శిల్పారామంపై చిన్నచూపు

ABN , First Publish Date - 2022-05-18T05:39:36+05:30 IST

జిల్లా కేంద్రమైన సంగారెడ్డి శివారులో అసంపూర్తిగా నిలిచిపోయిన శిల్పారామంపై ప్రభుత్వం చిన్నచూపు చూస్తున్నది.

శిల్పారామంపై చిన్నచూపు
సంగారెడ్డి శివారులోని శిల్పారామంలో నిరుపయోగంగా మారిన భవనం

నిధులు లేక పదేళ్లుగా నిరుపయోగం

నిర్మాణానికి రూ.10 కోట్లు మంజూరు

విడుదలైంది కేవలం రూ.3.95 కోట్లే

శిథిలమవుతున్న దుకాణ సముదాయాలు

అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా శిల్పారామం


సంగారెడ్డి టౌన్‌, మే 17: జిల్లా కేంద్రమైన సంగారెడ్డి శివారులో అసంపూర్తిగా నిలిచిపోయిన శిల్పారామంపై ప్రభుత్వం చిన్నచూపు చూస్తున్నది. నిధులు లేక పదేళ్లుగా శిథిలావస్థకు చేరి నిరుపయోగంగా మారింది. 2011లో అప్పటి కాంగ్రెస్‌ ప్రభుత్వం రూ.10 కోట్ల అంచనా వ్యయంతో 9.12ఎకరాల్లో శిల్పారామం నిర్మించాలని నిర్ణయించింది. హైదరాబాద్‌లోని శిల్పారామానికి ధీటుగా సంగారెడ్డిలోని మహబూబ్‌సాగర్‌ అలుగు సమీపంలో అన్ని హంగులతో శిల్పారామం ఏర్పాటు చేయాలని సంకల్పించిన ఎమ్మెల్యే జగ్గారెడ్డి 2011లో అప్పటి ముఖ్యమంత్రి కిరణ్‌  కుమార్‌రెడ్డికి ప్రతిపాదనలు అందజేశారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం 70 శాతం, కేంద్ర ప్రభుత్వం 30 శాతం నిధులతో శిల్పారామాన్ని పూర్తి చేయాలని ప్రణాళికలు రూపొందించారు. ఇందుకోసం తొలిదశలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రూ.3.95 కోట్లు విడుదల చేశాయి. ఈ నిధులతో శిల్పారామంలో ఫంక్షన్‌హాలుతో పాటు చేతి వృత్తిదారులు తయారు చేసిన వస్తువులు విక్రయించేందుకు షెడ్లు, ప్రజల ఆహ్లాదకరమైన వాతావరణం అందించేందుకు ఫౌంటెన్‌, ఓపెన్‌ సినిమా థియేటర్‌, పార్కు నిర్మించాలని నిర్ణయించారు. ఇందులో ఫంక్షన్‌హాలు, షెడ్లు, స్టాళ్లు నిర్మాణం పూర్తి చేశారు. అధికారుల పర్యవేక్షణ కొరవడడంతో దశాబ్దకాలంగా శిథిలావస్థకు చేరుకున్నాయి.


నిరుపయోగంగా..

సంగారెడ్డిని పర్యాటక కేంద్రంగా తీర్చిద్దిడంతో పాటు జిల్లా ప్రజలు ఆహ్లాదభరిత వాతావరణంలో ఉల్లాసంగా గడిపేందుకు నిర్మించిన శిల్పారామం నిరుపయోగంగా మారింది. ఈ శిల్పారామం నిర్మాణానికి రూ.10 కోట్లలో కేంద్రం తన వాటా కింద రూ.3కోట్లను విడుదల చేసింది.  ఆ నిధులను అప్పటి రాష్ట్ర ప్రభుత్వం తన ఖాతాలోకి మళ్లించి నిర్మాణానికి రూ.2.25కోట్లు విడుదల చేసింది. అలాగే రాష్ట్ర వాటా నుంచి రావాల్సిన 70 శాతం నిధుల నుంచి మొదటి దశగా రూ.1.70 కోట్లు విడుదల చేసింది. ఈ లెక్కన శిల్పారామం నిర్మాణం కోసం రూ.10కోట్లకు గాను మొదటిదశలో రూ.3.95 కోట్లు విడుదలయ్యాయి. ఇక రెండో దశలో మిగిలిన రూ.6.05 కోట్లు విడుదల చేయకపోవడంతో పనులు అసంపూర్తిగా నిలిచిపోయాయి. 2014లో తెలంగాణ ఆవిర్భావం, టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఏర్పాటు కావడంతో శిల్పారామం నిరాధరణకు గురైంది.


9.12 ఎకరాల్లో శిల్పారామం

సంగారెడ్డిలోని మహబూబ్‌సాగర్‌ అలుగు వద్ద 9.12 ఎకరాల విస్తీర్ణంలో శిల్పారామం నిర్మించాలని నిర్ణయించారు. ఈ మేరకు సరస్వతి శిశు మందిర్‌ ఎదురుగా ఉన్న సంగారెడ్డి శివారులోని 127/2,3 సర్వేనంబర్లలో 5.30 ఎకరాలు, 127/6 సర్వేనంబరులో 2 గుంటలు, కులబ్‌గూర్‌ శివారులోని 281/3 సర్వేనంబరులో 3.20 ఎకరాలను 2011లో అప్పటి ప్రభుత్వం కేటాయించింది. 


 అసాంఘిక కార్యకలాపాలకు అడ్డా..

సంగారెడ్డి శిల్పారామం అసంపూర్తిగా నిలిచిపోవడంతో అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారింది. శిథిలావస్థకు చేరుకున్న ఫంక్షన్‌హాలుతో పాటు షెడ్లలో కొంతమంది మద్యం తాగుతూ, పేకాట ఆడుతూ అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. వాటర్‌ ఫౌంటెన్‌, దుకాణ సముదాయాలు, మెట్లు పూర్తిగా ధ్వంసం అయ్యాయి. స్టాళన్నీ పిచ్చిమొక్కలతో నిండిపోయాయి. శిల్పారామం నిర్వహణ బాధ్యతను పర్యాటక శాఖకు అప్పగించినప్పటికీ పర్యవేక్షణ లేక నిరాధరణకు గురైంది. శిల్పారామంలో నిర్మించిన ఫంక్షన్‌హాలును గతంలో శుభకార్యాలకు కేటాయించేవారు. గత ఐదేళ్లుగా శుభకార్యాలకు కూడా ఇవ్వకపోవడంతో నిరుపయోగంగా మారింది. నిధులు విడుదల చేస్తే శిల్పారామం వినియోగంలోకి రావడంతో పాటు ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉల్లాసంగా గడిపే అవకాశం ఉంటుంది. శిల్పారామంతో పాటు పక్కనే ఉన్న మహబూబ్‌సాగర్‌ సుందరీకరణకు నిధులు కేటాయించడంపై మంత్రి హరీశ్‌రావు చొరవ తీసుకోవాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు.



Updated Date - 2022-05-18T05:39:36+05:30 IST