జాబ్‌ క్యాలెండర్‌ మళ్లీ ప్రకటించాలి

ABN , First Publish Date - 2021-06-22T04:49:51+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన జాబ్‌ క్యాలెండర్‌పై నిరసన వ్యక్తం చేస్తూ... యథార్థ పోస్టులతో మళ్లీ జాబ్‌ క్యాలెండర్‌ను ప్రకటించాలని డిమాండ్‌ చేస్తూ నిరుద్యోగ జేఏసీ, డీవైఎఫ్‌ఐ నాయకులు సోమవారం కలెక్టరేట్‌ ఎదుట ధర్నా చేశారు.

జాబ్‌ క్యాలెండర్‌ మళ్లీ ప్రకటించాలి
ధర్నా చేస్తున్న నిరుద్యోగ జేఏసీ, డీవైఎఫ్‌ఐ నాయకులు

కలెక్టరేట్‌ ఎదుట డీవైఎఫ్‌ఐ, నిరుద్యోగ జేఏసీ ధర్నా

కరోనా బాధితులను ఆదుకోవాలని రాజకీయ పక్షాల ఆందోళన


నెల్లూరు(హరనాథపురం), జూన్‌ 21 : 

రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన జాబ్‌ క్యాలెండర్‌పై నిరసన వ్యక్తం చేస్తూ... యథార్థ పోస్టులతో మళ్లీ జాబ్‌ క్యాలెండర్‌ను ప్రకటించాలని డిమాండ్‌ చేస్తూ నిరుద్యోగ జేఏసీ, డీవైఎఫ్‌ఐ నాయకులు సోమవారం కలెక్టరేట్‌ ఎదుట ధర్నా చేశారు. డీవైఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షుడు ఉడతా ప్రసాద్‌ మాట్లాడుతూ ప్రభుత్వం విడుదల చేసిన క్యాలెండర్‌లో గ్రూప్‌-1, 2 పోస్టులు కలిపి కేవలం 36 ఉన్నాయని, రాష్ట్రంలో వేలల్లో ఖాళీలు ఉన్నా వాటిని క్యాలెండర్‌లో పేర్కొనలేదని విమర్శించారు.  గ్రూపు - 3, 4 పోస్టుల ప్రస్తావన అసలే లేదన్నారు. నిరుద్యోగులు ఎదురు చూస్తున్నట్లు టీచర్‌, కానిస్టేబుల్‌, సచివాలయం, లైబ్రరీ సైన్సు పోస్టులు, ఏపీపీఎస్‌సీ గ్రూపు 1, 2, 3, 4 పోస్టుల సంఖ్య పెంచి క్యాలెండర్‌ను విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. జగన్‌ సీఎం అయిన తరువాత జరిగిన మొదటి అసెంబ్లీ సమావేశంలో రాష్ట్రంలో 1.83లక్షల ఉద్యోగ  ఖాళీలు ఉన్నాయని ప్రకటించారన్నారు. ఆ పోస్టులను ఈ క్యాలెండర్‌లో ఎందుకు చూపలేదని ప్రశ్నించారు. వలంటీర్లు ఉద్యోగులు కారని గతంలో స్వయంగా ముఖ్యమంత్రే ప్రకటించారని, నేడు వలంటీర్ల నియామకాలను ఉద్యోగాల లెక్కలో వేయటమేమిటని ప్రశ్నించారు. కొవిడ్‌ సమయంలో మాత్రమే వైద్య రంగంలో తాత్కాలిక నియామకాలు చేపట్టారు తప్ప ఏ ఇతర నియామకాలు ఈ రెండేళ్లలో జరపలేదని ఆరోపించారు. ఏపీఎస్‌ఆర్టీసీలో ఉన్న వారిని ప్రభుత్వంలో విలీనం చేసి వారందరినీ కొత్తగా నియమించినట్లు చూపించారన్నారు.  ఆప్కాస్‌ అనే సంస్థను ఏర్పాటు చేసి ఇప్పటికే పని చేస్తున్న ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులను అందులో నమోదు చేయించారే తప్ప కొత్తగా ఉద్యోగాల్లోకి ఎవరినీ తీసుకోలేదన్నారు.  పూర్తిస్థాయి పోస్టులతో జాబ్‌ క్యాలెండర్‌ను మళ్లీ ప్రకటించి తమ డిమాండ్లను పరిష్కరించకపోతే పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అనంతరం డీఆర్వో ఓబులేసుకు వినతిపత్రం అందచేశారు. ఈ కార్యక్రమంలో నిరుద్యోగ జేఏసీ కార్యదర్శి కార్తీక్‌, నాయకుడు ఖాసీం, డీవైఎఫ్‌ఐ నాయకులు కండే కోటేశ్వరరావు, ఫయాజ్‌, నరసింహ తదితరులు పాల్గొన్నారు.


ప్రభుత్వ పనితీరు ఘోరం

కరోనా బాధిత కుటుంబాలను ఆదుకోవాలని డిమాండ్‌ చేస్తూ ప్రభుత్వ పనితీరుకు నిరసనగా వివిధ రాజకీయ పార్టీల నాయకులు కలెక్టరేట్‌ ఎదుట ధర్నా చేశారు. డీఆర్వో చిన్న ఓబులేసుకు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా టీడీపీ నెల్లూరు పార్లమెంటు నియోజకవర్గ అధ్యక్షుడు అబ్దుల్‌ అజీజ్‌ మాట్లాడుతూ కరోనా కారణంగా ప్రజల స్థితిగతులు చిన్నాభిన్నం అయ్యాయని, ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి వెంటనే స్పందించి కరోనాతో మృతి చెందిన కుటుంబాలను ఆదుకోవాలని కోరారు. మృతుల కుటుంబాలకు రూ.10 లక్షలు, ప్రభుత్వ వైఫల్యం వల్ల చనిపోయిన వారి కుటుంబాలకు రూ.25 లక్షలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. మృతి చెందిన ఫ్రంట్‌ లైన్‌ వారియర్స్‌ కుటుంబాలకు రూ.50 లక్షలు ఇవ్వాలని, జర్నలిస్టులను తక్షణమే ఫ్రంట్‌ లైన్‌ వారియర్స్‌గా పరిగణించాలని కోరారు. రేషన్‌ కార్డు ఉన్న కుటుంబాలకు తక్షణ సహాయంగా రూ. 10 వేలు చెల్లించాలని, కరోనా తీవ్రత కొనసాగినంత కాలం నెలకు రూ.7500 వంతున అందించాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి ప్రభాకర్‌, కిసాన్‌ కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులురెడ్డి, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి జెన్ని రమణయ్య, నాయకులు సాబీర్‌ఖాన్‌, జలదంకి సుధాకర్‌,  రేవతి, గంగాధర్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-06-22T04:49:51+05:30 IST