గాడిన పడని కేజీబీవీ

ABN , First Publish Date - 2022-08-06T04:20:47+05:30 IST

కస్తూర్బా బాలికా విద్యాలయాల్లో ఇంటర్‌ విద్యాబోధన గాడిన పడలేదు. ఇంటర్‌ గ్రూపులు అందుబాటులోకి తెచ్చి రెండేళ్లవుతున్నా వసతులు మెరుగుపడలేదు. బాలికా విద్యను ప్రోత్సహించడంలో భాగంగా ఉపాధి కోసం సుదూర ప్రాంతాలు వలస వెళ్లిన వారి పిల్లల కోసం దశాబ్ద కాలం నాటి కిందట కేజీబీవీలను ఏర్పాటుచేశారు. ఆరు నుంచి పదో తరగతి వరకూ వసతితో కూడిన విద్యను అందిస్తున్నారు.

గాడిన పడని కేజీబీవీ

కస్తూర్బా విద్యాలయాల్లో భర్తీకాని పోస్టులు

8 నెలల కిందట నోటిఫికేషన్‌ జారీ

వేలాది మంది అభ్యర్థుల దరఖాస్తు

అయినా పూర్తికాని నియామక ప్రక్రియ

తాజాగా గెస్ట్‌ టీచర్స్‌, అధ్యాపకుల నోటిఫికేషన్‌ 

(కలెక్టరేట్‌)

కస్తూర్బా బాలికా విద్యాలయాల్లో ఇంటర్‌ విద్యాబోధన గాడిన పడలేదు. ఇంటర్‌ గ్రూపులు అందుబాటులోకి తెచ్చి రెండేళ్లవుతున్నా వసతులు మెరుగుపడలేదు. బాలికా విద్యను ప్రోత్సహించడంలో భాగంగా ఉపాధి కోసం సుదూర ప్రాంతాలు వలస వెళ్లిన వారి పిల్లల కోసం దశాబ్ద కాలం నాటి కిందట కేజీబీవీలను ఏర్పాటుచేశారు. ఆరు నుంచి పదో తరగతి వరకూ వసతితో కూడిన విద్యను అందిస్తున్నారు. సమగ్రశిక్ష అభియాన్‌ పర్యవేక్షణ బాధ్యతలు చూస్తుండగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. అయితే పదో తరగతి తరువాత డ్రాపౌట్స్‌ అధికంగా ఉండడం, బాల్య వివాహాల నియంత్రణకుగాను కొన్ని పాఠశాలల్లో ఇంటర్‌ గ్రూపులను అందుబాటులోకి తెచ్చారు. సంప్రదాయ ఇంటర్‌ గ్రూపులతో పాటు మెడికల్‌ ల్యాబ్‌ టెక్నీషియన్‌, కంప్యూటర్‌ సైన్స్‌, గ్రాఫిక్స్‌ అండ్‌ యానిమేషన్‌, టాక్సిషన్‌, ఫిజియోథెరపీ, సెరీకల్చర్‌ వంటి సాంకేతిక కోర్సులను సైతం ప్రారంభించారు. అయితే ఇంటర్‌ గ్రూపులు అందుబాటులోకి వచ్చి మూడు సంవత్సరాలు గడుస్తున్నా పూర్తిస్థాయిలో అధ్యాపకులను నియమించలేదు.

 గత ఏడాది నోటిఫికేషన్‌

కేజీబీవీల్లో ఖాళీగా ఉన్న పోస్టులు భర్తీకి గత ఏడాది డిసెంబరులో నోటిఫికేషన్‌ ఇచ్చారు. ఉమ్మడి జిల్లా ప్రకారం రెండు ప్రిన్సిపాల్‌ పోస్టులు, 89 పీజీటీలు, పీజీటీ ఒకేషనల్‌ 25, సీఆర్‌టీలు 16 పోస్టులు భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసిన సంగతి తెలిసిందే. అప్పట్లో అర్హులైన అభ్యర్థులు పెద్ద సంఖ్యలో దరఖాస్తు చేసుకున్నారు. మొత్తం 132 పోస్టులకుగాను 2390 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఆదే సమయంలో దరఖాస్తు చేసుకున్న వారిలో కొంతమంది నకిలీ ధ్రుపత్రాలు జతచేశారన్న ఆరోపణలు వచ్చాయి. దీనిపై స్పందించిన అధికారులు సమగ్ర విచారణ చేశారు. కానీ తరువాత ఎందుకో ఆ పోస్టులు భర్తీ ప్రక్రియ పూర్తి చేయలేదు. అప్పటి నుంచి దరఖాస్తుదారులు ఎదురుచూస్తునే ఉన్నారు. 

 ఇప్పుడు మరోసారి...

తాజాగా ఇప్పుడు మరోసారి గెస్ట్‌ ఫ్యాకల్టీ నియామకానికి నోటిఫికేషన్‌ ఇచ్చారు.  మహిళా లెక్చరర్స్‌, టీచర్స్‌ దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.. సీఆర్టీ విభాగంలో తెలుగు 2, హిందీ 2 ఇంగ్లీష్‌ 3,గణితం 6, ఫిజికల్‌ సైన్స్‌ 6, నేచురల్‌ సైన్స్‌ 3, సోషల్‌ స్టడీస్‌ 2, పీఈటి 1 చొప్పున  మొత్తం 25 పోస్టులకు నోటిఫికేషన్‌ ఇచ్చారు. అలాగే పీజీటీ విభాగంలో తెలుగు 15, ఇంగ్లీష్‌ 21, గణితం 6, ఫిజిక్స్‌ 11, కెమిస్ర్టీ 17, జువాలజీ 7, బోటనీ 6, హిస్టరీ 1, కామర్స్‌ 1, ఎకనామిక్స్‌ 2, సివిక్స్‌ 2, సీఎస్సీ 4, జీఎప్సీ 10, పిజియోఽథెరపీ 1, ఎంపీహెచ్‌డబ్య్లూ 10 చొప్పున మొత్తం 115 పోస్టులకు గెస్ట్‌ ఫ్యాకల్టీ ప్రాతిపదికన భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేశారు. సీఆర్టీలకు 60 పీరియడ్స్‌కు గాను  ఒక్కో పీరియడ్‌కు రూ.200 చొప్పున నెలకు రూ 12 వేలు, అలాగే పీజీటిలకు 48 పీరియడ్స్‌కు గాను ఒక్కో పీరియడ్‌కు రూ.250 చొప్పున నెలకు రూ 12 వేలు చొప్పున చెల్లించనున్నట్టు నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. అయితే గతంలో దరఖాస్తు చేసుకున్న వారి పరిస్థితి ఏమిటన్నది మాత్రం ఇప్పుడు తెలియడం లేదు. 

 సీఆర్టీలపై ఒత్తిడి

ఒక్కో కేజీబీవీలో ప్రత్యేకాధికారితో పాటు ఆరుగురు వరకూ సీఆర్టీలు పనిచేస్తున్నారు. స్వీపర్లు, వంట మనుషులు, ఏఎన్‌ఎం, వాచ్‌మెన్లు వంటి బోధనేతర సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. ఆరు నుంచి పదో తరగతి వరకూ 200 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఇంటర్‌కు సంబంధించి రెండు సంవత్సరాలకు 80 మంది చొప్పున విద్యార్థులకు అడ్మిషన్లు కల్పించారు. ఈ లెక్కన ఒక్కో పాఠశాలలో విద్యార్థుల సంఖ్య 280కు పెరిగినా అందుకు తగ్గట్టు వసతులు పెంచలేదు. పరిమిత కాలానికి గెస్ట్‌ లెక్చరర్లను నియమించి చేతులు దులుపుకుంటున్నారు. దీంతో సీఆర్టీలే అటు పాఠశాల తరగతుల నిర్వహణతో ఇంటర్‌ గ్రూపులకు బోధించాల్సి వస్తోంది. అయితే మెడికల్‌ ల్యాబ్‌ టెక్నీషియన్‌, ఫిజియోథెరపీ, గ్రాఫిక్స్‌ అండ్‌ యానిమేషన్‌, టాక్సేషన్‌, సెరీకల్చర్‌ వంటి కోర్సుల విద్యాబోధనకు ప్రత్యేక ఫ్యాకల్టీ అవసరం. 


 కోర్టు కేసు ఉండడంతోనే..

గతంలో నోటిఫికేషన్‌ జారీచేసిన మాట వాస్తవమే. కానీ ఆ నోటిఫికేషన్‌పై కోర్టులో కేసు ఉంది. అందుకే విద్యాబోధనకు ఇబ్బంది లేకుండా చూడాలన్న ఉద్దేశ్యంతో గెస్ట్‌ టీచర్స్‌, ఫ్యాకల్టీ నియామక ప్రక్రియ చేపడతాం. కేజీబీవీల్లో ఉత్తమ విద్యాబోధన దిశగా అడుగులేస్తున్నాం. 

వేమలి అప్పలస్వామి నాయుడు, సమగ్రశిక్ష అధికారి



Updated Date - 2022-08-06T04:20:47+05:30 IST