నెరవేరని లక్ష్యం

ABN , First Publish Date - 2021-07-31T04:43:04+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఇంకుడు గుంతల

నెరవేరని లక్ష్యం

  • తూతూమంత్రంగా ఇంకుడు గుంతల నిర్మాణం 
  • జిల్లాలో బిల్లుల చెల్లింపులో తీవ్ర జాప్యం
  • ఏర్పాటుకు ఆసక్తిచూపని లబ్ధిదారులు 
  • అధికారుల నిర్లక్ష్యమే కారణమన్న విమర్శలు


రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఇంకుడు గుంతల కార్యక్రమం లక్ష్యం నీరుగారి పోతోంది. అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఈ పథకం ముందుకు సాగడం లేదు. కొండంత లక్ష్యం నిర్దేశించుకొని..గోరంత పనులు చేశారు. ఇంకుడుగుంతలు ఏర్పాటు చేసుకున్న వారికి బిల్లుల చెల్లింపుల్లో తీవ్ర జాప్యం జరుగుతోంది. దీంతో ఇంకుడుగుంతలు నిర్మించుకోవడానికి ఎవరూ ముందుకు రావడం లేదు.


(ఆంధ్రజ్యోతి, రంగారెడ్డి అర్బన్‌) : భూగర్భజలాల పరి రక్షణకు ఇంకుడుగుంతల నిర్మాణ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. ప్రజలను చైతన్యవంతం చేసి, ఉద్య మంలా ప్రతి ఇంటిలో ఇంకుడు గుంతలు నిర్మించు కోవడం ద్వారా భవిష్యత్‌ తరాలకు తాగునీటి ఇబ్బందులు లేకుండా చేయవచ్చని భావించింది. ఈ క్రమంలో పట్టణాల్లో ప్రతి ఇంటిలో ఇంకుడు గుంతల నిర్మాణానికి అవసరమైన ఆదేశాలు జారీ చేసింది. అలాగే ప్రత్యేక దృష్టిసారించింది. అయినా ప్రభుత్వం లక్ష్యం నీరు గారు తోంది. తొలిరోజుల్లో హడావిడిగా కనిపించిన కార్యక్రమం.. ఆ తర్వాత అంతంత మాత్రంగానే సాగుతోంది. 


తూతూ మంత్రంగా ఇంకుడుగుంతల ఏర్పాటు

ఇంకుడుగుంతలు ఏర్పాటు చేసుకుంటేనే కొత్తనిర్మాణాలకు అనుమతులు ఇవ్వాలనేది ప్రభుత్వ నిబంధన. అయితే అది సక్రమంగా అమలు కావడం లేదు. నీటిని పొదుపు చేసుకోవాలని చెబుతున్నా పెడచెవిన పెడుతున్నారు. ఇంటి నిర్మాణాల సమ యాల్లో ఇంకుడు గుంతలు నిర్మించుకుంటే భూగర్భ జల మట్టం పెరిగి బోర్ల ద్వారా నీటి అవసరాలు తీర్చుకునే వీలు ఉంటుంది. గృహనిర్మాణానికి అనుమతి దరఖాస్తు చేసుకున్న సమయంలో విధిగా ఇంకుడుగుంత నిర్మించినట్లు ధ్రువపత్రం పొందాలి. అప్పుడే నిర్మాణానికి అనుమతి ఇవ్వాలి. అయితే ఆ పరిస్థితి లేకుండా పోయింది. 


నిర్మాణాల్లో అంతులేని నిర్లక్ష్యం..

ఇంకుడు గుంతల నిర్మాణాల్లో నిర్లక్ష్యం నెలకొంది. అధికారులు పట్టించుకోకపోవడంతో ప్రభుత్వ సంకల్పం నెరవేరడం లేదు. జిల్లాలో 33,076 ఇంకుడు గుంతలు (వ్యక్తిగత, సామూహిక) మంజూరు కాగా రూ. 1487.4 లక్షలు కేటాయించారు. 1006 ఇంకుడు గుంతల నిర్మాణాలు పురోగతిలో ఉన్నాయి. వీటి కోసం రూ. 25.94 లక్షలు ఖర్చు చేశారు. 14,276 ఇంకుడు గుంతలు ఇప్పటివరకు పూర్తయ్యాయి. పూర్తయిన ఇంకుడు గుంతలకు సంబంధించి రూ.489.39 లక్షలు ఖర్చు చేశారు. ఇంకా 17,794 ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకోవాల్సి ఉంది. 


బిల్లులు ఇవ్వకపోవడమే కారణమా?

ఇంకుడు గుంతల నిర్మించుకోవాలని, అందుకు అయిన ఖర్చు చెల్లిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. దీంతో ఇంకుడు గుంతలు నిర్మాణం చేసుకుని చాలారోజులు అవుతున్నా అనేకమందికి బిల్లులు రాలేవు. దీంతో తాజాగా ఇంకుడుగుంతలను నిర్మించేం దుకు ప్రజలు ముందుకు రావడం లేదన్న వాదన వినిపిస్తోంది. 


వృధా అవుతున్న వర్షపు నీరు

వరుణుడు కరుణించినా.. వాన చుక్క భూమిలోకి ఇంకే పరిస్థితి కనిపించడం లేదు. భారీ వర్షాలు కురిసినా.. వేసవిలో సాగు, తాగునీటికి తిప్పలు తప్పడం లేదు. వర్షపు నీటిని భూగర్భంలోకి ఇంకించేందుకు అవసరమైన రీఛార్జి ఫిట్స్‌ తగినన్నీ లేకపోవడంతో భూగర్భ జలమట్టాలు ఆశించిన మేర పెరగడం లేదని భూగర్భ జలనిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 


ఎన్నో ఉపయోగాలు

సాధారణ వర్షపాతం (20మిల్లీమీటర్లు) నమోదయ్యే రోజుల్లో... రోజుకూ 1600లీటర్లు నీటిని ఇంకుడుగుంత ద్వారా భూగర్భంలోకి ఇంకించవచ్చు. ఈ నీరు నలుగురు సభ్యులున్న కుటుంబానికి మూడు రోజుల అవసరాలకు సరిపోతాయి. అదేవిధంగా భావితరాలకు మీరు జల బ్యాంక్‌ ఏర్పాటు చేసిన వారవుతారు. 


ఇంటింటికీ ఇంకుడు గుంతల నిర్మాణం ఇలా..

ఇంటింటా ఇంకుడు గుంతలు ఈవిధంగా నిర్మిస్తారు. ప్రతి గుంత 1.2 మీటర్ల పొడవు, 1.2 మీటర్ల వెడల్పు, 1.8 మీటర్ల లోతు కలిగి ఉండాలి. అడుగు భాగంలో ఫీటున్నర మందం బెందడు రాళ్లు, దానిపైన 40 ఎంఎం ఫీటున్నర కంకర, వాటిపైన 3 ఫీట్ల రింగ్‌ను అమర్చాలి. పైన మూత ఏర్పాటు చేసి 5 మీటర్ల పైపును బిగించాలి. డ్రమ్ము పక్కన ఖాళీ స్థలంలో ఇరుపక్కల 20 ఎంఎం కంకర నింపాలి. మొదట గుంత తవ్వగా వచ్చిన మట్టిని నీటి ప్రవాహానికి అడ్డంగా, అవతలి భాగంలోకట్ట రూపంలో పోయాలి. ఇంకుడు గుంత చుట్టూ సిమెంట్‌ ప్లాస్టరింగ్‌ చేస్తే గుంత పూడిపోకుండా ఉంటుంది. ప్రతి ఇంకుడు గుంతకు ప్రభుత్వం రూ.4,600 అందిస్తుంది.


సామూహిక ప్రాంతాల్లో ఇలా..

సామూహిక ప్రాంతాల్లో ఇంకుడు గుంతల నిర్మాణాలు ఏర్పాటు చేసుకునేందుకు ప్రభుత్వం రూ.7,800 ఉపాధిహామీ నిధుల నుంచి అందిస్తుంది. 2 మీటర్ల పొడవు, 2 మీటర్ల వెడల్పు, 2 మీటర్ల లోతు గుంత తవ్వాలి. అడుగు భాగంలో 3 అడుగుల వరకు 225 ఎంఎం కంకర రాళ్లతో నింపాలి. పైభాగంలో 30 సెంటీమీటర్లు 20 ఎంఎం కంకర రాళ్లతో ఇసుక మిశ్రమంతో నేల సగభాగం నింపాలి. అలాగే 2 మీటర్ల పొడవు, 4 మీటర్ల వెడల్పు, 2 మీటర్ల మరో ఇంకుడు గుంతకు రూ.30,400 చెల్లిస్తున్నారు. 


బిల్లులు చెల్లించలేదు

ఇంకుడు గుంత నిర్మించుకోవాలని అధికారులు హడావిడి చేశారు. నిర్మించు కుంటే కలిగే ప్రయోజనాల గురించి అవగాహన కల్పించారు. అప్పుచేసి మరీ ఇంకుడు గుంత ఏర్పాటు చేసుకున్నాను. ఇప్పటివరకు బిల్లు ఇవ్వలేదు. 

- బోడ నర్సింహులు, కాస్లాబాద్‌ గ్రామం, చౌదరిగూడ మండలం 


అవగాహన కల్పిస్తున్నాం..

ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకోవాలని ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాం. ఇంకుడు గుంతలు నిర్మించుకునేందుకు లబ్ధిదారులు ముందుకు వస్తున్నారు. రంగారెడ్డి జిల్లాలో ఇంకుడు గుంతల నిర్మాణాల్లో గత ఏడాది వేగం తగ్గినప్పటికీ.. ప్రస్తుతం పనుల్లో పురోగతి పెరిగింది. 

- నీరజ, డీఆర్‌డీవో అదనపు పీడీ


ఇంకుడు గుంతల నిర్మాణాల వివరాలు

మంజూరైన ఇంకుడు గుంతలు : 33,076

ఖర్చు అంచనా : 1487.4లక్షలు

పురోగతిలో ఉన్నవి : 1006

పురోగతిలో ఉన్న వాటికి ఖర్చు చేసింది : 25.94లక్షలు

పూర్తయిన గుంతలు : 14,276

పూర్తయిన పనులకు ఖర్చు చేసింది : 489.39లక్షలు

Updated Date - 2021-07-31T04:43:04+05:30 IST