ముప్పుపై కనువిప్పు ఏదీ?

ABN , First Publish Date - 2020-06-07T08:13:00+05:30 IST

రెండు నెలల విరామం తరువాత మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లి తిరిగి రావడంతో ఫిషింగ్‌ హార్బర్‌ కిటకిటలాడుతోంది.

ముప్పుపై కనువిప్పు ఏదీ?

ఫిషింగ్‌ హార్బర్‌లో కానరాని భౌతిక దూరం

అమలుకాని కరోనా నిబంధనలు

పరిశుభ్రతకు తిలోదకాలు

మాస్కులు కూడా అంతంతమాత్రమే

ఒక్క కేసు వస్తే.. వేలమందికి పరీక్షలు చేయాల్సిందే!!


(విశాఖపట్నం - ఆంధ్రజ్యోతి)

రెండు నెలల విరామం తరువాత మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లి తిరిగి రావడంతో ఫిషింగ్‌ హార్బర్‌ కిటకిటలాడుతోంది. భారీ సైజు రొయ్యలు, పీతలు, కానాగడతలు, కోనేం, వంజరాలు కుప్పలుగా పోసి వేలం ద్వారా విక్రయిస్తున్నారు. వీటిని కొనుగోలు చేయడానికి వ్యాపారులు, హోటళ్ల యజమానులు, మాంసాహార ప్రియులు తరలిరావడంతో హార్బర్‌ కిక్కిరిసిపోతున్నది. ఇది కరోనా కాలం అనే విషయం ఏ ఒక్కరూ గుర్తించడం లేదు. వేలాది మంది అక్కడికి వస్తుండగా వారిలో అతి కొద్ది మంది మాత్రమే మాస్కులు ధరిస్తున్నారు. చేపలను విక్రయించే మత్స్యకార మహిళలు అసలు ఎటువంటి నిబంధనలు పాటించడం లేదు. ఒకరినొకరు తోసుకుంటూ, రాసుకుంటూ చేపలను కొనుగోలు చేస్తున్నారు. ఈ హార్బర్‌లో ఏ ఒక్కరికైనా కరోనా లక్షణాలు ఉంటే... అక్కడికి వచ్చిన అందరికీ ఆ వైరస్‌ సోకే అవకాశం ఉంది.  ఒకేసారి వేయి మందికిపైగా పరీక్షలు నిర్వహించాల్సి వస్తుంది. ఇది అత్యంత ప్రమాదకర పరిస్థితికి దారి తీస్తుంది.


ఇక్కడ కరోనా నిబంధనలు అమలు చేయడానికి మత్స్యకారుల అసోసియేషన్‌, మత్స్య శాఖ, పోలీస్‌ విభాగాల నుంచి పరిమిత సంఖ్యలో కొందరు ఉన్నా ఎటువంటి ప్రయోజనం కనిపించడం లేదు. సిబ్బంది మైకులో ప్రచారం చేస్తున్నా వారి మాటలు సముద్రపుహోరులో కొట్టుకుపోతున్నాయి. ఏ ఒక్కరూ పట్టించుకోవడం లేదు. వాస్తవానికి ఏప్రిల్‌ 14 అర్ధరాత్రి నుంచి మే 31 వరకు సముద్రంలో చేపలవేటకు విరామం ప్రకటించారు. కానీ అంతకు ముందే కరోనా జాగ్రత్తల్లో భాగంగా పోలీసులు హార్బరులోకి రాకపోకలు నిషేధించారు. మార్చి-ఏప్రిల్‌ మొదటి వారాల్లో చేపల కొనుగోళ్లకు పెద్దఎత్తున జనాలు రావడంతో కరోనా వ్యాపిస్తోందని, హార్బర్‌లో చేపల అమ్మకాన్ని కూడా నిషేధించారు.


ఆ తరువాత ప్రభుత్వం 45 రోజుల వేట విరామం ప్రకటిచడంతో లావాదేవీలు తగ్గిపోయాయి. ఇది మే 31తో ముగిసిపోవడం, జూన్‌ 1 నుంచి అంతా వేటకు వెళ్లడంతో మళ్లీ హార్బరులో చేపల అమ్మకాలు మొదలయ్యాయి. విరామం తరువాత వేట కావడంతో భారీగా చేపలు వస్తున్నాయి. వాటిని కొనడానికి అంతా ఎగబడుతున్నారు. ఆ యావలో పడి ఎవరూ కరోనా జాగ్రత్తలు తీసుకోవడం లేదు. అధికారులు తక్షణమే స్పందించి ఇక్కడ కఠిన నిబంధనలు అమలు చేయకపోతే... చాలా ప్రమాదకరమైన పరిస్థితులు ఎదుర్కొనాల్సి వస్తుంది. ఇక్కడ చేపలు కొని వీధుల్లో తిరిగి విక్రయించే మహిళల ద్వారా కరోనా నగరం నలుమూలల వ్యాపించే ప్రమాదం ఉంది. అఽధికారులూ పారా హుషార్‌!!

Updated Date - 2020-06-07T08:13:00+05:30 IST