అమ్మో 1వ తారీఖు

ABN , First Publish Date - 2020-08-31T06:42:42+05:30 IST

కరోనా లాక్‌డౌన్‌ ఆంక్షల నేపథ్యంలో ప్రజలకు రుణ చెల్లింపుల భారం నుంచి ఉపశమనం కలిగిస్తూ ఇచ్చిన ఆరు నెలల మారటోరియం సోమవారంతో ముగిసిపోతోంది. మరో మూడు నెలలపాటు మారటోరియం ప్రకటించాలని సామాన్యులు, కొందరు ఆర్థిక నిపుణులు సూచిస్తున్నా.. మారటోరియాన్ని కొనసాగిస్తే అది చెల్లింపుదారుల రుణ ప్రవర్తనపై ప్రభావం చూపుతుందని బ్యాంకులు భయపడుతున్నాయి! కొవిడ్‌ కారణంగా దెబ్బతిన్న వ్యాపారాలు, పలు రంగాల్లో ఉద్యోగాల కోత నేపథ్యంలో.. పారు బాకీల ముప్పు పొంచి ఉందని తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి!!...

అమ్మో 1వ తారీఖు

సునీల్‌ రావు (పేరు మార్చాం) ఓ ప్రైవేట్‌ ఉద్యోగి. ఆయన భార్య కూడా ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తుండటంతో ఇద్దరు పిల్లలను కార్పొరేట్‌ స్కూల్లో చేర్పించారు. ఏడాదికి ఫీజులకే రూ. లక్షన్నర అయ్యేది. రూ.60 లక్షలు లోను తీసుకుని ట్రిపుల్‌ బెడ్‌రూమ్‌ ఇల్లు కొన్నారు. రెండు నెలల్లోనే లాక్‌డౌన్‌తో పరిస్థితి తారుమారైంది. భార్య ఉద్యోగం పోయింది. ఆయన జీతంలో 20శాతం కోత పడింది. మారటోరియం వచ్చినా మొదటి రెండు నెలలూ ఉపయోగించుకోలేదు. తర్వాత తీసుకోక తప్పలేదు. జీతం తగ్గినా ఖర్చులు తగ్గలేదు. ఇప్పుడు మారటోరియం పొడిగింపూ లేనట్లే. వెరసి సునీల్‌రావుది దిక్కు తోచని స్థితి.



వెంకటేశ్‌ (పేరు మార్చాం) ఓ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి. ఏడాదికి 18 లక్షల ప్యాకేజీ. కానీ.. బిజినెస్‌ మీద ఆసక్తితో ఇద్దరు స్నేహితులను కలుపుకొని ఓ థీమ్‌ రెస్టారెంట్‌ను తెరిచారు. కొద్ది కాలంలోనే మంచి స్పందన రావడంతో మరో రెండు రెస్టారెంట్ల ప్రారంభానికి ఆయన అడ్వాన్స్‌లు ఇచ్చి ఆ దిశగా పనులు మొదలు పెట్టారు. ఉద్యోగం వదిలేస్తున్నానంటూ కంపెనీకి నోటీసు కూడా ఇచ్చారు. కరోనాతో ప్రణాళికలు తలకిందులయ్యాయి. రెస్టారెంట్‌ విస్తరణ ఆగిపోయింది. వ్యాపారం పూర్తిగా దెబ్బతింది. మారటోరియం తీసుకున్నా.. పొడిగించే అవకాశాలు లేకపోవడంతో తీసుకున్న అప్పుల వాయిదాలు ఎలా కట్టాలి? అని వెంకటేశ్‌ తల పట్టుకున్నారు. మళ్లీ ఉద్యోగంలో చేరదామంటే రూ. 12 లక్షలకు మించి ఇచ్చేది లేదని కంపెనీ స్పష్టం చేసింది. దక్కిందే చాలనుకుని ఉద్యోగంలో చేరడానికి వెంకటేశ్‌ సిద్ధపడ్డారు.



కరోనా లాక్‌డౌన్‌ ఆంక్షల నేపథ్యంలో ప్రజలకు రుణ చెల్లింపుల భారం నుంచి ఉపశమనం కలిగిస్తూ ఇచ్చిన ఆరు నెలల మారటోరియం సోమవారంతో ముగిసిపోతోంది. మరో మూడు నెలలపాటు మారటోరియం ప్రకటించాలని సామాన్యులు, కొందరు ఆర్థిక నిపుణులు సూచిస్తున్నా.. మారటోరియాన్ని కొనసాగిస్తే అది చెల్లింపుదారుల రుణ ప్రవర్తనపై ప్రభావం చూపుతుందని బ్యాంకులు భయపడుతున్నాయి! కొవిడ్‌ కారణంగా దెబ్బతిన్న వ్యాపారాలు, పలు రంగాల్లో ఉద్యోగాల కోత నేపథ్యంలో.. పారు బాకీల ముప్పు పొంచి ఉందని తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి!!



  • మధ్య తరగతి ప్రజల గుండెల్లో రైళ్లు
  • మారటోరియం గడువు ముగింపు.. లోన్లు కట్టాలి
  • చాలీచాలని జీతాలు... దాంట్లోనూ భారీగా కోతలు
  • వ్యాక్సిన్‌ వస్తే తప్ప పరిస్థితులు చక్కబడకపోవచ్చు
  • డబ్బులుంటే ఈఎంఐలు చెల్లించడమే మేలు: నిపుణులు
  • తొలి దశ మారటోరియం వినియోగించుకున్నవారు 31ు
  • రెండో దశలోనూ కొనసాగించినవారు 18 శాతమే
  • వారిలో చాలామంది పరిస్థితి ఇప్పటికీ అగమ్యగోచరమే
  • దెబ్బతిన్న వ్యాపారాలు.. పలు రంగాల్లో ఉద్యోగాల కోతతో
  • నాన్‌పెర్ఫార్మింగ్‌ లోన్ల ముప్పుపై బ్యాంకుల్లో తీవ్ర ఆందోళన


  • (హైదరాబాద్‌ సిటీ-ఆంధ్రజ్యోతి)

చాలామంది వేతన జీవులది ఇప్పుడిదే దైన్యం. కొందరి ఉద్యోగాలు పోయాయి. ఇంకొందరికి ఉన్నా జీతంలో కోత పెడుతున్నారు. గిరాకీలు లేకపోవడంతో వ్యాపారులకూ రాబడి లేకుండా పోయింది. దీంతో వ్యాపారం కోసమో, వ్యక్తిగత అవసరాల కోసమో, కొత్త ఇంటి కోసమో, వాహనాల కోసమో రుణాలు తీసుకున్న వారు సెప్టెంబరు 1వ తేదీ సమీపిస్తుండంతో వణికిపోతున్నారు. వాయిదాలు ఎక్కడి నుంచి కట్టాలనే దిగులు పట్టుకుంది. స్కూళ్లు తెరుచుకోకున్నా.. ఆన్‌లైన్‌ క్లాసులు మొదలు కావడంతో పిల్లల ఫీజుల భారం సరేసరి. వీటన్నిటి నేపథ్యంలో మఽధ్య తరగతి, ఎగువ మధ్య తరగతి ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారని, ఈఎంఐ మారటోరియాన్ని మరో 3 నెలలు పొడిగించకపోతే డీఫాల్టర్లు పెరిగే అవకాశం ఉంటుందని కొంతమంది ఆర్థిక నిపుణులు అంటున్నారు. ఇప్పటికే ఈ తరహా కేసులు చాలా ఎక్కువగా చూస్తున్నామని వారు చెబుతున్నారు. మరికొందరు ఆర్థిక నిపుణులేమో.. వీలైనంతవరకూ రుణాలు చెల్లించడమే మంచిదంటున్నారు. ఎక్కువ వడ్డీ ఉండే వ్యక్తిగత రుణాలు తీసుకున్న ఎంతోమంది పరిస్థితి బాగోలేకపోవడంతో చెల్లింపులకు సంబంధించి ప్రణాళికలను మార్చుతున్నామని ఓ ప్రైవేట్‌ సంస్థ ప్రతినిధి చెప్పారు.


సౌకర్యవంతంగా ఉన్న పథకాలకు మారేందుకు 2శాతం చార్జీలు చెల్లించడానికి కూడా సిద్ధపడుతున్నారని చెప్పారు. 6 నెలల మారటోరియం పెట్టుకున్న వారు దాని వడ్డీ చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నారని, మారటోరియం తీసుకోని వారు కష్టపడుతున్నారని పేర్కొన్నారు. ఇక.. కష్టమైనా గత 6 నెలలుగా ఈఎంఐలు కట్టినవారిది మరో బాధ. ఈ 6 నెలలుగా ఈఎంఐ కట్టడానికి తన సేవింగ్స్‌ మొత్తం ఖర్చు పెట్టేశానని, ఇకపై ఏం చేయాలో తెలియట్లేదని కరోనా దెబ్బకు ఉద్యోగం కోల్పోయిన నర్సింహరావు అనే వ్యక్తి తెలిపారు. కష్టపడి కొనుక్కున్న ఇల్లు వేలానికి వెళ్తుందేమోనన్న భయం పట్టుకుందని, తనకు ఉద్యోగం లేదని తెలిసి బంధువులు కూడా మొహం చాటేస్తున్నారని వాపోయారు. అయితే, పెద్ద కార్పొరేట్‌ కంపెనీలు రుణాలు ఎగవేస్తే ఏమీ చేయని బ్యాంకులు చిరుజీవుల విషయంలో మాత్రం ఫక్తు వడ్డీ వ్యాపారుల్లా వ్యవహరిస్తున్నాయని పలువురు ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ 5-6 నెలల వడ్డీని సెప్టెంబరు లో చెల్లించేయాలని, లేకుంటే ఆ వడ్డీని అసలులో కలుపుతామని ఒత్తిడి చేస్తున్నాయని వివరించారు. ఆర్థిక రంగం కోలుకునేందుకు ప్రభుత్వ ప్రకటనలేవీ ఊతమివ్వడం లేదని, కరోనాకు వ్యాక్సిన్‌ వస్తే గానీ ఆర్థిక రంగం గట్టేక్కే సూచనలు లేవని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. 




బ్యాంకుల పరిస్థితీ..

ఒకవైపు సామాన్యుల పరిస్థితి అలా ఉంటే.. మరోవైపు, మారటోరియం ముగింపుతో బ్యాంకులపైనా ఒత్తిడి పెరుగుతోంది. కరోనా కారణంగా కొన్ని వ్యాపారాలు పూర్తిగా దెబ్బతినడం.. పర్యాటక రంగం, విమానయాన రంగం, ఆతిథ్యసేవల రంగం, రియల్‌ ఎస్టేట్‌, సినిమా రంగం వంటివాటిలో ఉద్యోగాలు భారీగా పోవడం ఇందుకు కారణం. ఆయా వ్యాపారాల కోసం తీసుకున్న రుణాలు తీర్చడం.. వివిధ రంగాల్లో ఉద్యోగాలు కోల్పోయినవారు ఇంటి, వాహన రుణాలను చెల్లించడం.. ప్రస్తుత పరిస్థితుల్లో కష్టమే. ఈ మూడు నెలలుగా వాటిని మారటోరియం ఖాతాలో చూపారు. ఇప్పుడా కాలపరిమితి ముగియడంతో.. ఎన్ని రుణాలు పారు బాకీలుగా మిగిలిపోతాయోనన్న భయం బ్యాంకులది. జెఫరీస్‌ రిసెర్చ్‌ సంస్థ గణాంకాల ప్రకారం.. మొదటి దశ మారటోరియం (మార్చి, ఏప్రిల్‌, మే)లో అన్ని బ్యాంకులు, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకున్నవారిలో 31 శాతం మంది దాన్ని ఉపయోగించుకోగా.. రెండో దశలోనూ దాన్ని కొనసాగించినవారి సంఖ్య కేవలం 18 శాతం. ఇది బ్యాంకులకు ఊరటనిచ్చే విషయమే అయినా.. ఆ 18 శాతంలో కొన్ని రుణాలు ‘నాన్‌ పెర్ఫార్మింగ్‌ లోన్లు’గా మిగిలిపోయే ప్రమాదం ఉందన్న ఆందోళన బ్యాంకుల్లో వ్యక్తమవుతోంది. అంతేకాదు.. మారటోరియంలో ఉన్న రుణాలపై ప్రభుత్వ బ్యాంకులు ఇస్తున్న వివరాలకు వాస్తవ పరిస్థితికి పొంతనలేదని.. ప్రభుత్వ బ్యాంకుల్లో వాస్తవంగా 68 శాతం రుణాల చెల్లింపులు జరగలేదని.. ఆర్బీఐ అంచనా వేస్తున్నట్టుగా సమాచారం. అదే నిజమైతే బ్యాంకులపై ఒత్తిడి మరింత తీవ్రంగా ఉంటుందనడంలో సందేహం లేదు.


ప్రైవేటు బ్యాంకులు, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థల పరిస్థితీ అంత మెరుగ్గా ఏమీ లేదు. ఉదాహరణకు.. రెండో దశలో హెచ్‌డీఎ్‌ఫసీ బ్యాంకు లోన్లలో 22 శాతం దాకా మారటోరియంలో ఉన్నట్టు అంచనా. మహీంద్రా ఫైనాన్స్‌ 48ు, చోళమండలం సంస్థ లోన్లలో 75 శాతం.. ఇలా వివిధ బ్యాంకులు, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థల లోన్లు భారీగా మారటోరియంలో ఉన్నాయి. వీటిల్లో కొన్ని లోన్లు తీసుకున్నవారు కట్టినా.. మరికొందరు అస్సలు కట్టే పరిస్థితిలో లేరు. రెండో దశలో కూడా మారటోరియం కొనసాగించారంటే వారి ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రంగా ఉన్నట్టే. సెప్టెంబరులో కొత్తగా వారి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుందన్న హామీ లేదు. ఉదాహరణకు.. కొవిడ్‌ సమయంలో హోటల్‌ వ్యాపారం పూర్తిగా దెబ్బతింది. కొన్ని పెద్ద హోటళ్లు ఈ దెబ్బను తట్టుకుని మళ్లీ వ్యాపారం మొదలుపెట్టినా.. ఎక్కువ వడ్డీలకు అప్పులు తెచ్చి పెట్టిన చిన్నచిన్న హోటళ్లవారి పరిస్థితి పూర్తిగా అగమ్యగోచరంగా ఉంది. బ్యాంకుల వద్ద వారు తీసుకున్న రుణాలు చెల్లించే పరిస్థితి ఎంతమాత్రం లేదు. ఇలాంటి రుణాల గురించే బ్యాంకులు ఆందోళన చెందుతున్నాయి. 


పరిస్థితులు నిరాశాజనకం!

ఇప్పుడు మార్కెట్లో పరిస్థితులు ఆశాజనకంగా లేవు. 50-60ు వ్యాపారా లు దెబ్బతిన్నాయి. దుకా ణం అద్దెలు, జీతాలు పోను ఈఎంఐలు కట్టాలి. మారటోరియం తీసుకుని ఉంటే ఇప్పుడు ఈఎంఐ లేదా లోను కాలపరిమితి పెరగొచ్చు. మారటోరియం వడ్డీ కూడా కలుస్తుంది. కాబట్టి ఈ సర్దుబాట్లతో వారికి మరింత నష్టం. దీంతో చాలామంది డీఫాల్టర్లు అయ్యే ప్రమాదం ఉంది. అలా కాకుండా వారికి మరికొంత సమయమిచ్చి, రుణాలు తీర్చడానికి అవకాశం ఇస్తే డీఫాల్టర్లుగా మారకుండా కాపాడవచ్చు. 

- పీఏ ఆర్‌.కౌశిక్‌, ద ఫండింగ్‌ డాక్టర్‌


రెండు మార్గాలు

బ్యాంకుల్లో అప్పు తీసుకున్న వారికి ప్రస్తుతం ఉన్న మార్గాలు రెండు. ఒకటి.. కష్టమైనా, నష్టమైనా సెప్టెంబరు 1 నుంచి ఈఎంఐలు చెల్లించడం. నిజానికి ఇదే మంచి ప్రత్యామ్నాయం. రెండోది.. బ్యాంకులతో మాట్లాడి తమ రుణాలను రీ షెడ్యూల్‌ చేసుకోవడం. అంటే ఈఎంఐ మార్చకుండా కాలపరిమితి పెంచుకోవడం. లేదంటే ఈఎంఐ తగ్గించుకుని కాల పరిమితినీ పెంచుకోవడం. కానీ దీని వల్ల నష్టం ఎక్కువ. తమ బడ్జెట్‌కు అనుగుణంగా రుణగ్రహీతలు తగు నిర్ణయం తీసుకోవాలి. మారటోరియం తీసుకున్న వారు ఈ ఐదారు నెలల ఈఎంఐలను ఒకేసారి కట్టే స్థోమత కలిగి ఉంటే కట్టేయడమే మంచిది. లేదంటే వడ్డీకి వడ్డీ చెల్లించాల్సి రావొచ్చు. 

- సునీల్‌, చార్టర్డ్‌ అకౌంటెంట్‌


Updated Date - 2020-08-31T06:42:42+05:30 IST