Varanasi: దివ్యాంగ మహిళకు ప్రధాని మోదీ పాదాభివందనం

ABN , First Publish Date - 2021-12-16T17:24:48+05:30 IST

భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఒక దివ్యాంగ మహిళకు పాదాభివందనం చేసిన దృశ్యం ప్రతి ఒక్కరినీ మంత్రముగ్ధులను చేసిన ఘటన...

Varanasi: దివ్యాంగ మహిళకు ప్రధాని మోదీ పాదాభివందనం

నెటిజన్ల మనసు దోచుకున్న ప్రధాని...సోషల్ మీడియాలో ఫొటో వైరల్

న్యూఢిల్లీ: భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఒక దివ్యాంగ మహిళకు పాదాభివందనం చేసిన దృశ్యం ప్రతి ఒక్కరినీ మంత్రముగ్ధులను చేసింది.ఈ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని వారాణసీ నగరంలో జరిగింది.ఇటీవల తన పార్లమెంటు నియోజకవర్గమైన వారాణసికి వెళ్లిన ప్రధాని నరేంద్ర మోదీ... తనను కలిసేందుకు వచ్చిన ఓ దివ్యాంగ మహిళ పాదాలను తాకి కోట్లాది మంది భారతీయుల హృదయాల్లో చెరగని ముద్ర వేశారు.వారాణసిలో కాశీ విశ్వనాథ్ కారిడార్ ప్రాజెక్ట్‌ను ప్రధాని మోదీ ప్రారంభించిన కొద్దిసేపటికే శిఖా రస్తోగి అనే దివ్యాంగ మహిళ వచ్చారు.మహిళను చూడగానే, ప్రధాని మోదీ ఆమె క్షేమ సమాచారాల గురించి అడిగారు.దివ్యాంగ మహిళ ప్రధాన మంత్రి ఆశీర్వాదం తీసుకోవడానికి ముందుకు వచ్చినప్పుడు, ప్రధాని ఆమెను ఆపి, బదులుగా దివ్యాంగ మహిళకు పాదాభివందనం చేశారు.ప్రధాని స్పందన దివ్యాంగ మహిళను ఆకట్టుకుంది.



 దివ్యాంగ మహిళ ముకుళిత హస్తాలతో నిలబడి ప్రధానికి తన కృతజ్ఞతలు తెలిపారు.ఇది జరిగిన వెంటనే యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కూడా ముందుకు వచ్చి దివ్యాంగ మహిళను పలకరించారు.ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, ఆయన భద్రతా సిబ్బంది, రాష్ట్ర ప్రభుత్వ అధికారుల సమక్షంలో ప్రధానమంత్రి మహిళ పాదాలను తాకిన ఫొటో కొద్దిసేపటిలోనే వైరల్ అయ్యింది. ఈ చిత్రం సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లో విస్తృతంగా షేర్ చేశారు.భాజపా మహిళా మోర్చా జాతీయ అధ్యక్షురాలు వనతీ శ్రీనివాసన్ ఈ చిత్రాన్ని ట్విట్టర్‌లో పంచుకున్నారు. మహిళా శక్తికి గౌరవం అని ఆమె క్యాప్షన్ ఇచ్చారు. ‘‘ఇది మొత్తం మహిళా శక్తికి దక్కిన గౌరవం. మన ప్రధాని నరేంద్ర మోదీని చూసి మనమంతా గర్విస్తున్నాం’’ అని వనతీ శ్రీనివాసన్ ట్వీట్ చేశారు.


Updated Date - 2021-12-16T17:24:48+05:30 IST