Abn logo
Sep 23 2021 @ 00:29AM

అగ్నిపర్వతంలా నిరుద్యోగం

ధరల పెరుగుదల, అవినీతి, కులాధార రిజర్వేషన్లు, కొత్త సాగుచట్టాలు మొదలైన అంశాలపై బ్రహ్మాండమైన ఉద్యమాలను నిర్వహించవచ్చు. ప్రజలు వాటికి సంపూర్ణ మద్దతు ఇస్తారు కూడా. అయితే అంతకంతకూ పెరిగిపోతున్న నిరుద్యోగ సమస్యపై రాజకీయ సమీకరణలు చేయడం అసాధ్యమని పలువురు విజ్ఞులు విశ్వసిస్తున్నారు. నేను దానితో విభేదిస్తున్నాను. 


దేశమంతటా తాండవిస్తున్న నిరుద్యోగం సమీప భవిష్యత్తులోనే ఒక మహాఉద్యమానికి దారితీస్తుందని నేను విశ్వసిస్తున్నాను. దేశవ్యాప్తంగా నిరుద్యోగులందరూ ఆ సందర్భంగా సంఘటితమవుతారని గట్టిగా భావిస్తున్నాను. వారి ఆందోళన తప్పకుండా దావానలంలా వ్యాపిస్తుంది. ఎక్కడ, ఎప్పుడు ఆ మహాఅగ్గి రగులుతుందో ప్రస్తుతానికి మనకు తెలియదు. 


నిరుద్యోగం ఎంత తీవ్రంగా ఉన్నా అది మహా ఉద్యమానికి దారితీయదని భావిస్తున్న వారి వాదనలు ఏమిటో నిశితంగా చూద్దాం. ఈ వాదన చేస్తున్న వారిలో ఒకరైన మహేశ్ వ్యాస్ నేతృత్వంలోని సిఎమ్ఐఇ (సెంటర్ ఫర్ మానిటరింగ్ ఆఫ్ ఇండియన్ ఎకానమీ) నిరుద్యోగానికి సంబంధించిన ప్రామాణిక సమాచారాన్ని ఎప్పటికప్పుడు నివేదిస్తూ దేశ ప్రజలను, ప్రభుత్వాలను అప్రమత్తం చేస్తుంటుంది. నిరుద్యోగ సమస్య ఎంత తీవ్రంగా ఉన్నా అది దేశ జనాభాలో చాలా తక్కువ మందిని ప్రభావితం చేస్తుందనేది వారి వాదన. పైగా ఆ ప్రభావితులు కూడా తమ వ్యక్తిగత వైఫల్యాల వల్లే నిరుద్యోగులుగా ఉన్నామని విశ్వసించేవారే. తమ సమస్యకు రాజకీయ పరిష్కారం అవసరమని భావించేవారు అతి తక్కువమందేనని చెప్పవచ్చు. మరీ ముఖ్యమైన విషయమేమిటంటే నిరుద్యోగులు సంఘటితంగా లేరు కనుక నిరుద్యోగం ఎటువంటి ఆందోళనలకు దారితీయదనేది మహేశ్ వ్యాస్ తదితరుల వాదన. ఇది సంప్రదాయ వివేకం మాత్రమే. కొవిడ్ మహమ్మారితో మన ఆర్థిక వ్యవస్థకు ఎదురయిన సమస్యల దృష్ట్యా ఆ సంప్రదాయ వివేకంపై పునరాలోచన చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. 


నిరుద్యోగానికి సంబంధించిన ఒక ముఖ్యమైన అంశం నిరుద్యోగుల సంఖ్య. నిరుద్యోగులలో ఎంత మంది రాజకీయ సమీకరణలకు అందుబాటులో ఉంటారు? అధికారిక, అనధికారిక అంచనాల కంటే నిరుద్యోగిత శాతాలు ఇంకా అధికంగా ఉంటాయనేది ఒక కఠోర వాస్తవం. గత నెలలో దేశ వ్యాపిత నిరుద్యోగిత రేటు 8.3శాతమని ఉందని సిఎమ్ఐఇ అంచనా వేసింది. అంటే మన దేశంలో 3.5 కోట్ల మంది నిరుద్యోగులుగా ఉన్నారు. చాలా పెద్ద సంఖ్య, సందేహం లేదు. అయితే దేశంలో అర్హులైన ఓటర్లలో వీరు 4 శాతం కంటే తక్కువ. కొవిడ్ ఉపద్రవం ప్రారంభం కాకముందు నిరుద్యోగిత రేటు 7.8 శాతమని అధికారిక వర్గాలు అంచనా వేశాయి. నిజానికి ఇవి చాలా తక్కువ అంచనాలు. ఎందుకని? ఉద్యోగం చేయదలుచుకుని, దాని కోసం ప్రయత్నించి నిరుద్యోగులుగా మిగిలిపోయిన వారిని మాత్రమే పరిగణనలోకి తీసుకున్నారు. విస్తృత ప్రాతిపదికన నిరుద్యోగాన్ని గణిస్తే 2021 ఆగస్టులో నిరుద్యోగిత రేటు 13.8 శాతంగా ఉంటుందని సిఎమ్ఐఇ అంచనా వేసింది. అంటే 6.1 కోట్ల మంది నిరుద్యోగులుగా ఉన్నారు. ప్రపంచ ప్రమాణాల ప్రకారం మన దేశ జనాభాలో 63 కోట్ల మంది పని చేసేవారై ఉండాలి. కానీ కేవలం 39 కోట్ల మంది మాత్రమే కార్మికులుగా లేదా ఉద్యోగులుగా ఉన్నారు. 24 కోట్ల మంది నిరుద్యోగులుగా మిగిలిపోయారు. అయితే ఇంతమంది నిరుద్యోగులుగా ఉన్నా దాని ప్రభావం దేశ రాజకీయాలపై లేదు. ఈ నిరుద్యోగులతో పాటు ఇంకా నాలుగు రకాల నిరుద్యోగశ్రేణులు ఉన్నాయి. వాటిని కూడా పరిగణనలోకి తీసుకోవాలి. 


వీరిలో మొదటి వారు ‘కాబోయే నిరుద్యోగులు’. కళాశాలలు, విశ్వవిద్యాలయాలలో విద్యార్థులుగా కాలక్షేపం చేస్తున్నవారి సంఖ్య తక్కువేమీ కాదు. మన ఉన్నత విద్యారంగంపై జరిగిన తాజా సర్వే దిగ్భ్రాంతికరమైన వాస్తవాలను వెల్లడించింది. ఉన్నతవిద్యను అభ్యసిస్తున్నవారు మొత్తం 3.7కోట్ల మంది కాగా వారిలో దాదాపు రెండుకోట్ల మంది, విద్యాభ్యాసం అనంతరం ఉద్యోగం లభించేందుకు అవకాశం లేని ఉన్నత విద్యనే అభ్యసిస్తున్నారు! బిఇ, బిటెక్, ఎంబిఏ, బిఎడ్ కోర్సులు లేదా ఎంఎస్సీ/ ఎం‌కామ్ మొదలైన కోర్సులు చేస్తున్న ప్రతి ఒక్కరికీ ఉద్యోగం లభించినా ఇంకా 2.1 కోట్ల మంది నిరుద్యోగులుగా మిగిలిపోతారు. వీరిలో అత్యధికులు తమ ఉన్నత విద్యాభ్యాసాన్ని బిఏ, బికామ్, బిఎస్‌సితో సరిపుచ్చినవారు లేదా దూరవిద్యలో డిగ్రీ లేదా డిప్లొమా పొందిన వారే. వీరు ఇంకా అధికారికంగా నిరుద్యోగులు కారు. అయితే త్వరలో నిరుద్యోగుల శ్రేణుల్లో చేరనున్నామనే విషయం వారికి తెలుసు. మూడో నిరుద్యోగశ్రేణి యథార్థ నిరుద్యోగులు. తాము ఇంకా నిరుద్యోగులం కామని వీరు భావిస్తుంటారు. నిజానికి వారు నిరుద్యోగులే. ఏం చేస్తున్నారని వారిని అడగండి, పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నామని చెబుతారు. అయితే వారిలో కేవలం పదిశాతం మందికి మాత్రమే సర్కారీ ఉద్యోగం లభిస్తుంది. వారు ఎంతమంది ఉండేది పరిమాణాత్మకంగా చెప్పలేం. ఉత్తరప్రదేశ్‌లో 368 ప్యూన్ ఉద్యోగాలకు 23 లక్షల దరఖాస్తులు వచ్చాయంటే ఈ నిజ నిరుద్యోగులు ఎంతమంది ఉంటారో మీరే ఊహించుకోవచ్చు. 


చాలా ఘోరమైన ఉద్యోగాలు చేస్తున్నవారు నాలుగో నిరుద్యోగశ్రేణి కిందకు వస్తారు. ఈ నిరుద్యోగులు సంఘటిత, అసంఘటిత రంగాలు రెండిటిలోనూ ఉంటారు. భద్రతలేని కాంట్రాక్టు ఉద్యోగాలు చేస్తుంటారు. నిత్యం ఏదో ఒక భద్రమైన ఉద్యోగాన్ని సాధించుకునేందుకు ఎదురుచూస్తుంటారు. సంఘటిత రంగంలోని ఈ అభాగ్య ఉద్యోగులను రాజకీయ ఆందోళనల్లోకి సమీకరించేందుకు అవకాశముందని చెప్పవచ్చు.


ఇక చివరగా పాక్షిక నిరుద్యోగుల గురించి చూద్దాం. వీరు ఐదో నిరుద్యోగ శ్రేణి కిందకు వస్తారు. కొవిడ్ విపత్తు ప్రారంభమైన తరువాత ఇంతవరకు 1.1 కోట్ల మంది శ్రామికులు (88 లక్షల మంది వేతనోద్యోగులు, 20 లక్షల మంది స్వయం ఉపాధిపరులు) తమ జీవనాధారాలను కోల్పోయారని సిఎమ్ఐఇ అంచనా వేసింది. వీరిలో సగం మంది నిరుద్యోగులుగా మిగిలిపోగా మిగతా వారిలో అత్యధికులు వ్యవసాయరంగంలోను, దినసరి కూలీలుగాను బతుకులు ఈడుస్తున్నారు.


ఈ ఐదుశ్రేణుల నిరుద్యోగులూ మంచి ఉద్యోగం కోసం ఆరాటపడుతున్నవారే. మొత్తం 14.2 కోట్ల మంది నిరుద్యోగులు రాజకీయ ఆందోళనలకు అందుబాటులో ఉన్నారనేది స్పష్టం. కుటుంబానికి ఒకరు చొప్పున నిరుద్యోగి ఉన్నాడని భావిస్తే దేశంలోని మొత్తం కుటుంబాలలో సగానికి పైగా నిరుద్యోగంతో ప్రభావితమవుతున్నవే. మరింత స్పష్టంగా చెప్పాలంటే ఇంచుమించు ప్రతి మూడో కుటుంబం నిరుద్యోగం సమస్యతో సతమతమవుతున్నదే. ఉద్యోగాల సాధనకై దేశవ్యాప్త ఆందోళనకు మద్దతు ఇచ్చేవారు అందుబాటులో ఉన్నారు. మరి వారందరినీ సంఘటితపరిచి, ఒక సమైక్యశక్తిగా రూపొందించవలసిన అవసరముంది. 

యోగేంద్ర యాదవ్

జై కిసాన్ ఆందోళన్ సహ సంస్థాపకుడు

ప్రత్యేకంమరిన్ని...