ప్రభుత్వ పనితీరుకు రోడ్లే నిదర్శనం

ABN , First Publish Date - 2021-10-20T04:41:03+05:30 IST

జిల్లాలోని రోడ్లపై ప్రయాణం చేస్తే తెలుస్తోంది.. ప్రభు త్వం పనితీరు ఎలా ఉందో.. గతుకులు పడిన రోడ్లపై ప్రయాణం నరక కూ పంగా మారిందని ఉండి ఎమ్మెల్యే మంతెన రామరాజు అన్నారు.

ప్రభుత్వ పనితీరుకు రోడ్లే నిదర్శనం
భీమవరం – గుడివాడ రహదారిపై పాదయాత్ర చేస్తున్న రామరాజు

భీమవరం – గుడివాడ రహదారిపై ఎమ్మెల్యే పాదయాత్ర

రహదారులకు మరమ్మతులు చేపట్టాలని డిమాండ్‌

బొండాడ డ్రెయిన్‌పై బ్రిడ్జి నిర్మించకపోతే ఉద్యమిస్తా


కాళ్ళ, అక్టోబరు 19 : జిల్లాలోని రోడ్లపై ప్రయాణం చేస్తే తెలుస్తోంది.. ప్రభు త్వం పనితీరు ఎలా ఉందో.. గతుకులు పడిన రోడ్లపై ప్రయాణం నరక కూ పంగా మారిందని ఉండి ఎమ్మెల్యే మంతెన రామరాజు అన్నారు. నియోజకవర్గంలో రోడ్లు అధ్వానంగా తయారై ప్రజలు, వాహనదారులు తీవ్రంగా ఇబ్బం దులు పడుతుండడంతో ప్రభుత్వ తీరును నిరసిస్తూ ఉండి ఎమ్మెల్యే మంతెన రామరాజు భీమవరం – గుడివాడ రాష్ట్రీయ రహదారిపై మంగళవారం పాదయాత్ర చేపట్టారు. మండలంలోని పెదఅమిరం నుంచి సీసలి వరకు పాదయాత్రకు సాగింది. పాదయాత్రలో భాగంగా ఎక్స్‌కవేటర్‌ను ఏర్పాటు చేసి రహదారిపై ఉన్న గోతులు సరిచేస్తూ గోతుల్లో కంకర నింపే పనులను ఎమ్మెల్యే స్వయంగా చేపట్టారు. అనంతరం విలేకరుల సమావేశంలో నియోజకవర్గంలో రోడ్ల పరిస్థితిపై ధ్వజమెత్తారు. వైసీపీ ప్రభుత్వం అధికారం చేపట్టాక నియోజకవర్గంలో ఒక్క రోడ్డు అభివృద్ధికి నోచుకోలేదని విమర్శించారు. గత ప్రభుత్వ హయాంలో 2018లో నియోజకవర్గంలో రోడ్లు అభివృద్ధికి రూ. 60 నుంచి రూ. 70 కోట్లు నిధులు మంజూరు చేయగా వైసీపీ అధికారం చేపట్టాక అవన్నీ రద్దు చేశారని ఆరోపించారు. ఇటీవల మండల పరిధిలో భీమవరం – గుడివాడ రహదారి నిర్మాణానికి రూ.3.5 కోట్లు కేటాయించినా పనులు ప్రారంభానికి కాంట్రాక్టర్లు ముందుకు రాని పరిస్థితి ఏర్పడిందన్నారు. ప్రభుత్వంపై కాంట్రాక్టర్లకు నమ్మకం లేకే పనులు చేయడానికి ముందుకు రావడం లేదని అన్నారు. అధికారులు రోడ్లు అభివృద్ధిపై నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఈ రోజు తాను పాదయాత్ర చేస్తున్నానని తెలుసుకున్న కొంత మంది వైసీపీ నేతలు ఎక్స్‌కవేటర్లు ఏర్పాటు చేసి పనులు ప్రారంభించడం మంచి పరిణామమన్నారు. ప్రభుత్వం స్పందించి పనులు చేపట్టాలని తమ పోరాట ఉద్దేశమ న్నారు.ఆకివీడు గ్రామంలో జాతీయ రహదారిపై ఆరు అడుగుల లోతు మేర పెద్ద గొయ్యి ఏర్పడిందని దాన్ని కూడా పూడ్చి ప్రజలకు ఇబ్బంది లేకుండా చూడాలని హితవు పలికారు. కాళ్ళ మండలం కోపల్లె గ్రామం వద్ద బొండాడ డ్రెయిన్‌పై బ్రిడ్జి నిర్మాణానికి గత ప్రభుత్వం సుమారు రూ.12 కోట్లు నిధులు మంజూరు చేయగా ప్రస్తుత ప్రభుత్వం రద్దు చేసిందన్నారు.ఇప్పటికైనా త్వరితగతిన బ్రిడ్జి నిర్మాణం చేపట్టకపోతే ఉద్యమం చేయడానికి కూడా వెనకాడమని హెచ్చరించారు.ఎమ్మెల్యేకు మద్దతుగాటీడీపీ శ్రేణులు హాజరయ్యారు. 


పాదయాత్రలో పోలీసుల అత్యుత్సాహం..


ఎమ్మెల్యే పాదయాత్రలో కాళ్ళ పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. ఎమ్మెల్యే సొంత నిధులతో ఏర్పాటు చేసిన జేసీబీతో గోతుల పూడ్చివేత కార్యక్రమం, గోతులను పూడ్చడానికి తెచ్చిన కంకరను ఎమ్మెల్యే పారతో సద్దే ప్రయత్నం చేయగా కాళ్ళ ఎస్‌ఐ అడ్డుకున్నారు. రోడ్డు మరమ్మతులు చేస్తుంటే, పోలీసులు అడ్డుకోవాలని చూడడం సబబు కాదని టీడీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో పోలీసులు వెనుతిరిగారు. ఈ కార్యక్రమంలో నాలుగు మండలాల పార్టీ అధ్యక్షులు, పలు గ్రామాల సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 



Updated Date - 2021-10-20T04:41:03+05:30 IST