రాజస్థాన్ నిరుద్యోగులు యూపీలో కాంగ్రెస్ ఆఫీస్ వద్ద నిరసన

ABN , First Publish Date - 2021-12-01T00:04:26+05:30 IST

రానున్న ఉత్తర ప్రదేశ్ శాసన సభ ఎన్నికల కోసం కాంగ్రెస్

రాజస్థాన్ నిరుద్యోగులు యూపీలో కాంగ్రెస్ ఆఫీస్ వద్ద నిరసన

లక్నో : రానున్న ఉత్తర ప్రదేశ్ శాసన సభ ఎన్నికల కోసం కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా ఇచ్చిన నినాదాలను రాజస్థాన్ నిరుద్యోగులు ఆమెను ప్రశ్నించడానికి ఉపయోగించుకుంటున్నారు. ఉత్తర ప్రదేశ్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైతే 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని ఆమె హామీ ఇచ్చారు. అదేవిధంగా ‘‘నేను బాలికను, నేను పోరాడతాను’’ అనే నినాదం ఇచ్చారు. 


రాజస్థాన్ నిరుద్యోగులు ఈ నినాదాలతో కూడిన ప్లకార్డులను ధరించి, లక్నోలోని కాంగ్రెస్ కార్యాలయం వద్ద నిరసన ప్రదర్శన నిర్వహించారు. రాజస్థాన్‌లో కాంగ్రెస్ అధికారంలో ఉన్న సంగతి తెలిసిందే. ప్రియాంక గాంధీ వాద్రాతో మాట్లాడే అవకాశం కల్పించాలని వీరు కన్నీళ్ళతో వేడుకుంటున్నారు. రాజస్థాన్ శాసన సభ ఎన్నికల్లో తాము కాంగ్రెస్‌కు మద్దతిచ్చామని, ఇప్పుడు తమను ఎవరూ పట్టించుకోవడం లేదని, అందుకే తప్పనిసరి పరిస్థితుల్లో ఉత్తర ప్రదేశ్ రావలసి వచ్చిందని చెప్తున్నారు. తమ బాధను ప్రియాంక గాంధీకి తెలియజేయాలని అనుకుంటున్నామని మీడియాకు తెలిపారు. 


తాము నాలుగు రోజుల నుంచి ఆరుబయట గడుపుతున్నామని, కాంగ్రెస్ కార్యాలయం నుంచి కనీసం ఒకరైనా వచ్చి, తమ బాధలను తెలుసుకుంటారని, తమ డిమాండ్లు నెరవేరేవిధంగా ప్రియాంక గాందీతో కానీ, రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్‌తో కానీ మాట్లాడతారని అనుకున్నామని తెలిపారు. 


రాజస్థాన్ అన్ఎంప్లాయ్‌మెంట్ యూనిఫైడ్ ఫెడరేషన్ ప్రెసిడెంట్ ఉపేన్ యాదవ్ మాట్లాడుతూ, తాము లాఠీ దెబ్బలకైనా, అరెస్టులకైనా సిద్ధమేనని తెలిపారు. తమకు సరైన హామీ లభించే వరకు ఇక్కడి నుంచి కదిలేది లేదన్నారు. రాజస్థాన్ ఎన్నికల సమయంలో తమకు కాంగ్రెస్ ఇచ్చిన హామీలను గుర్తు చేశారు. గతంలో తాను రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, అశోక్ గెహ్లాట్‌లను కలిశానని చెప్తూ, సంబంధిత ఫొటోలను చూపించారు. 


Updated Date - 2021-12-01T00:04:26+05:30 IST