అనాలోచితంగా కాలనీల లేఅవుట్లు

ABN , First Publish Date - 2022-06-29T06:03:38+05:30 IST

విశాఖ నగర పరిధిలోని పేదలకు ఇళ్ల స్థలాల కోసం మండలంలో వేసిన లే-అవుట్లు అధికారుల అనాలోచిత నిర్ణయాలకు అద్దం పడతున్నాయని మాజీ మంత్రి, టీడీపీ సీనియర్‌ నాయకుడు బండారు సత్యనారాయణమూర్తి ఆరోపిం చారు.

అనాలోచితంగా కాలనీల లేఅవుట్లు
పైడివాడఅగ్రహారంలో కోతకు గురైన ఇళ్ల స్థలాల లే-అవుట్‌ను పరిశీలిస్తున్న బండారు, టీడీపీ నాయకులు


కొండ వాలులో అడ్డంగా ఇళ్ల స్థలాలా!

వర్షపు నీరు లేఅవుట్ల మీదకు వస్తుందని అధికారులకు తెలియదా?

తమ స్థలాలు ఏవో లబ్ధిదారులు గుర్తుపడతారా?

మాజీ మంత్రి బండారు ధ్వజం

పైడివాడఅగ్రహారంలో ఇళ్ల స్థలాల లేఅవుట్‌ పరిశీలన

మళ్లీ అభివృద్ధి చేయాలని డిమాండ్‌

సబ్బవరం, జూన్‌ 28: విశాఖ నగర పరిధిలోని పేదలకు ఇళ్ల స్థలాల కోసం మండలంలో వేసిన లే-అవుట్లు అధికారుల అనాలోచిత నిర్ణయాలకు అద్దం పడతున్నాయని మాజీ మంత్రి, టీడీపీ సీనియర్‌ నాయకుడు బండారు సత్యనారాయణమూర్తి ఆరోపిం చారు. మంగళవారం ‘ఆంధ్రజ్యోతి’లో వచ్చిన ‘లే అవుట్‌’ కఽథనానికి స్పందించిన ఆయన పైడివాడ అగ్రహారంలో ఇళ్ల స్థలాల లే-అవుట్‌ను పార్టీ శ్రేణులతో కలసి సందర్శించారు. వర్షపు నీటి ప్రవాహంతో కోతకు గురైన రహదారులు, ఇళ్ల స్థలాలు, కొట్టుకుపోయిన హద్దురాళ్లను, గెడ్డ ప్రవహించే ప్రాంతాలను పరిశీలిం చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 320 ఎకరాల భారీ లేవుట్‌ చుట్టూ కొండలు వున్నాయని, వీటిపై కురిసిన వర్షపు నీరు లేఅవుట్‌పైకి వస్తుందన్న విషయం అధికారులకు తెలియదా? అని ప్రశ్నించారు. రెవెన్యూ రికార్డుల్లో ‘గెడ్డ వాగు’ అనిలేదన్న సాకుతో అనాలోచితంగా గెడ్డలను కప్పేసి లేఅవుట్‌ వేశారని ధ్వజమెత్తారు. ఇక్కడ కొండల మీద కురిసే వర్షపు నీటి ఆధారంగా దిగువు ఐదారు సాగునీటి చెరువులు ఉన్నా యని, గెడ్డలకు అడ్డంగా లేఅవుట్‌ వేయడంతో చెరువు లకు నీరు చేరక ఆయకట్టు బీడువారే పరిస్థితి నెలకొందని బండారు అన్నారు. కొద్దిపాటి వర్షాలకే లే-అవుట్‌ మొత్తం కొట్టుకుపోయిందని, రానున్న రోజు ల్లో భారీ వర్షాలు కురిస్తే లబ్ధిదారుల పరిస్థితి ఏమిటి, ఏ స్థలం ఎవరిదో గుర్తుపట్టగలరా? అని ప్రశ్నించారు. ఈ లేఅవుట్‌లను మళ్లీ అభివృద్ధి చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు.

లేఅవుట్లలో అక్రమాలు

సబ్బవరం మండలంలో ఏర్పాటు చేసిన ఇళ్ల స్థలాల లేఅవుట్లలో భారీ అక్రమాలు జరిగాయని బండారు ఆరోపించారు. భూమి చదును, అభివృద్ధి పేరుతో అధికార పార్టీ నాయకులు భారీ ఎత్తున గ్రావెల్‌, మట్టి తరలించుకుపోయారని ఆయన విమర్శించారు. లేఅవుట్‌ను ఆనుకుని వున్న గుట్టపై  వేంకటేశ్వర స్వామి ఆలయం కడతామని భూములు ఇచ్చిన రైతులకు ఉమ్మడి జిల్లా కలెక్టర్‌ మల్లికార్జున చెప్పారని, ఇళ్ల స్థలాలు పంపిణీ చేసే సమయానికి వైఎస్‌ఆర్‌ విగ్రహం ఏర్పాటు చేసి రైతులను మోసం చేశారని ఆరోపించారు. వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఇక్కడి ప్రజలకు ఏమి చేశారని ఆయన విగ్రహం పెట్టారని ప్రశ్నించా రు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించనని అనకా పల్లి కలెక్టర్‌ స్పష్టం చేసినందునే ముఖ్యమంత్రి పట్టాలు పంపిణీ చేసిన సభకు విశాఖ కలెక్టర్‌ మల్లికా ర్జున అధ్యక్షత వహించారన్నారు. ఒక జిల్లా పరిధిలో జరిగే అధికారిక కార్యక్రమానికి మరో జిల్లా కలెక్టర్‌ ఎలా అధ్యక్షత వహిస్తారని, ఇది ప్రొటోకాల్‌కు పూర్తి విరుద్ధమని బండారు అన్నారు. సబ్బవరం, పెందుర్తి ఎమ్మార్వోలు తమ పరిధి దాటి వ్యవహరిస్తున్నారని, టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే వారిపై క్రమ శిక్షణ చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు బండారు అప్పల నాయుడు, బుచ్చిరాజు, మిడతాడ మహాలక్ష్మినాయుడు, అక్కిరెడ్డి దుర్గినాయుడు, బొబ్బరి కన్నారావు, శీరం అప్పలరాజు, తాతారావు, అప్పారావు, గణేశ్‌, తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2022-06-29T06:03:38+05:30 IST