నిరుద్యోగ గర్జనలు

ABN , First Publish Date - 2021-09-18T07:49:59+05:30 IST

రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌పై కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో ధర్మయుద్ధం ప్రకటిస్తున్నామని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అన్నారు.

నిరుద్యోగ గర్జనలు

  • హైదరాబాద్‌ పరేడ్‌ గ్రౌండ్‌లో భారీ సభతో శ్రీకారం
  • అర శాతం ఉన్న వాళ్లకి మూడు మంత్రి పదవులా?
  • 12 శాతం ఉన్న మాదిగలకు ఒక్కటీ ఎందుకివ్వరు?
  • కొడుకునో, అల్లుడినో తప్పించి మాదిగ ఎమ్మెల్యేకు ఇవ్వాలి
  • తెలంగాణ విముక్తి కోసం 19 నెలలు పోరాడతాం
  • కేసీఆర్‌ మనవడు చదివే బడిలోనే పేదోళ్లను చదివించాలి
  • కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చి ఉంటే వేలమంది బతికేవాళ్లు
  • మద్యం రాబడిపై సీఎం ఆశతో నడిరోడ్డుపై కుటుంబాలు
  • తాగుబోతులకు కేసీఆర్‌, డ్రగ్స్‌కు కేటీఆర్‌ అంబాసిడర్లు
  • ఏ వ్యాపారం చేసి ఇన్ని ఆస్తులు కూడబెట్టారు?: రేవంత్‌రెడ్డి
  • కాంగ్రెస్‌ వల్లే కేసీఆర్‌కు, ఆయన కుటుంబానికి పదవులు 
  • దేశభక్తి గురించి బీజేపీ నేతలు మాట్లాడడమా?: ఖర్గే
  • గజ్వేల్‌లో కాంగ్రెస్‌ దళిత, గిరిజన ఆత్మగౌరవ సభ

బంగారు తెలంగాణ తెస్తారని నమ్మి ఓటేసిన ప్రజల బతుకులను కేసీఆర్‌ ఆగం చేస్తున్నారు. మద్యంతో ఆదాయం పెంచాలనే దుర్మార్గపు ఆలోచనతో పేద కుటుంబాలను రోడ్డున పడేస్తున్నారు. నేరాలు, ఘోరాలతోపాటు కలహాలకు ఈ మద్యం కారణమవుతోంది. ఉమ్మడి రాష్ట్రంలో 10 వేల కోట్లున్న ఆదాయాన్ని తెలంగాణలో 36 వేల కోట్లకు పెంచారు.

- టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి


సిద్దిపేట/గజ్వేల్‌, సెప్టెంబరు 17 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌పై కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో ధర్మయుద్ధం ప్రకటిస్తున్నామని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అన్నారు. ఈ 19 నెలలు తెలంగాణ విముక్తి కోసం పోరాడతామని, రాష్ట్ర భవిష్యత్తును మార్చేస్తామని ప్రకటించారు. అక్టోబరు 2 నుంచి డిసెంబరు 9 వరకు నిరుద్యోగ గర్జనలు నిర్వహిస్తామని, హైదరాబాద్‌లోని పరేడ్‌ గ్రౌండ్‌లో భారీ సభకు శ్రీకారం చుట్టబోతున్నామని తెలిపారు. 1969లో తొలి ఉద్యమం, 2009లో రెండో ఉద్యమం జరిగాయని, ఇప్పుడు తుదిదశ తెలంగాణ ఉద్యమం చేసి గడీల పాలన నుంచి స్వయంపాలన దిశగా అడుగులేస్తామని అన్నారు. శుక్రవారం కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో గజ్వేల్‌లో నిర్వహించిన దళిత, గిరిజన ఆత్మగౌరవ దండోరా ముగింపు సభలో రేవంత్‌రెడ్డి ప్రసంగించారు. దళితులు, గిరిజనులు, మైనారిటీలను మోసం చేయడంలో కేసీఆర్‌ దిట్ట అని ఆరోపించారు. అరశాతం ఉన్న కులానికి ముఖ్యమంత్రితోపాటు మంత్రి పదవులు ఇచ్చారని, 12 శాతం ఉన్న మాదిగలకు ఒక్క మంత్రి పదవి కూడా ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. కొడుకు, అల్లుడిలో ఎవరో ఒకరిని మార్చి.. ఓ మాదిగ ఎమ్మెల్యేకు మంత్రి పదవి ఇవ్వగలరా? అని నిలదీశారు. తన మనవడు తినే సన్నబియ్యమే పేద విద్యార్థులంతా తింటున్నారంటూ చెప్పడం కాదని, తన మనవడు చదివే స్కూల్‌లో పేద పిల్లలను చదివించాలని డిమాండ్‌ చేశారు. విద్యార్థులు బలిదానాలు చేసుకున్నది సన్నబియ్యం కోసం, గొర్రెలు, బర్రెల కోసమేనా? అని ప్రశ్నించారు. ఇంటికో ఉద్యోగం ఇస్తానని చెప్పి కేసీఆర్‌ మోసం చేశారని, కానీ.. ఆయన కుటుంబంలో మాత్రం ఐదుగురికి పదవులు వచ్చాయని ఆరోపించారు. కల్వకుంట్ల కుటుంబం నుంచి తెలంగాణకు విముక్తి కావాలని అన్నారు.


నమ్మి ఓటేస్తే.. ఆగం చేస్తున్నారు..

బంగారు తెలంగాణ తెస్తారని నమ్మి ఓటేసిన ప్రజల బ్రతుకులను కేసీఆర్‌ ఆగం చేస్తున్నారని రేవంత్‌రెడ్డి ఆరోపించారు. మద్యంతో ఆదాయం పెంచాలనే దుర్మార్గపు ఆలోచనతో పేద కుటుంబాలను రోడ్డున పడేస్తున్నారని మండిపడ్డారు. నేరాలు, ఘోరాలతోపాటు కలహాలకు ఈ మద్యం కారణమవుతోందని తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో రూ.10 వేల కోట్లున్న మద్యం ఆదాయాన్ని తెలంగాణలో రూ.36 వేల కోట్లకు పెంచారని, పరిపాలనను పక్కనబెట్టి ఆదాయం కోసం ఎగబడుతున్నారని ఆరోపించారు. రబ్బరు చెప్పులతో తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించానని చెప్పిన కేసీఆర్‌కు ఇన్ని కోట్ల ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చాయని ప్రశ్నించారు. కేసీఆర్‌ తాగుబోతులకు బ్రాండ్‌ అంబాసిడర్‌గా మారితే.. ఆయన తనయుడు డ్రగ్స్‌ అమ్మకాలకు బ్రాండ్‌ అంబాసిడర్‌గా మారాడని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఓ చిన్నారిని పాశవికంగా హత్య చేసి చంపిన వాడిని ఏడు రోజుల్లో కూడా పట్టుకోకుండా ఉన్న పోలీసులు చేతగాని దద్దమ్మల్లా వ్యవహరించారని ఆరోపించారు. ఇలాంటి అఘాయిత్యాలపై సమీక్షలు చేయకుండా.. హుజూరాబాద్‌ ఎన్నికల కోసం కేసీఆర్‌ సమీక్షలు చేయడం దారుణమన్నారు. తన భూములు పెంచుకోవడానికి, వ్యాపారుల భూములు కాపాడడానికి పేదవాళ్ల భూములను మల్లన్నసాగర్‌, కొండపోచమ్మసాగర్‌లో ముంచారని విమర్శించారు. కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చకుండా వేలాది మంది ప్రాణాలను బలిగొన్నారని ఆరోపించారు. ప్రజల ఇబ్బందులను పట్టించుకోకుండా ముఖ్యమంత్రి ఓ మానవ మృగంలా వ్యవహరిస్తున్నారని, తెలంగాణ ప్రజలు కన్ను తెరిస్తే ఆయన కాలిపోవడం ఖాయమని అన్నారు. 


ప్రభుత్వంపై పీపుల్స్‌ చార్జిషీట్‌ 

జగదేవ్‌పూర్‌: గజ్వేల్‌ సభలో కాంగ్రెస్‌ నేతలు సీఎం కేసీఆర్‌పై పీపుల్స్‌ చార్జిషీట్‌ ప్రకటించారు. 15 మోసాల పేరిట రూపొందించిన ఈ చార్జిషీట్‌ను మల్లికార్జున ఖర్గే ఆవిష్కరించారు. మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ దీనిని చదివి వినిపించారు. 


సీఎం ఇలాకాలో కాంగ్రెస్‌ సభ సక్సెస్‌

ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రాతినిథ్యం వహిస్తున్న గజ్వేల్‌ నియోజకవర్గ కేంద్రంలో కాంగ్రెస్‌ పార్టీ తలపెట్టిన దళిత,గిరిజన ఆత్మగౌరవ దండోరా ముగింపు సభ ఆ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపింది. వారు ఊహించిన దానికంటే ఎక్కువ జనసమీకరణ జరిగిందని పేర్కొన్నారు. పెద్ద సంఖ్యలో కార్యకర్తలు తరలివచ్చారు. గజ్వేల్‌ చుట్టూరా కాంగ్రెస్‌ కటౌట్లు, భారీ ఫ్లెక్సీలు ఆకర్షించాయి. గజ్వేల్‌లోని రహదారులన్నీ కిక్కిరిసి కనిపించాయి. తాము లక్ష మంది వస్తారనుకుంటే 2లక్షల మంది దాటిపోయారని రేవంత్‌ రెడ్డి ప్రకటించారు. గజ్వేల్‌ నియోజకవర్గంలోని వంటిమామిడి నుంచి ప్రజ్ఞాపూర్‌ వరకు ద్విచక్రవాహనాల ర్యాలీతో వచ్చారు. అక్కడి నుంచి గజ్వేల్‌లోని సభాస్థలి దాకా ఓపెన్‌ టాప్‌ వాహనంలో అభివాదం చేస్తూ చేరుకున్నారు. ఎక్కడి చూసినా రేవంత్‌ రెడ్డి పేరు మార్మోగింది. ఈ సభకు ఎంపీలు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మినహా దాదాపు పార్టీ ముఖ్య నాయకులంతా హాజరై తాము ఒక్కటిగానే ఉన్నామనే సంకేతాన్నిచ్చారు. అయితే మెదక్‌ జిల్లాలో కాంగ్రె్‌సకు ఉన్న ఏకైక ఎమ్మెల్యే జగ్గారెడ్డికి మాట్లాడే అవకాశం లభించలేదు. తనపై ఉన్న కేసుకు సంబంధించి సాయంత్రం 5 గంటల వరకు జగ్గారెడ్డి కోర్టులోనే ఉండి.. సభకు ఆలస్యంగా హాజరయ్యారు.


దేశం కోసం వారి ఇళ్లలో కుక్కయినా చచ్చిందా?

‘‘దేశభక్తి గురించి బీజేపీ నేతలు మాట్లాడటమా? దేశం కోసం వారి ఇళ్లలో కనీసం ఒక కుక్కైనా చచ్చిందా? కాంగ్రెస్‌ 70 ఏళ్లు అధికారంలో ఉండి దేశానికి ఏం చేసిందని మోదీ, కేసీఆర్‌ అంటున్నారు. కానీ, మీరు పుట్టకముందే దేశం కోసం పోరాడాం. దేశానికి స్వాతంత్య్రం తెచ్చిందే కాంగ్రెస్‌ పార్టీ. కాంగ్రె్‌సతోనే రిజర్వేషన్లు వచ్చాయి. ఎంతో మంది ఎమ్మెల్యేలు, ఎంపీలు అయ్యారు. ఇందిరాగాంధీ, రాజీవ్‌గాంధీ దేశం కోసం ప్రాణత్యాగాలు చేశారు. కాంగ్రె్‌సది త్యాగాల చరిత్ర’’ అని రాజ్యసభ ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే అన్నారు. గజ్వేల్‌లో దళిత, గిరిజన ఆత్మగౌరవ దండోరా సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. అంబానీ, అదానీల కోసమే మోదీ, అమిత్‌ షా పనిచేస్తున్నారని ఆరోపించారు. కేసీఆర్‌కు, ఆయన కుటుంబసభ్యులకు పదవులు వచ్చాయంటే.. అది కాంగ్రెస్‌ పార్టీ, సోనియాగాంధీ త్యాగమేనన్నారు. కాంగ్రెస్‌ పార్టీ ఎవరికీ భయపడదని, లోకకల్యాణం కోసం పనిచేస్తుందని ఖర్గే తెలిపారు. మోదీ, కేసీఆర్‌ ప్రభుత్వాలు గుడ్డి ప్రభుత్వాలుగా మారాయని, వాటికి దారి చూపేందుకు సెల్‌ఫోన్‌ లైట్లు వేసి దారి చూపాలని ఖర్గే అనడంతో సభికులంతా తమ సెల్‌ఫోన్ల లైట్లు వేశారు. కాగా, తెలంగాణ రాష్ట్రంలో ప్రశ్నించేవారికి బ్రతికే హక్కు లేదన్నట్లుగా సీఎం కేసీఆర్‌ వ్యవహరిస్తున్నారని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. హామీలు ఇచ్చి విస్మరించే ఈ ప్రభుత్వం 18లక్షల మందికి 10లక్షల చొప్పున దళిత బంధు ఇస్తామంటే ప్రజలు నమ్ముతారా? అని ప్రశ్నించారు. టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్‌ మధు యాష్కీ, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, వి.హన్మంతరావు,  పొన్నాల లక్ష్మయ్య, ఎమ్మెల్యేలు శ్రీధర్‌బాబు, సీతక్క, షబ్బీర్‌ అలీ, అజారుద్దీన్‌ మాట్లాడారు.

Updated Date - 2021-09-18T07:49:59+05:30 IST