ఉద్యోగం పోయి కష్టాల్లో ఉన్న భారతీయుడికి.. లాటరీ రూపంలో వరించిన అదృష్టం!

ABN , First Publish Date - 2021-07-23T14:51:58+05:30 IST

అదృష్టం ఎప్పుడు ఎవరిని ఏ రూపంలో ఎలా వరిస్తుందో చెప్పడం చాలా కష్టం. దుబాయ్ లాటరీలో భారత వ్యక్తికి కచ్చితంగా అలాంటి అదృష్టమే ఏరి కోరి మరి వరించింది.

ఉద్యోగం పోయి కష్టాల్లో ఉన్న భారతీయుడికి.. లాటరీ రూపంలో వరించిన అదృష్టం!

దుబాయ్: అదృష్టం ఎప్పుడు ఎవరిని ఏ రూపంలో ఎలా వరిస్తుందో చెప్పడం చాలా కష్టం. దుబాయ్ లాటరీలో భారత వ్యక్తికి కచ్చితంగా అలాంటి అదృష్టమే ఏరి కోరి మరి వరించింది. కరోనా కారణంగా ఉన్న ఉద్యోగం పోవడంతో దేశం కాని దేశంలో కష్టాల్లో పడ్డ భారతీయుడికి ఇలా లాటరీ రూపంలో అదృష్టం వరించింది. దుబాయ్‌లో ఉండే తమిళనాడుకు చెందిన నజీరాలీకి లక్కీ లాటరీ తగలడంతో జాక్‌పాక్ కొట్టాడు. ఈద్ అల్-అధా పండుగ రోజు తీసిన మహజూజ్ మిలియనీర్ డ్రాలో నజీరాలీ ఏకంగా 5లక్షల దిర్హమ్స్(సుమారు రూ.కోటికి పైగా) గెలుచుకున్నాడు. దీంతో 53 ఏళ్ల నజీరాలీ ఆనందానికి అవధుల్లేవు.


పండుగ రోజున దేవుడు తనకు ప్రసాదించిన వరంగా ఆయన పేర్కొన్నాడు. ఇది తన జీవితానికే అద్భుతమైన గిఫ్ట్‌గా తెలిపాడు. కొన్ని నెలల కింద కరోనా వల్ల ఉద్యోగం పోవడంతో తనతో పాటు దుబాయ్‌లో ఉన్న కుటుంబాన్ని తిరిగి స్వదేశానికి పంపించేశాడు అలీ. ఫ్యామిలీ మొత్తం తన మీద ఆధారపడి ఉండడం, అదే సమయంలో ఉన్న ఉద్యోగం పోవడంతో దిక్కుతోచని స్థితిలో పడిపోయాడు. కానీ, ఎప్పుడూ తనపై తనకు ఉన్న నమ్మకాన్ని కోల్పోలేదు. అదృష్టాన్ని బాగా నమ్మే నజీరాలీ ఉద్యోగ అన్వేషణలో ఉండగానే మరో వ్యక్తితో కలిసి మహజూజ్ లాటరీ టికెట్ కొనుగోలు చేశాడు. ఆ లాటరీనే ఇప్పుడు నజీరాలీకి అదృష్టాన్ని తెచ్చిపెట్టింది. 


తాజాగా తీసిన డ్రాలో వీరు కొన్న లాటరీ టికెట్‌కు రెండో బహుమతి తగిలింది. దీంతో 1 మిలియన్ దిర్హమ్స్ గెలుచుకున్నారు. అనంతరం ఇద్దరు చెరో సగం పంచుకోవడంతో నజీరాలీకి 5లక్షల దిర్హమ్స్ వచ్చాయి. తాను గెలిచిన ఈ భారీ నగదుతో తన కలను నెరవేర్చుకునేందుకు ఉపయోగిస్తానని చెప్పుకొచ్చాడు నజీరాలీ. దుబాయ్‌లో సొంత రెస్టారెంట్ ప్రారంభించాలనేది తన కలగా తెలిపాడు. ఇప్పుడు ఇది సాకారం కాబోతున్నందుకు చాలా సంతోషంగా ఉందన్నాడు. అలాగే కొంత సొమ్మును చారిటీకి వినియోగిస్తానని తెలిపాడు.  


Updated Date - 2021-07-23T14:51:58+05:30 IST