదు. మిడ్‌ మానేరులో బోటింగ్‌ కోసం  ఏర్పాట్లు చేసినా ప్రారంభోత్సవానికి  నోచుకోలేదు. 

ఆగస్టులో మరోసారి కేసీఆర్‌ పర్యటన 

జిల్లాకు ఆగస్టు మాసంలో మరోసారి ముఖ్యమంత్రి కేసీఆర్‌ రానున్నట్లు తెలుస్తోంది. మెడికల్‌ కాలేజీ, జేఎన్‌టీయూ కళాశాలల భవనాల నిర్మాణాలకు శంకుస్థాపనతో పాటు పలు ప్రారంభోత్సవాలు చేయనున్నట్లుగా చర్చించుకుంటున్నారు. తంగళ్లపల్లి మండలం జిల్లెల్ల వద్ద ఆధునిక వసతులతో నిర్మించిన వ్యవసాయ డిగ్రీ కళాశాలను ప్రారంభించనున్నారు. మల్కపేట రిజర్వాయర్‌లోకి నీటిని ఎత్తిపోసే కార్యక్రమాన్ని కూడా ప్రారంభిస్తారని భావిస్తున్నారు. కలెక్టరేట్‌ సమీపంలో నిర్మించిన టీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయం, సమావేశ మందిరాన్ని ప్రారంభించనున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ మళ్లీ వచ్చే సమయానికి అయినా పెండింగ్‌ పనులు పూర్తి చేసే దిశగా అధికారులు దృష్టి సారించినట్లు తెలుస్తుంది. 


Updated Date - 2022-07-04T06:07:39+05:30 IST